ఇండియన్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న 'ప్రభాస్‌'.. ఎలా సాధ్యమైంది..? | Actor Prabhas 45th Birthday Special Story, Know About Prabhas Filmography And Interesting Unknown Facts | Sakshi
Sakshi News home page

Prabhas Birthday Special Story: ఇండియన్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న 'ప్రభాస్‌'.. ఎలా సాధ్యమైంది..?

Published Wed, Oct 23 2024 7:57 AM | Last Updated on Wed, Oct 23 2024 3:56 PM

Prabhas 45th Birthday Special Story

'ఈశ్వర్‌'లా వెండితెరపై అడుగుపెట్టి అభిమానుల చేత 'సాహో' అనిపించుకున్నాడు. నేడు ఇండియన్‌ బాక్సాఫీస్‌కు 'ఛత్రపతి'లా 'ఏక్‌ నిరంజన్‌' అయ్యాడు. కేవలం రూ.100 కోట్లకే పరిమితమైన తెలుగు చిత్ర పరిశ్రమ మార్కెట్‌ను ఏకంగా రూ.2 వేల కోట్లకు చేర్చి తెలుగోడి సత్తా ఏంటో బాలీవుడ్‌కు పరిచయం చేశాడు. తను పుట్టిన గడ్డపై ప్రకృతి కన్నేర్ర చేస్తే తనవంతుగా  'పౌర్ణమి' లాంటి వెలుగును అందింస్తాడు. సిల్వర్‌ స్క్రీన్‌పై పౌరుషంతో కదం తొక్కే 'మిర్చి'లాంటి కుర్రాడిగానే కనిపిస్తూనే అమ్మాయిల కలల రాకుమారుడిగా  'డార్లింగ్‌' అని పిలిపించుకుంటాడు. ప్రస్తుతం ఇండియన్‌ బాక్సాఫీస్‌లో 'సలార్‌' రూలింగ్‌ మాత్రమే జరుగుతుంది. ఇవాళ యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా మరిన్ని విషయాలు మీ కోసం..

ప్రభాస్‌ పూర్తి పేరు వెంకట సత్యనారాయణ ప్రభాస్‌ రాజు ఉప్పలపాటి. అందరూ ముద్దుగా ప్రభ, డార్లింగ్‌ అని పిలుస్తారు. చిన్నప్పటి నుంచి నటుడవ్వాలని ప్రభాస్‌ ఎప్పుడూ అనుకోలేదు. అయితే,  ప్రభాస్‌ మంచి ఎత్తుతో పాటు చాలా గ్లామర్‌గా ఉండటంతో అందరూ ఆయన్ను  'హీరో... హీరో' అని పిలిచేవారట. కానీ సినిమాలంటే చాలా భయపడేవాడట. తనకు తెలిసిన మొదటి హీరో పెదనాన్న కృష్ణంరాజు. ఆయనకు ప్రభాస్‌ బిగ్‌ ఫ్యాన్‌ కూడా... ఓ రోజు  భక్తకన్నప్ప సినిమా షూటింగ్‌ జరుగుతుంటే అక్కడికి ప్రభాస్‌ కూడా వెళ్లాడు.. అలా సినిమా సెట్‌లోని వాతావరణానికి అలవాటు పడ్డాడు. రోజూ పెదనాన్న కృష్ణంరాజు నటించిన సినిమాలు చూస్తూ అలా తన కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని డిసైడ్‌ అయ్యాడు.

వరుసగా ప్లాపులొచ్చినా మళ్లీ.. మళ్లీ తిరిగొచ్చాడు
కృష్ణంరాజు వారసుడిగా 2002లో ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ తెరంగేట్రం చేశాడు. ఈ సినిమా నటుడు విజయ్ కుమార్ కుమార్తె శ్రీదేవికి కూడా తెలుగులో తొలి సినిమా. ఈ సినిమా విజయం సాధించినా ఆ తర్వాత 2003లో విడుదలైన 'రాఘవేంద్ర' సినిమా పరాజయం పాలైంది. ఈ రెండు చిత్రాలతో నటన, హావభావాలతో ఆకట్టుకున్నాడనే ప్రశంసలు ప్రభాస్‌కు దక్కాయి. కానీ, చిత్రపరిశ్రమలో తన మార్క్‌ వేయలేకపోయాడు. దీంతో మూడో చిత్రంతో మంచి విజయం అందుకోవాలని చాలా ఆశలు పెట్టుకుని  2004లో త్రిష కాంబినేషన్‌తో  'వర్షం' తెరకెక్కించారు. సినిమా విడుదల తర్వాత పర్వాలేదనే టాక్‌ మాత్రమే వినిపించింది. దీంతో ఈ చిత్రం కూడా పోయిందని ప్రభాస్‌ అనుకున్నాడు. 

అయితే, వారం తర్వాత వర్షంలా కలెక్షన్స్‌ పెరిగాయి. ఆపై సూపర్‌ హిట్‌ టాక్‌తో బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని నమోదు చేశాడు. అలా ప్రభాస్‌ కెరియర్‌లో తొలి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ప్రభాస్ అడవి రాముడు, చక్రం సినిమాల్లో నటించాడు. ఈ రెండు చిత్రాలు అట్టర్‌ ఫ్లాప్స్‌ కావడంతో మళ్లీ వర్షం లాంటి సినిమాతో హిట్‌ కొట్టాలని ప్రభాస్‌ తపించాడు. అలాంటి సమయంలో ‘ఛత్రపతి’ (2005) బ్లాక్‌బస్టర్‌ కొట్టాడు. మళ్లీ రెండేళ్ల పాటు ఒక్క హిట్‌ లేదు. పౌర్ణమి, యోగి, మున్నా వరుసుగా మళ్లీ పరాజయాలే.. 

ఇలా ఇండస్ట్రీలో పడిపోయిన ప్రతిసారి తిరిగి తానేంటో నిరూపించుకున్నాడు. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో 'బుజ్జిగాడు'తో డిఫరెంట్‌ మ్యానరిజాన్ని టాలీవుడ్‌కు పరిచయం చేశాడు. 'బిల్లా'తో తనలోని స్టైలిష్‌ లుక్‌ను పరిచయం చేసిన ప్రభాస్‌ ఏక్‌ నిరంజన్‌తో మరో కోణాన్ని పరిచయం చేశాడు. అలా డార్లింగ్‌, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌, మిర్చి చిత్రాలతో అదరగొట్టేశాడు.  

బాహుబలి కోసం ఒకేఒక్కడు
బాహుబల సమయంలో ప్రతి హీరో ఏడాదికి రెండు సినిమాలు తీస్తున్నాడు. కానీ ప్రభాస్‌ మాత్రం 'బాహుబలి' కోసం జక్కన్నకి ఐదేళ్లు పూర్తి కాల్షీట్లు ఇచ్చేశాడు. అప్పుడు దేశంలో ఇదో సంచలనం. అన్ని రోజులపాటు మరో సినిమా ఒప్పుకోకుండా నిలబడిని ఏకైక హీరోగా ఆయన పేరుపొందాడు. ఆ సమయంలో అనుష్క,రానా,తమన్నా వంటి వారందరూ వేరే సినిమాలు చేశారు. ప్రభాస్‌ ఒక్కడే బాహుబలి మొత్తం అయ్యే వరకు ఒకే సినిమాకి పనిచేశాడు. ప్రభాస్‌ పడిన కష్టానికి ఫలితం దక్కింది. 

ఈ సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎనలేని గుర్తింపు వచ్చింది. ఇక్కడి నుంచే ప్రభాస్‌ నటిస్తున్న ప్రతి సినిమా కోసం నార్త్‌  ఇండియా ప్రేక్షకులూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్‌, ఆదిపురుష్,సలార్‌,కల్కి వంటి చిత్రాలు బాలీవుడ్‌లో దుమ్మురేపాయి. టాలీవుడ్‌కు ఏమాత్రం తగ్గకుండా అక్కడ కలెక్షన్లు రాబట్టాయి. ఎన్నో ఎళ్ల పాటు బాలీవుడ్‌ను శాసిస్తున్న ఖాన్‌ హీరోలను ప్రభాస్‌ వెనక్కు నెట్టేశాడు. ఈ క్రమంలో బాలీవుడ్‌ కింగ్‌ కిరీటాన్ని ప్రభాస్‌ ఎప్పుడో  అందుకున్నాడు.

ప్రభాస్‌కు స్నేహితులు.. ఆ రెండు సినిమాలు 20 సార్లు చూశాడు
ప్రభాస్‌కు అభిమాన హీరో కృష్ణంరాజు అయితే, షారుఖ్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌, రాబర్ట్‌ డి నిరో, జయసుధ, శ్రియ, త్రిష నటన అన్నా ఆయనకు చాలా ఇష్టం. తనకు దగ్గరైన దోస్తులు చాలామందే ఉన్నారు. వారిలో  గోపిచంద్, అల్లు అర్జున్, రామ్‌ చరణ్‌, రానా దగ్గుబాటి, మంచు మనోజ్‌లు ప్రభాస్‌కు మంచి స్నేహితులు. అయితే, కెరియర్‌ పరంగా  తనను అత్యున్నత స్థానంలో నిలబెట్టిన డైరెక్టర్‌గా రాజమౌళి అంటే ప్రభాస్‌కి ఎనలేని అభిమానం. ఆయన తర్వాత అంత ఇష్టమైన దర్శకుడు మరొకరు ఉన్నారు. బాలీవుడ్‌  దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీ. ఆయన సినిమాలను ప్రభాస్‌ చాలా ఎక్కువగానే ఇష్టపడతాడు. ఆయన డైరెక్ట్‌ చేసిన త్రీ ఇడియట్స్, ‘మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌ చిత్రాలను ఇరవైకి పైగా సార్లు చూసినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

ప్రభాస్‌లో ఇవన్నీ ప్రత్యేకం

► ప్రముఖ మ్యూజియం మేడమ్‌ టుసాడ్స్‌లో మైనపు విగ్రహం కలిగిన మొదటి దక్షిణాది స్టార్‌గా ప్రభాస్‌ గుర్తింపు పొందారు.
► కేవలం 'బాహుబలి' ప్రాజెక్టు కోసం ఐదేళ్లు కేటాయించడం
► ప్రభాస్‌ 2014లోనే తొలిసారి హిందీ సినిమాలో మెరిశారు. అజయ్‌ దేవగణ్‌, సోనాక్షి సిన్హా కలిసి నటించిన 'యాక్షన్‌ జాక్సన్‌'లో అతిథిగా కనిపించారు.
► ప్రభాస్‌కు పుస్తకాలు చదవడం అంటే ఎక్కువ ఆసక్తి. ఆయన ఇంట్లో ఓ చిన్న లైబ్రెరీ కూడా ఉందట.
► స్టార్‌డమ్‌ సొంతం చేసుకుని ఎన్నో ఏళ్లయినా ప్రభాస్‌ ప్రకటనలకు కాస్త దూరంగా ఉన్నారు. 2015లో తొలిసారి ఓ కారు ప్రచారంలో భాగంగా వాణిజ్య ప్రకటనలో నటించారు.

► ప్రభాస్‌ ఖాతాలో వెయ్యి కోట్లు సాధించిన సినిమాలు రెండు ఉన్నాయి బాహుబలి2, కల్కి 2898AD
 

► బాహుబలి 2 సినిమా భారతీయ సినిమా చరిత్రలో మొదటి వెయ్యి కోట్లు దాటిన చిత్రం. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 2000 కోట్లు వసూలు చేసింది.
► మిర్చి సినిమాకు ఉత్తమనటుడిగా 2013లో నంది అవార్డు దక్కించుకున్న ప్రభాస్‌
► ప్రభాస్ గత 20 ఏళ్లుగా ఏన్నోసేవా కార్యక్రమాలు చేశారు. తుఫాన్ లు, వరదలు వచ్చినప్పుడు, కొవిడ్ సమయంలో భారీ విరాళాలు ఇచ్చారు.
► తన 1650 ఎకరాల ఖాజిపల్లి రిజర్వ్ ఫారెస్ట్ భూమిని దత్తత తీసుకొని తన తండ్రి పేరు మీద ఎకో పార్క్ కు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
► ప్రభాస్‌ నటుడు కాకపోయుంటే..? హోటల్‌ రంగంలో స్థిరపడేవారు.
► ప్రభాస్‌కు ఏపీలో శ్రీశైలం అంటే ఎంతో ఇష్టం
► ఇష్టమైన పాట: 'వర్షం'లోని 'మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement