రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆపరేషన్ రావణ్’. ఈ ఏడాది జులై 26న విడుదలైన ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. సైకో థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంతో హీరో రక్షిత్ తండ్రి వెంకట సత్య దర్శకుడిగా పరిచయం అయ్యారు.
తెలుగు క్రైమ్ థ్రిల్లర్‌గా విడుదలైన ఈ చిత్రం సుమారు నాలుగు నెలలకు ఓటీటీలో విడుదల కానుంది. ఈ మూవీలో పలాస 1978 ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటించడంతో కాస్త ఆసక్తి కలిగించింది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పర్వాలేదనిపించింది. ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది. నవంబర్ 2నుంచి ‘ఆపరేషన్ రావణ్’ స్ట్రీమింగ్ కానున్నట్లు ఆహా తెలుగు ప్రకటించింది. ఈమేరకు తాజాగా ఒక ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది.
కథేంటంటే..
ఆమని(సంగీర్తన విపిన్) ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. స్థానిక మంత్రి(రఘు కుంచె) చేసే అవినీతిపై స్టింగ్ ఆపరేషన్ చేసి ఓ స్టోరీ రెడీ చేస్తుంది. అయితే ఆ స్టోరీని టీవీ చానెల్ సీఈఓ(మూర్తి) టెలికాస్ట్ చేయకుండా జాప్యం చేస్తుంటాడు. అంతేకాకుండా అది పక్కకి పెట్టి ఓ సీరియల్ కిల్లర్ కేసుని కవర్ చేయమని ఆమనికి ఆదేశిస్తాడు. ఆమెకు అసిస్టెంట్‌గా అప్పుడే ఉద్యోగంలో చేరిన రామ్(రక్షిత్ అట్లూరి)ని పంపిస్తాడు. రామ్ ఓ నిజాన్ని దాచి ఆమని కోసం ఆ చానెల్‌లో ఉద్యోగిగా చేరతాడు. ఆమె ప్రేమను పొందేందుకు ప్రయత్నిస్తుంటాడు. మరోవైపు నగరంలో ఆ సీరియల్ కిల్లర్ వరుసగా అమ్మాయిలను కిడ్నాప్ చేసి హత్యలు చేస్తుంటాడు.
ఇలాంటి సమయంలో తన కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది సుజాత(రాధికా శరత్ కుమార్). పోలీసులతో పాటు ఆమని, రామ్‌లు ఈ కేసును సీరియస్‌గా తీసుకొని విచారణ జరుపుతుంటారు. ఈ క్రమంలో ఓ రోజు ఆ సీరియల్ కిల్లర్ ఆమనిని కిడ్నాప్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? ఎందుకు అమ్మాయిలను హత్య చేస్తున్నాడు? పెళ్లికి రెడీ అయిన సుజాత కూతుర్ని కిడ్నాప్ చేసిందెవరు? సీరియల్ కిల్లర్ నుంచి తన ప్రియురాలు ఆమనిని రామ్ ఎలా రక్షించుకున్నాడు? సుజాతకు ఆ సీరియల్ కిల్లర్‌తో ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment