ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన బయోగ్రాఫికల్ థ్రిల్లర్ ‘ఒప్పెన్ హైమర్’ చిత్రానికి అవార్డుల పంట పండింది. లండన్‌లోని రాయల్ ఫెస్టివల్ హాల్‌లో 77వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డుల (బాఫ్టా) ప్రదానోత్సవం ఆదివారం రాత్రి జరిగింది. దేశం నుంచి దీపికా పదుకోన్ ఈ వేడుకల్లో పాల్గొని, ‘నాన్ ఇంగ్లిష్’ విభాగంలో ఉత్తమ చిత్రానికి (ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్) అవార్డు అందజేశారు. ఇక ‘భాఫ్టా’లో ‘ఒప్పెన్ హైమర్’ చిత్రం ఏడు విభాగాల్లో పురస్కారాలు అందుకుని సత్తా చాటింది.
అవార్డులతో ‘ఒప్పెన్ హైమర్’ టీమ్
ఉత్తమ చిత్రం, దర్శకుడు, నటుడు, సహాయనటుడు, సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ విభాగాల్లో ‘ఒప్పెన్ హైమర్’కి అవార్డులు దక్కాయి. క్రిస్టోఫర్ నోలన్‌కు దర్శకుడిగా దక్కిన తొలి బాఫ్టా అవార్డు ఇది. ఇప్పటికే అత్యధిక గోల్డెన్ గ్లోబ్ అవార్డులు గెలుచుకున్న ‘ఒప్పెన్ హైమర్’ చిత్రం తాజాగా బాఫ్టాలో ఏడు పురస్కారాలు దక్కించుకుని, వచ్చే నెలలో జరిగే ఆస్కార్ రేసులో 13 విభాగాల్లో పోటీలో ఉంది. ఇక ‘బాఫ్టా’లో ‘ఒప్పెన్ హైమర్’ తర్వాత ‘పూర్ థింగ్స్’ మూవీ అధికంగా ఐదు (కాస్ట్యూమ్, మేకప్, హెయిర్–స్టైలింగ్,ప్రోడక్షన్, స్పెషల్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో) అవార్డులను పొందింది. ఆ తర్వాత ‘ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్’ సినిమాకి మూడు పురస్కారాలు దక్కాయి.
భారతీయత ఉట్టిపడేలా... ‘భాఫ్టా’ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రజెంటర్‌గా వ్యవహరించిన దీపికా పదుకోన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తొలి భారతీయ నటి దీపికా కావడం విశేషం. ఈ వేదికపై భారతీయత ఉట్టిపడేలా చీరలో మెరిశారు దీపికా పదుకోన్. ‘చూపు తిప్పుకోలేనంత అందంగా ఉంది’ అనే ప్రశంసలు ఈ బ్యూటీ సొంతమయ్యాయి. ఈ వేడుకలో బ్యాక్ స్టేజీలో దీపికా దిగిన ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే అంతర్జాతీయ సినీ వేడుకల్లో దీపికా పదుకోన్ పాల్గొనడం ఇది రెండోసారి. గతేడాది జరిగిన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో దీపిక ప్రజెంటర్‌గా వ్యవహరించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు..’ పాటను ఆమె ఆస్కార్ వేదికపై పరిచయం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment