అప్పుడెప్పుడు 'హ్యాపీడేస్', 'కొత్త బంగారు లోకం' సినిమాలతో సెన్సేషన్ సృష్టించిన హీరో వరుణ్ సందేశ్. ఆ తర్వాత సరైన మూవీస్ చేయలేకపోయాడు. ఓ దశలో పూర్తిగా యాక్టింగ్‌కే దూరమైపోయాడు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత 'నింద' అనే ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్‌తో ఇప్పుడు థియేటర్లలోకి వచ్చాడు. మరి ఈ మూవీ ఎలా ఉంది? వరుణ్ సందేశ్‌కి కమ్ బ్యాక్‌గా నిలిచిందా అనేది రివ్యూలో చూద్దాం.
(ఇదీ చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. 'కల్కి' అది లేనట్లే?)
కథేంటి?
కాండ్రకోట అనే ఊరిలో ముంజు అనే అమ్మాయిని బాలరాజు (ఛత్రపతి శేఖర్) అత్యాచారం చేసి చంపేశాడని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఉరిశిక్ష విధిస్తారు. అయితే ఈ తీర్పు ఇచ్చిన జడ్జి సత్యానంద్ (తనికెళ్ల భరణి) మాత్రం.. ఈ కేసులో సరైన తీర్పు ఇవ్వలేకపోయానని బాధతోనే కన్నుమూస్తారు. దీంతో ఈ కేసులో అసలైన నిందితుడు ఎవరో తెలుసుకోవాలని జడ్జి కొడుకు వివేక్ (వరుణ్ సందేశ్) ఫిక్స్ అవుతాడు. అలా ఓ ఆరుగురు వ్యక్తుల్ని కిడ్నాప్ చేసేసరికి అసలు నిజాలు బయటపడతాయి. ఇంతకీ వివేక్ ఏం తెలుసుకున్నాడు? 'నింద' పడిన బాలరాజుకి ఉరిశిక్ష పడకుండా అడ్డుకోగలిగాడా లేదా అనేది స్టోరీ.
ఎలా ఉందంటే?
చేయని నేరానికి జైలుకెళ్లడం, ఏళ్ల పాటు శిక్ష అనుభవించడం, పుణ్య కాలం పూర్తయిన తర్వాత ఇతడు నిర్దోషి అని కోర్టు తీర్పు ఇవ్వడం, ఆ తర్వాత బయటకు రావడం.. ఇలాంటి ఘటనలు మనం అప్పుడప్పుడు పేపర్, న్యూస్‌లో చూస్తూనే ఉంటాం. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ తీసుకుని చేసిన సినిమానే 'నింద'.
ఆరుగురు వ్యక్తులు కిడ్నాప్ అయ్యే సీన్‌తో సినిమా మొదలవుతుంది. వీళ్లలో ఎస్సై, ప్రభుత్వ డాక్టర్, లాయర్, పనోడు, ఆవారా, కానిస్టేబుల్ ఉంటారు. ఓ మాస్క్ వేసుకున్న వ్యక్తి ఈ ఆరుగురి నుంచి మంజు హత్య కేసులో నిజం రాబట్టాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలోనే భయపెట్టి బెదిరిస్తుంటాడు. అయితే ఈ సీన్స్ ఇంట్రెస్ట్ కలిగించాలి. కానీ సాగదీత వల్ల ఇదంతా బోరింగ్ అనిపిస్తుంది. జైల్లో ఉన్న బాలరాజుని వివేక్ కలిసే సీన్‌తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 11 మూవీస్.. మొత్తంగా 17 రిలీజ్)
సెకండాఫ్ మాత్రం ఉన్నంతలో కాస్త ఆసక్తిగా అనిపిస్తుంది. బాలరాజు, మంజు ఎవరు? వాళ్ల బ్యాక్ స్టోరీ ఏంటి? కిడ్నాప్ అయిన ఆరుగురికి ఈ కేసుకి సంబంధమేంటి? అనేది ఉంటుంది. అయితే రెగ్యులర్‌గా థ్రిల్లర్ సినిమాలు చూసేవాళ్లకు సెకండాఫ్ మొదలైన కాసేపటికే హత్య చేసిందెవరో అర్థమైపోతుంది. కానీ క్లైమాక్స్‌లో మరో ఊహించని ట్విస్ట్ ఇచ్చి దర్శకుడు ముగించడం కాస్త బాగుంది.
తప్పు చేయని వాడికి శిక్ష పడకూడదనే అనే స్టోరీ లైన్ బాగున్నప్పటికీ.. దాన్ని ఇంట్రెస్టింగ్‌గా డీల్ చేసే విషయంలో దర్శకుడు తడబడ్డాడు. దీంతో రెండు గంటల సినిమా కూడా అక్కడక్కడ సాగదీతగా అనిపిస్తుంది. కాకపోతే కమర్షియల్ వాసనలు ఎక్కడ లేకుండా స్ట్రెయిట్‌గా కథ చెప్పడం మాత్రం రిలీఫ్.
ఎవరెలా చేశారు?
లవర్ బాయ్ పాత్రలతో మనకు బాగా తెలిసిన వరుణ్ సందేశ్.. ఇందులో వివేక్ అనే మానవ హక్కుల కమీషనర్ ఉద్యోగిగా సెటిల్డ్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బాలరాజుగా చేసిన ఛత్రపతి శేఖర్, మంజుగా చేసిన మధు బాగా చేశారు. కిడ్నాప్ అయిన ఆరుగురు కూడా ఉన్నంతలో పర్వాలేదనిపించారు. టెక్నికల్ విషయాలకొస్తే.. సినిమాలో ఉన్నది తక్కువ లొకేషన్స్. ఉన్నంతలో వాటిని బాగానే క్యాప్చర్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉన్నప్పటికీ కొన్నిచోట్ల దీని వల్ల డైలాగ్స్ సరిగా వినపడలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఓవరాల్‌గా చూసుకుంటే 'నింద' ఓ డీసెంట్ మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అంతే. మరీ అంత సూపర్ అయితే కాదు!
-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్
(ఇదీ చదవండి: 'కల్కి' మరో వీడియో.. స్టోరీని దాదాపు చెప్పేసిన డైరెక్టర్!)
Comments
Please login to add a commentAdd a comment