ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హీరోయిన్ నయనతార జీవితంపై రూపొందిన ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీ గురించి తెలుసుకుందాం.
తెర మీద కనపడే తారలపై ప్రేక్షకులకు మక్కువ ఎక్కువ. మరీ ముఖ్యంగా సినీ ప్రేక్షకులు ఈ తారలపై అపరిమిత అభిమానాన్ని పెంచుకుంటూ వారి వ్యక్తిగత జీవితాలను గురించి కూడా తెలుసుకోవాలని ఆరాటపడతుంటారు. ప్రస్తుత వినోద రంగంలో వాణిజ్య విప్లవమైన ఓటీటీ వేదికలు అడపాదడపా కొంతమంది కళాకారుల వ్యక్తిగత జీవితాలను డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకులకు అందుబాటులోకి తెస్తున్నాయి.
వీటికి సదరు నటీనటులకు ఓటీటీ సంస్థలు భారీ మొత్తంలో పారితోషికం ముట్టజెప్పి డాక్యుమెంటరీలు రూపొందిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా ప్రముఖ నటి నయనతార డాక్యుమెంటరీ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ రిలీజ్ అయింది. బెంగళూరు నగరంలో పుట్టిన నయనతార అనతి కాలంలోనే తన సినిమా కెరీర్‌లో అత్యున్నత స్థాయికి ఎదిగారని చెప్పవచ్చు. సౌత్ ఇండియా క్వీన్ అని ఫ్యాన్స్ పిలుచుకునే ఈ బ్యూటీ ప్రతిష్ఠాత్మక పత్రిక ఫోర్బ్స్‌లో ‘ఇండియాలో సెలబ్రిటీ 100 లిస్ట్’లో ప్రచురింపబడ్డ ఒకే ఒక్క దక్షిణాది నటి.
అంతటి నటి డాక్యుమెంటరీ అంటే ఇక చెప్పేదేముంది అభిమానులకు పండగే. ఈ డాక్యుమెంటరీ మొత్తం నయనతార జీవితాన్ని చూసినట్టుగా కాదు, అనుభూతి పొందినట్టుగా ఉంటుంది. నయనతార పుట్టుక నుండి తన పెరుగుదల, చదువు ఆ తరువాత తన సినిమా ప్రస్థానం ఇవన్నీ ఎంతో చక్కగా చూపించారు. వీటితో పాటు నయనతార గురించి సినీ ప్రముఖులు, ఆమె ఆప్తుల అభిప్రాయాలతో కూడిన విశ్లేషణ ఇవ్వడం మరో హైలైట్. జీవితమంటే సాఫీగా సాగే ప్రయాణమే కాదు.
ఒడిదుడుకులుంటాయి. సినిమా స్టార్ అయినా సాధారణ మనిషైనా ఎవ్వరికైనా జీవితం జీవితమే. అలాగే నయనతార ఎంత ఎత్తుకు ఎదిగినా తన జీవితంలో కూడా ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలెన్నో ఉన్నాయి. అవన్నీ కూడా తానే వివరిస్తూ తన సినిమా జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని ప్రేక్షకులకు సవివరంగా వివరించారు. నయనతార గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ డాక్యుమెంటరీ చూడాల్సిందే. ఏదేమైనప్పటికీ టైటిల్‌లో ఉన్నట్లు ఈ డాక్యుమెంటరీ అంతకు మించి... అందుకే ఇది నయనానందకరం.
– ఇంటూరు హరికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment