
మృనాల్ ఠాకూర్, నాని జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ‘హాయ్ నాన్న’. శౌర్యువ్ దర్శకత్వంలో మోహన్ చెరుకూరి (సీవీఎం), డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ చిత్రంలో బేబీ కియారా ఖన్నా కీలక పాత్ర పోషిస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని డిసెంబర్ 7న విడుదల చేయనున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్‌ని వదిలారు మేకర్స్. ఈ సందర్భంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు నాని సమాధానం చెప్పారు. అవేంటో చదివేయండి.
ఫాదర్-డాటర్ కాన్సెప్ట్‌తో చాలా సినిమాలు వచ్చాయి కదా? హాయ్ నాన్న ఎంత డిఫరెంట్‌గా ఉంటుంది?
నాని: హాయ్ నాన్న చాలా యూనిక్ సబ్జెక్ట్. ఒకొక్క ప్రమోషన్ కంటెంట్ వచ్చే కొద్ది కథ, కాన్సెప్ట్ ప్రత్యేకత గురించి తెలుస్తూనే ఉంటుంది. ఇది టీజర్ ఈవెంట్ కాబట్టి అన్నీ టీజ్ చేయడానికే (నవ్వుతూ).
ఇందులో కమర్షియల్ కంటెంట్ ఉందా ?
నాని: కమర్షియల్ అంటే అందరికీ, అన్ని ఏజ్ గ్రూప్స్ ప్రేక్షకులందరినీ అలరించేది. అలా చూసుకుంటే .. హాయ్ నాన్న మోస్ట్ కమర్షియల్ మూవీ.
మీరు ప్రతి సినిమాలో ఏదో ఒక ప్రయోగం చేస్తుంటారు. కష్టంగా అనిపించదా?
నాని: నచ్చనిది చేయడం బరువుగా ఉంటుంది. నచ్చినది చేయడం తేలికగా ఉంటుంది. నాకు నచ్చిన సినిమా చేస్తున్నాను.
దసరా సినిమాకి దీనికి చాలా వైవిధ్యం ఉంది. ఇందులో తల్లి ప్రేమ కూడా తండ్రి ఇస్తున్నాడనినిపించింది టీజర్ చూస్తే.. మీరు ఏం చెప్తారు ?
నాని: నిజానికి నేను ఏదీ పెద్దగా కాలిక్యులేట్ చేసి చేయను, మనసుకు నచ్చింది చేసేస్తాను. ఈ రోజువరకూ చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులు గొప్పగా ఆదరించారు. నాకు నచ్చింది ప్రేక్షకులకు నచ్చుతుందనే భరోసా ఇచ్చారు. డిసెంబర్ 7న అది మరోసారి ప్రూవ్ అవుతుందని నమ్ముతున్నాను.
ఇప్పటివరకూ ఫాదర్ క్యారెక్టర్ ని చేసే హీరోలు ఒక వయసు దాటిన తర్వాత చేశారు. మీరు ఇంకా యంగ్ గానే ఉన్నారు. ఈ వయసులో చేయడం ఎలా అనిపిస్తుంది ?
నాని: రోజులు మారాయి. పద్దతులు కూడా మారాలని భావిస్తాను. ప్రేక్షకులు చాలా ఫాస్ట్ గా అప్డేట్ అవుతున్నారు. వాళ్ళని అందుకోలేకపోతే చాలా కష్టం.
మీ అబ్బాయి మిమ్మల్ని హాయ్ నాన్న అని పిలిచినప్పుడు మీ ఫీలింగ్ ఏమిటి ?
నాని: చాలా గ్రేట్ ఫీలింగ్ అండీ. ‘ఈ పేరు నేనే పెట్టాను కదా’ అని అంటుంటాడు. నువ్వే పెట్టావ్ నీ సినిమానే అని చెబుతుంటాను. జెర్సీ, హాయ్ నాన్న లాంటి సినిమాలు అర్ధం చేసుకొనే వయసు వాడికి ఉందో లేదో తెలీదు. కానీ ఏదో ఒక రోజు ఈ సినిమాలు చూసి గర్వపడతాడని నా నమ్మకం.
టీజర్ లో మీరు తప్పితే అందరూ వేరే భాష నటులు కనిపిస్తున్నారు. పాన్ ఇండియా దృష్టిలో పెట్టుకుని ఇలా చేశారా ?
నాని: ఇందులో తెలుగు హిందీ తమిళ్ అన్ని భాషల నటులు ఉన్నారు. పాత్రకు ఎవరు సరిపోతారో వారినే ఎంపిక చేసి తీసుకోవడం జరిగిందే కానీ పాన్ ఇండియా ని దృష్టి లో పెట్టుకొని చేసింది కాదు. ఇందులో మృణాల్ ఫ్యామిలీ ముంబై నుంచి వచ్చిన కుటుంబం. ఆ పాత్రలు ఎవరు సరిపోతారో వాళ్ళనే తీసుకున్నాం. అలాగే కియారా ఒక ఆడిషన్ వీడియో పంపింది. చాలా అద్భుతంగా చేసింది. ఈ పాత్రకు తను న్యాయం చేస్తుందని తనని తీసుకున్నాం. కచ్చితంగా ఈ సినిమాతో తను మీ మనసుని టచ్ చేస్తుంది. ఒక మంచి సినిమా తీయాలి. ప్రేక్షకులకు ఎఫెక్టివ్ ప్రోడక్ట్ ఇవ్వాలనే ఉద్దేశం తీసిన సినిమా అచ్చమైన తెలుగు సినిమా ఇది. మన సరిహద్దులు దాటి ప్రేక్షకులని అలరించే సినిమా ఇది.
ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా తగ్గట్టు కథలో కూడా మార్పులు చేస్తున్నారు కదా ?
నాని: నా సినిమాల వరకూ మాట్లాడుకుంటే.. ఇప్పటివరకూ ఒక్క ఎలిమెంట్ కూడా పాన్ ఇండియాని దృష్టిలో పెట్టుకొని చేసినట్లుగా ఉండదు. నాకు కథ నచ్చితే సినిమా చేస్తాను.
ఇందులో హీరోయిన్ మిమ్మల్ని హాయ్ నాన్న అని పిలుస్తుంది. దాని వెనుక ఉన్న కారణం ఏంటి?
నాని: ఇందులో కియారాకి నేను నాన్నను కాబట్టి తను తరచూ పిలిచే పిలుపు ప్రకారం అలా పిస్తుంది. అయితే హాయ్ నాన్న వెనుక ఉన్న డీపర్ లాజిక్ ఏమిటనేది సినిమా చూసిన తర్వాత అర్ధమౌతుంది.
సలార్ సినిమా రావడంతో మీ సినిమా విడుదల తేదిలో మార్పులు వచ్చాయి. ఎందుకలా?
నాని: ఒక ఇంట్లో పెద్ద అబ్బాయి కి సంబధించిన ఏదైనా వేడుక వుంటే.. చిన్నోడి వేడుకని ముందుకు వెనక్కి జరపడం సహజం. దీని వలన ఎలాంటి సమస్య లేదు. డిసెంబర్ అంతా ఒక లవ్ స్టొరీ, యాక్షన్ సినిమాలతో కళకళలాడిపోతుంది. ఇంతకంటే మనకేం కావాలి. (నవ్వుతూ)
‘జెర్సీ’, ‘శ్యామ్ సింగరాయ్’ లాంటి మంచి సినిమాలు చేసినప్పటికీ.. నిర్మాతలకు నష్టమే వచ్చిందని టాక్?
నాని: ఈ మాట ఏ నిర్మాత చెప్పారో చెప్పండి. నా గత సినిమాల కలెక్షన్ల గురించి మాట్లాడుకోవడానికి ఇది సరైన వేదిక కాదనుకుంటున్నా. థియేరిటికల్, నాన్ థియేరిటికల్, రీమేక్.. ఇలా అన్ని విధాలుగా నా సినిమాలు మంచిగానే వసూళ్లను అందుకుంది. ‘జెర్సీ’కి రూ.10 రూపాయలు పెడితే.. రూ. 50 రూపాయలు వచ్చాయి. ఆ సినిమాను ఉదాహారణగా చెప్పడం తప్ప. అంటే సుందరానికి ఉదాహారణగా చెప్పొచు. సోషల్ మీడియాలో తెలిసి తెలియని వాళ్లు ఇలాంటి మాటలు అనొచ్చు కానీ..అన్నీ తెలిసిన మీడియా సరైన రీజనింగ్‌తో సరిగ్గా అడ్రస్ చేయాలి. మీకు దగ్గరకు వచ్చిన మాటలు నిజం కాదని తెలిసినప్పుడు.. ఆ విషయం అందరికి తెలియజేసే బాధ్యత కూడా మీదే(మీడియా).
మీరు నటించిన ప్రతి సినిమాలో లిప్‌లాక్ సన్నివేశాలు ఉంటున్నాయి. ఎందుకలా?
నాని: నేను నటించిన అన్ని సినిమాల్లో లిప్‌లాక్ సీన్స్ లేవు. అంటే సుందరానికి.. దసరా సినిమాల్లో అలాంటి సీన్స్ లేవు. కథకు అవసరమైన, దర్శకుడు చేయమని చెబితేనే ఆ సీన్స్ చేస్తాను. ఇలాంటి సీన్స్ తర్వాత మా ఇంట్లో గొడవలు జరుగుతాయి(నవ్వుతూ..)
చాలా మంది కొత్త దర్శకులకు అవకాశం ఇస్తున్నారు ? ఆ నమ్మకం ఎలా కుదురుతుంది ?
నాని: నిజానికి నేను అంతగా ఆలోచించను. నేను సహాయ దర్శకుడిగా పని చేశాను. కథ చెప్పినప్పుడు ఆ కనెక్ట్ వస్తే మరో ఆలోచన లేకుండా చేస్తాను. ఇప్పటివరకూ అది కరెక్ట్ అవుతూ వచ్చింది. హాయ్ నాన్న లాంటి స్పెషల్ ఫిల్మ్ తో శౌర్యువ్ కూడా లిస్టు లో చేరుతారు.
Comments
Please login to add a commentAdd a comment