‘‘ఏ సినిమానీ చిన్న సినిమా, పెద్ద సినిమా అనలేం. ఆ తేడాలు మాకు లేవు. మంచి కథ చేయడం ముఖ్యం. ప్రాజెక్ట్ కె’ (ఇందులో ప్రభాస్ హీరో) చాలా పెద్ద ప్రాజెక్ట్. కానీ మేము ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో మొదలయ్యాం. మా జీవితం ఓ మలుపు తీసుకుంది ఆ చిత్రంతోనే. సో.. మా వరకు అది బిగ్ ఫిల్మ్. ఓ మంచి కథ చెప్పాలనే ఉద్దేశంతో ‘అన్నీ మంచి శకునములే’ సినిమా తీశాం’’ అన్నారు నిర్మాత స్వప్నాదత్. సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. మిత్ర విందా మూవీస్‌తో కలిసి ప్రియాంకా దత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో నిర్మాతలు స్వప్నా దత్, ప్రియాంకా దత్ చెప్పిన విశేషాలు.
► ‘అన్నీ మంచి శకునములే’ రెండు కుటుంబాల మధ్య జరిగే కథ. మంచి ఎమోషనల్ మూవీ. ఆడియన్స్ కంటతడి పెడతారు. దర్శకురాలు నందిని ఈ కథ చెప్పినప్పుడు అది కున్నూర్ బ్యాక్‌డ్రాప్‌లో లేదు. కథ రీత్యా ఆ లొకేషన్స్ అవసరం కాబట్టి అక్కడ తీశాం. హిల్‌స్టేషన్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ ఫ్యామిలీ కథ తీయాలనే ఆశ ‘అన్నీ మంచి శకునములే..’తో నెరవేరింది. ఈ సినిమా కోసం నందినీ విక్టోరియా అనే చిన్న ప్రదేశాన్ని సెట్ చేశారు. ఆడియన్స్‌ని మరో లోకంలోకి తీసుకెళ్లే సినిమా ఇది. ఇక ఈ సినిమాతో సంతోష్ శోభన్‌కు కొత్త ఇమేజ్ వస్తుందని నమ్ముతున్నాం. తన కెరీర్ మారుతుంది. నందినీ రెడ్డిగారి ‘అలా.. మొదలైంది’ చిత్రం యూత్‌ఫుల్ ట్రెండ్ సెట్టర్. ‘కళ్యాణ వైభోగమే’ కొత్తగా పెళ్లి చేసుకున్న జంట కథ. ‘ఓ బేబీ’ డిఫరెంట్ స్టోరీ. ఈ కోవలో ‘అన్నీ మంచి శకునములే’ చిత్రం ఓ డిఫరెంట్ ఫ్యామిలీ స్టోరీ. ఆడియన్స్‌కు ఈ సినిమా నచ్చుతుంది.
► దుల్కర్ పరభాష హీరో, ఖరీదైన లొకేషన్స్, మార్కెట్ ఎదురీత .. ‘సీతారామం’ సినిమా విషయంలో ఇలా ప్రతి అడుగూ ఓ సవాలే. కానీ నమ్మి చేశాం. విజయం సాధించింది. మనం నమ్మింది జరిగిందనే తృప్తి కలిగింది.
► ప్రతి సినిమాపై మాకు ఒత్తిడి ఉంటుంది. మా మనసుకు నచ్చిన కథలనే సినిమాలుగా తీస్తున్నాం. అయితే మేం ఇష్టపడి చేసిన చిత్రాలు ప్రేక్షకుల అభిరుచికి దాదాపుగా మ్యాచ్ కావడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం.
► సినిమా ఇండస్ట్రీలో నాన్నగారు (నిర్మాత అశ్వినీదత్) 50 ఏళ్ళుగా నిలబడ్డారు. ఇప్పుడు ఆయన పిల్లలు సినిమాలు తీస్తున్నారు. ఆయన ఏ రోజూ లెక్కలు వేసుకుని సినిమాలు తీయలేదు. ఈ దారిలో మేం కూడా వెళ్తున్నాం. సినిమాల్లోకి వచ్చామంటే ప్యాషన్‌తోనే. లెక్కలు వేసుకుంటే సినిమాలు తీయలేం.
► అందరం చర్చించుకునే ఓ జడ్జ్‌మెంట్‌కు వస్తాం. ‘జాతిరత్నాలు’ సినిమాను నేను (స్వప్న) ఓటీటీకి అమ్మేద్దాం అన్నాను. కానీ నాగీ (‘మహానటి’ ఫేమ్ దర్శకుడు నాగ్ అశ్విన్), ప్రియాంక ఆ సినిమాను నమ్మారు. ‘ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అవుతుంది. పోతే మొత్తం పోతుంది. థియేటర్స్‌లో రిలీజ్ చేద్దాం’ అన్నాడు నాగీ. సినిమా మంచి హిట్ అయింది. ‘మహానటి’ని నేనెక్కువగా నమ్మాను. చాలా బాధ్యతతో ఆ సినిమా చేశాం. నాగీ నిర్ణయాలు మా బ్యానర్‌కు బలం.
► నిర్మాతలుగా మీరు కష్టపడుతున్నారు. నేను కూడా ఎందుకని మా చెల్లి (స్రవంతి) అన్నారు. ఇంట్లో పిల్లలు సేఫ్‌గా ఉన్నారు, అమ్మా, చెల్లి చూసుకుంటున్నారనే ధైర్యం ఉండబట్టే మేం సినిమాలు తీస్తున్నాం.
అది మా అదృష్టం
Published Sun, May 7 2023 4:51 AM | Last Updated on Sun, May 7 2023 4:51 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment