‘నటీనటులుగా ప్రేక్షకులను మెప్పించే కంటెంట్ ఉండేలా చూసుకోవడమే కాదు, అందరిలో ఓ పాజిటివ్ దృక్పథాన్ని కల్పించే కంటెంట్ క్రియేట్ చేయడం మా బాధ్యత' అంటోంది బిగ్‌బాస్ బ్యూటీ బిందుమాధవి. కచ్చితంగా అలాంటి ప్రభావాన్ని న్యూసెన్స్ క్రియేట్ చేస్తుందని ధీమాగా చెప్తోంది. నేటి మీడియా రంగం సమాజంపై చూపుతున్న ప్రభావంపై ఆందోళన చెందేవారందరూ తప్పనిసరిగా ఈ సిరీస్ చూడాల్సిందే అంటోంది. నవదీప్, బిందుమాధవి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ న్యూసెన్స్. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో మే 12న విడుదల కానుంది. ఈ క్రమంలో శనివారం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా నవదీప్ మాట్లాడుతూ ‘‘ఇప్పటి సమాజంలో మీడియాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాంటి దానిపై ఓ ప్రత్యేక దృక్పథాన్ని ఏర్పరిచేలా రూపొందిన న్యూసెన్స్‌లో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రారంభం నుంచి చివరి వరకు ఆడియెన్స్‌ను ఈ సిరీస్ కట్టిపడేస్తుంది' అన్నాడు. దర్శకుడు శ్రీ ప్రవీణ్ మాట్లాడుతూ.. 'మన సమాజం ఎలా ఉంది? దాని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? అనే విషయాలను తెలియజేయడం క్రియేటర్‌గా నా బాధ్యత. న్యూస్ స్ట్రింగర్స్ ప్రపంచంలోకి వెళ్లి లోతుగా అధ్యయనం చేసేలా ఉండేదే ఈ న్యూసెన్స్ సిరీస్. ఉన్నది ఉన్నట్లుగా, నిజాయితీతో ఓ రంగానికి సంబంధించిన విషయాలను చూపించేలా రూపొందిన ఈ సిరీస్ ఆడియన్స్‌కు నచ్చుతుందని భావిస్తున్నాం' అన్నారు.
కాగాఈ సిరీస్ టీజర్ విడుదలైనప్పుడు డబ్బుకి మీడియా దాసోహమా? అనే లైన్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. నిజంగానే డబ్బుకు మీడియా దాసోహమైందా? బానిసగా మారిందా? అనే ప్రశ్న మన మదిలో వస్తుంది. మీడియాలో ప్రసారమవుతున్న వార్తల ప్రామాణికతకు సంబంధించిన ప్రశ్న మనసులో రావడమే కాకుండా సమాజంపై మీడియా ప్రభావం గురించి ఆందోళన చెందుతున్న వారిపై కూడా ఇది ప్రభావం చూపిస్తుంది. త్వరలో స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ ఎలాంటి బజ్ క్రియేట్ చేస్తుందో చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment