‘‘మనం’ సినిమా టైమ్‌లో నాన్న (నాగార్జున)గారితో కలిసి యాక్ట్ చేయాలన్నప్పుడు భయపడ్డాను. కానీ ‘బంగార్రాజు’కు ఆ ఇబ్బంది లేదు. ‘మనం’ అనుభవం ఉపయోగపడింది. నాన్నగారితో కంఫర్ట్‌గా యాక్ట్ చేశాను. ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాలన్నీ హిట్టవ్వాలి. ‘బంగార్రాజు’ వాటిలో ముందుండాలి (నవ్వుతూ)’’ అని నాగచైతన్య అన్నారు. నాగార్జున, నాగచైతన్య హీరోలుగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బంగార్రాజు: సోగ్గాడు మళ్లీ వచ్చాడు’. ఇందులో నాగార్జున సరసన రమ్యకృష్ణ, నాగచైతన్య సరసన కృతీ శెట్టి నటించారు. జీ స్టూడియోస్‌తో కలిసి నాగార్జున నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగచైతన్య చెప్పిన విశేషాలు.
⇔ ‘బంగార్రాజు’లో చిన్న బంగార్రాజు పాత్రలో కనిపిస్తాను. అల్లరి చేసే క్యారెక్టర్ అన్న మాట. నా చిలిపి చేష్టలను అదుపులో పెట్టేందుకు మా తాతగారు (బంగార్రాజు) వస్తారు. ఇక నా తండ్రి రాము పాత్ర కూడా సినిమాలో ఉంటుంది. కథ రీత్యా రాము అమెరికాలో ఉండటం వల్ల ఫోన్లో మాట్లాడుకుంటున్నట్లుగానే చూపిస్తాం.
⇔ ‘బంగార్రాజు’ క్యారెక్టర్ సవాల్‌గా అనిపించింది. ఈ పాత్ర కోసం ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రాన్ని చాలాసార్లు చూశాను. బంగార్రాజు పాత్రలో నాన్నగారు ఎలాగైతే డైలాగ్స్ చెబుతారో అలానే ఆయన చేత ముందుగా చెప్పించుకుని ఆ వాయిస్‌ల ద్వారా నేను యాక్ట్ చేశాను. అలాగే ఈ చిత్రం కోసం కర్రసాము నేర్చుకున్నాను.
⇔ నా కెరీర్‌లో సంక్రాంతికి వస్తున్న తొలి చిత్రం ఇది. పైగా ‘బంగార్రాజు’ వంటి సినిమాతో వస్తున్నప్పుడు ప్రేక్షకుల్లో అంచనాలు ఉంటాయి. వారి అంచనాలకు తగ్గట్లుగా, పండగ సినిమాలానే ‘బంగార్రాజు’ ఉంటుంది. ప్రతి పది నిమిషాలకో తమాషా ఉంటుంది. సర్పంచ్ నాగలక్ష్మీ పాత్రలో కృతీ శెట్టి బాగా చేసింది. మా అల్లరి, ఈగో క్లాషెస్‌లతో ఫస్టాప్ సాగితే.. సెకండాఫ్‌లో మా ఇద్దరి మధ్య ఉన్న హానెస్ట్ లవ్‌స్టోరీ కనిపిస్తుంది. ఈ చిత్రంలో కొంత గ్రాఫిక్స్ వర్క్ కూడా ఉంటుంది. సినిమా స్టార్టింగ్‌లోనే దేవుడి గుడిలోని ఓ సన్నివేశం ఆసక్తికరంగా ఉంటుంది.
⇔ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న ‘థ్యాంక్యూ’లో నా క్యారెక్టర్‌లో త్రీ షేడ్స్ ఉన్నాయి. ఆయన దర్శకత్వంలోనే ఓ హారర్ బేస్డ్ వెబ్ సిరీస్ చేస్తున్నాను. నాకు హారర్ అంటే భయం. కానీ ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నప్పుడు ఒక యాక్టర్‌గా ప్రయత్నించాల్సిందే.
⇔ పరశురామ్ దర్శకత్వంలో నేను హీరోగా చేయాల్సిన సినిమా ఉంటుంది. అలాగే దర్శకుడు విజయ్ కనక మేడల (‘నాంది’ సినిమా ఫేమ్) కథ చెప్పారు. స్క్రిప్ట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి.
సినిమా టికెట్ ధరల గురించి నాన్నతో చాలాసార్లు చర్చలు జరిగాయి. టికెట్ ధరల విషయంలో గత ఏడాది ఏప్రిల్ 8న ఏపీలో జీవో వచ్చిందనుకుంటున్నాను. మేం ‘బంగార్రాజు’ షూటింగ్‌ను ఆగస్టులో ఆరంభించాం. అప్పట్లో ఉన్న టికెట్ ధరలను దృష్టిలో పెట్టుకుని, దానికి తగ్గ బడ్జెట్‌లో ఈ సినిమా చేశాం. భవిష్యత్‌లో సినిమా టికెట్ ధరలు పెరిగితే మనకు బోనస్ అవుతుందని నాన్న అన్నారు. ‘థ్యాంక్యూ’ సినిమా అంటే నిర్మాత ‘దిల్’ రాజుగారు చూసుకుంటారు. నేను సినిమా చేసేముందు నిర్మాతతో మాట్లాడతాను. ఆయనకు కంఫర్ట్ అయితే నాకూ కంఫర్ట్. ఇక రాజకీయపరమైన నిర్ణయాలకు విభిన్నమైన కారణాలు ఉండొచ్చు. నేను దేనికీ వ్యతిరేకం కాదు. ఉన్న పరిస్థితులను బట్టి మనం ముందుకు వెళ్లాలి.
విడాకులు ఇద్దరి మంచికే..
సమంతతో తన విడాకుల గురించి నాగచైతన్య మాట్లాడుతూ.. ‘‘ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేశారు. అది ఇద్దరి (నాగచైతన్య, సమంత) మంచి కోసం తీసుకున్న నిర్ణయం. ఆమె హ్యాపీ.. నేనూ హ్యాపీ. ఈ పరిస్థితుల్లో ఇద్దరికీ ఇదే బెస్ట్ డెసిషన్ అనుకున్నాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment