
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద పోలీసులు భద్రతను మరింత పెంచారు. ఆయన నటించిన తాజా వెబ్ సిరీస్ ‘తాండవ్’పై వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో ఆయన ఇంటిముందు పోలీసులు సెక్యూరిటీని మరింత పటిష్టం చేశారు. అయితే సైఫ్ భార్య, హీరోయిన్ కరీనా ప్రస్తుతం గర్భవతిగా ఉన్న నేపథ్యంలో వారు కొత్త ఇంటికి మారనున్నట్లు తెలుస్తోంది. కాగా ‘తాండవ్’ వెబ్ సిరీస్ హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉందని, మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా రూపొందించారంటూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తాండవ్‌ను బహిష్కరించాలంటూ సోషల్ మీడియాలో ‘బాయ్‌కాట్ తాండవ్’, ‘బ్యాన్ తాండవ్’ హ్యాష్‌ట్యాగ్‌లను కూడా వైరల్ చేస్తున్నారు. ‘తాండవ్’లో హిందూ దేవుళ్లను కించపరిచారని బీజేపీ ఎమ్మెల్యే రామ్‌కదమ్ ముంబైలోని ఘట్కోపర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. (చదవండి: తాండవ్‌ను బ్యాన్ చేయాలి: బీజేపీ ఎంపీ)
అంతేగాక వెబ్ సిరీస్ ప్రదర్శనను నిలిపివేయాలంటూ బీజేపీ ఎంపీ మనోజ్ కుమార్ కొటక్ కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు లేఖ రాశారు. ఈ సిరీస్ దేవుళ్లను ఎగతాళి చేయడం, సెక్స్, హింస, మాదక ద్రవ్యాల వాడకంతో పాటు విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు. తాండవ్‌లో సైఫ్ అలీఖాన్ లీడ్ రోల్ పోషించారు. ఈ పోలీటికల్ డ్రామా వెబ్ సిరీస్‌ను దర్శకుడు అలీ అబ్బాస్ రూపొందించగా, హిమాన్షు కిశన్ మెహ్రాతో కలిసి నిర్మించారు. ఇందులో డింపుల్ కపాడియా, సునీల్ గ్రోవర్, తిగ్మన్షు ధులియా, గౌహర్ ఖాన్‌లు ప్రధాన పాత్రల్లో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment