ఆమె ఓ గ్లామర్ డాల్. కానీ, వెండితెరకు డీగ్లామరస్‌గా పరిచయమైంది. పాత్ర ఏదైనా, అందులో ఒదిగిపోతుంది. అందుకే, సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా, వరుస అవకాశాలతో దూసుకుపోతోంది ఆశిమా నర్వాల్.
పుట్టింది హర్యానాలోని రోహ్‌తక్. పెరిగింది ఆస్ట్రేలియా. జాట్ కుటుంబానికి చెందిన ఆశిమాకు ఆస్ట్రేలియా పౌరసత్వం ఉంది. సిడ్నీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో నర్సింగ్ చేసి, కొంతకాలం అక్కడే పని చేసింది. ఫ్యాషన్‌పై ఉన్న ఇష్టంతో మోడల్ కావాలనుకుంది. ఆ లక్ష్యంతోనే ఒకే సంవత్సరంలో రెండు వేర్వేరు అందాల పోటీల్లో పాల్గొని విజయం సాధించింది. అలా ‘మిస్ సిడ్నీ ఆస్ట్రేలియా ఎలిగెన్స్ 2015’, ‘మిస్ గ్లోబల్ 2015’ టైటిల్స్ గెలిచింది.
2018లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి వరకూ అందంతో అలరించిన ఆమె.. మొదటి తెలుగు సినిమా ‘నాటకం’లో డీగ్లామరస్ రోల్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఆ సినిమా అంతగా ఆడలేదు. ఆ తర్వాత చేసిన ‘జెస్సీ’ కూడా అంతే. కానీ, 2019లో విజయ్ ఆంటోనీతో కలసి నటించిన తమిళ చిత్రం ‘కోలైగరన్’ మంచి విజయాన్ని అందించింది. అదే చిత్రం ‘కిల్లర్’గా తెలుగులో డబ్ చేశారు. ‘రాజ భీమ’ తమిళ సినిమా కూడా హిట్. సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటుంది ఆశిమా. గత సంవత్సరం సిగరెట్ తాగుతూ పోస్ట్ చేసిన వీడియో వివాదాస్పదంగా మారింది. దీంతో అది ఓ సినిమా కోసం చేసిన వీడియో అంటూ వివరణ ఇచ్చింది.
ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఆర్‌ఎస్‌వీపీ మూవీస్, ఫ్లైయింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ నిర్మించిన ‘పిట్ట కథలు’ సినిమాలో నటించింది. ఈ సినిమాను నలుగురు డైరెక్టర్లు చిత్రీకరించారు. ఇందులో శ్రుతిహాసన్, అమలాపాల్ వంటి స్టార్ హీరోయిన్స్ కూడా ఉన్నారు.
'ఆనందం, ఆశ్చర్యం, బాధ, కోపం, సిగ్గు వంటి అనేక భావాలను కెమెరా ముందు చూపించడం చాలా కష్టం. సినిమా అంటే కేవలం నటనే కాదు, అనేక పనుల కలయిక. ఇక్కడ చాలా సూక్ష్మమైన, సంక్లిష్టమైన విషయాలను నేర్చుకునే వీలు ఉంటుంది. అందుకు చాలా సంతోషిస్తున్నా'.
– ఆశిమా నర్వాల్
Comments
Please login to add a commentAdd a comment