
ఈ ప్రపంచంలో గురు శిష్యుల బంధానికి ఎంతో గొప్ప స్థానం ఉంది. కృషి ఉంటే ఏదైనా సాధ్యమనే ధైర్యాన్ని అందించే ఉపాధ్యాయుల పాత్ర ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో కీలకం. ఎప్పటికప్పడు మనల్ని మార్గనిర్దేశం చేస్తూ కూలిపోయిన ఆశల సౌదాన్ని సైతం తిరిగి నిర్మించుకోవచన్న భరోసా కల్పిస్తారు. మనలోని శక్తి సామర్థ్యాలను మొదటగా గుర్తించేది కూడా ఉపాధ్యాయులే. సెప్టెంబరు 5 టీచర్స్ డే సందర్భంగా గురువుల పాత్రపై హిందీ చలనచిత్ర పరిశ్రమలో వచ్చిన సినిమాలను ఓసారి గుర్తుచేసుకుందాం.
హిన్చి(2018)
హిచ్కి పేరుతో తెరకెక్కిన సినిమాలో టీచర్ పాత్రలో రాణి ముఖర్జీ నటన ఆకట్టుకుంటుంది. బలహీనతలనే శక్తిగా ఎలా మార్చుకోవచ్చన్న దానిపై కృషిచేస్తుంది. టోరెట్ సిండ్రోమ్ అనే వ్యాధి(నత్తిలాంటి ఒకరకం లోపం. ఎక్కిళ్లు వచ్చినట్టుగా ఉంటూ, మాటలు మధ్యలోనే ఆగిపోతాయి)తో బాధపడే టీచర్ తమకు పాఠాలు బోధించడాన్ని విద్యార్థులు ఒప్పుకోరు. ఆమెకున్న వ్యాధి కారణంగా అవహేళన చేస్తూ మాట్లాడేవారు. పట్టువదలని ఆమె కేవలం పాఠ్యాంశాలే కాకుండా జీవితానికి ఉపయోగపడే ఎన్నో మంచి విషయాలతో విద్యార్థులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో రాణి ముఖర్జీ నటన అందరినీ ఆకట్టుకుంది. పలు అవార్డులను సైతం సొంతం చేసుకుంది.
తారే జమీన్ పర్ (2007)
ఆమీర్‌ఖాన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న అద్భుత చిత్రం తారే జమీన్ పర్. ఇషాన్ అవస్తీ అనే స్టూడెంట్ పడుతున్న బాధ, తను చెప్పాలనుకున్న విషయాలను కథలో చక్కగా చూపించారు. ఈ చిత్రంలో ఆర్ట్ టీచర్‌గా నటించిన అమీర్.. ఇషాన్‌లోని టాలెంట్‌ను బయటి ప్రపంచానికి పరిచయం చేసి అతడి జీవితాన్ని మలుపు తిప్పాడు. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అభిమానులున్నారు.
సూపర్ 30 (2019)
ఆనంద్ కుమార్ బయోపిక్. టైటిల్ రోల్‌లో హృతిక్ రోషన్ నటించాడు. పేద విద్యార్థులకు సూపర్ 30 పేరుతో ఐఐటీ కోచింగ్ ఇచ్చే ఆనంద్ కుమార్ ఎందరో విద్యార్థులను తీర్చి దిద్దాడు. డబ్బులేక చదువుకు దూరం కాకూడదనే మంచి దృక్పదంతో ప్రతీ ఏటా ఎంతోమందిని ఐఐటీయన్లుగా మలచి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేశాడు. 2019లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది.
బ్లాక్ (2005)
హెలెన్ కెల్లర్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం బ్లాక్. అమితాబ్ బచ్చన్, రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రల్లో కనిపించిన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను సైతం బద్దలు కొట్టింది. చెవిటి, మూగ అమ్మాయికి తన కలలను నిజం చేస్తూ ఆ అమ్మాయిని ఓ గ్రాడ్యుయేట్ అయ్యేలా తీర్చిదిద్దిన ఉపాధ్యాయుని పాత్రలో అమితాబ్ ఆకట్టుకుంటాడు. చీకటితో అలుముకున్న ఆ విద్యార్థి జీవితంలో మళ్లీ వెలుగులు నింపి ఆమెకు ఉజ్వల భవిష్యత్తును అందించిన గురువు పాత్రకు అమితాబ్ ప్రాణం పోశారు.
Comments
Please login to add a commentAdd a comment