ప్రేమకు నిలువెత్తు రూపం అమ్మ. ఎంత ఎదిగినా, ఎన్ని సాధించినా, ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా అమ్మ ముందు మాత్రం చంటిపిల్లల్లా మారిపోతుంటారు అందరూ. మన జీవితం కోసం తన జీవితాన్ని ధారపోసే అమ్మకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము, కేవలం ఆ మాతృమూర్తిని గుండెల్లో పెట్టుకొని చూసుకోవడం తప్ప. అయితే బాలీవుడ్ నటుడు ప్రతీక్ బాబర్ తన తల్లిని గుండెల మీద శాశ్వతంగా ఉండేలా చూసుకున్నాడు.
తన తల్లి, దివంగత నటి స్మిత పాటిల్ పేరును పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఇతడికి తన తల్లి చేత గోరుముద్దలు తినే భాగ్యం కూడా కలగలేదు. 31 ఏళ్ల వయసులో ప్రతీక్‌కు జన్మనిచ్చిన రెండు వారాలకే ఆమె కన్నుమూసింది. తల్లి ప్రేమకు నోచుకోలేని అతడు ఇప్పటికీ అమ్మ కోసం పరితపిస్తూనే ఉంటాడు. అందుకే ఆమె పేరును శాశ్వతంగా తన ఎదరపై ఉండేలా టాటూ వేయించుకున్నాడు.
స్మిత పేరు కింద ఆమె పుట్టిన సంవత్సరం వేయించుకున్న అతడు మరణ సంవత్సరాన్ని మాత్రం రాయించుకోలేదు. దానికి బదులుగా ఆమె ఇంకా తనతోనే ఉందన్నట్లుగా అనంతం అన్న పదాన్ని సూచించే గుర్తు వేసుకున్నాడు. అతడు చేసిన పనికి అభిమానులు, స్నేహితులు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. కాగా ఇమ్రాన్ హష్మీ, జాన్ అబ్రహాం ప్రధాన పాత్రల్లో నటించిన ముంబై సాగాలోని ఓ పాత్రలో ప్రతీక్ బాబర్ కనిపించాడు. జానే తు యా జానేనా, దమ్ మారో దమ్, ఏక్ దీవానా తా వంటి పలు సినిమాల్లో నటించాడు.
Comments
Please login to add a commentAdd a comment