తమిళసినిమా: ఇంతకుముందు వరకు తెలుగులో టాప్ హీరోయిన్‌గా వెలిగిపోయిన బ్యూటీ నటి పూజాహెగ్డే. అయితే ఎవరికైనా తాము నడిచే పయనంలో ఎత్తుపల్లాలు సహజమే. ప్రస్తుతం ఈమె నట పయనం అంత ఆశాజనకంగా లేదని చెప్పాలి. ఇటీవల తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించిన చిత్రాలు వరుసగా నిరాశపరిచాయి. ముఖ్యంగా తమిళంలో పదేళ్ల క్రితం నటించిన తొలి చిత్రం ముగమూడి ఇటీవల నటించిన బీస్ట్ చిత్రం పూజాహెగ్డేకు అపజయాలనే అందించాయి. అలాగని ఈ అమ్మడికి అవకాశాలు అడుగంటాయని చెప్పలేం. తెలుగులో మహేశ్‌బాబుకు జంటగా ఒక చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం పైన పూజాహెగ్డే ఆశలన్నీ. అలాంటిది తాజాగా కోలీవుడ్లో ముచ్చటగా మూడోసారి ఒక అవకాశం వరించిందనే ప్రచారం జరుగుతోంది.
ఇంతకుముందు పలు సక్సెస్‌ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు లింగసామి ఇప్పుడు ఒక మంచి హిట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి చిత్రాన్ని దర్శకత్వం వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకుముందు సంచలన విజయం సాధించిన పైయ్యా చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడు. పైయ్యా చిత్రంలో నటుడు కార్తీ, తమన్న జంటగా నటించారు. తాజాగా నటుడు సూర్య, కార్తీ, శింబు వంటి నటులకు కథను వినిపించినా వారు ఆసక్తి చూపలేదని సమాచారం. దీంతో నటుడు ఆర్యను తన చిత్రానికి కథానాయకుడిగా ఎంచుకున్నారు.
ఇందులో ఆయనకు జంటగా దివంగత నటి శ్రీదేవి వారసురాలు జాన్వీకపూర్ నటించనున్నట్లు ఇటీవల ప్రచారం జోరుగా సాగింది. అయితే ఆ ప్రచారాన్ని జాన్వీకపూర్ తండ్రి, సినీ నిర్మాత బోనికపూర్ ఖండించారు. దీంతో దర్శకుడు లింగస్వామి నటి పూజాహెగ్డే ను తన చిత్రంలో నాయకిగా ఎంపిక చేసినట్లు తాజా సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఖాదర్‌బాషా ఎండ్ల ముత్తు రామలింగం అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పూర్తిచేసి లింగసామి దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతారని సమాచారం. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడానికి ఇంకా కాస్త సమయం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment