కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాత కాపాడాలంటూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. తనను వడ్డీ వ్యాపారులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ నిర్మాత పుష్కర్ మల్లికార్జునయ్య సీసీబీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కన్నడ పరిశ్రమలో ఆయన సుమారు 20కి పైగా చిత్రాలు నిర్మించారు. హీరో రక్షిత్ శెట్టితో 'అతడే శ్రీమన్నారాయణ' చిత్రానికి పుష్కర్ మల్లికార్జునయ్య నిర్మాతగా ఉన్నారు. కన్నడలో సూపర్ హిట్ అయిన రష్మిక మందన్న,రక్షిత్ శెట్టి నటించిన 'కిరిక్ పార్టీ' చిత్రానికి కూడా ఆయన పెట్టుబడిపెట్టారు.
2021లో మలయాళం భాషలో ఆయన నిర్మించిన 'థింకలజచ్చా నిశ్చయం' (Thinkalazhcha Nishchayam) అనే చిత్రానికి జాతీయ అవార్డు దక్కింది. మలయాళంలో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 68వ జాతీయ చలనచిత్ర అవార్డును దక్కించుకుంది. 'సోనీ లివ్' ఓటీటీ వేదకగా ఈ సినిమా తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇలా ఎన్నో గొప్ప సినిమాలు నిర్మించిన ఆయనకు చిత్రపరిశ్రమలో నష్టాలు మిగలడంతో వడ్డీ వ్యాపారుల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు.
రూ. 5 కోట్ల అప్పు కోసం రూ. 11.5 కోట్లు ఇచ్చినా కూడా..
వడ్డీ వ్యాపారుల నుంచి తనకు తీవ్రమైన వేధింపులు ఉన్నాయని పుష్కర్ మల్లికార్జునయ్య ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన సీసీబీ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కొన్ని సినిమాలు ఆశించిన మేర విజయం సాధించకపోవడం, కోవిడ్ సమయంలో నష్టాలు అనుభవించిన పుష్కర్ మల్లికార్జునయ్య 2019 నుంచి 2023 వరకు బంధువు ఆదర్శ్ డీ.బీ. అనే వ్యక్తి నుంచి దశలవారీగా రూ.5 కోట్ల రుణం తీసుకున్నాడు. ప్రతినెల 5 శాతం వడ్డీ డబ్బు నగదు రూపంలో ఇచ్చాడు. రూ.5 కోట్లు అసలు, వడ్డీ సమేతంగా ఇప్పటి వరకు మొత్తం రూ.11.50 కోట్లు చెల్లించాడు.
అయితే చెల్లించిన డబ్బు కేవలం వడ్డీ, చక్రవడ్డీకి సరిపోతుంది, ఇంకా రూ.13 కోట్లు ఇవ్వాలని ఆదర్శ్ డిమాండ్ చేశాడు. అంతేగాక ఆదర్శ్, హర్ష, శివు, హర్ష మరికొంత మంది అనుచరులతో కలిసి తన ఇళ్లు, కార్యాలయానికి వచ్చి అసభ్య పదజాలంతో దూషించి బెదిరింపులకు పాల్పడ్డారని పుష్కర్ ఆరోపించారు. వీరిపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం సీసీబీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ కిశోర్‌కుమార్‌కు నిర్మాత పుష్కర్ ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment