హీరో అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదైంది. పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ థియేటర్‌కు వస్తున్న సందర్భంగా భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించినందుకుగానూ సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. అలాగే బన్నీ వస్తున్న విషయాన్ని పోలీసులకు సరైన సమయంలో చెప్పకుండా భాద్యతారాహిత్యంగా వ్యవహరించారంటూ అల్లు అర్జున్ టీమ్‌పైనా కేసు ఫైల్ చేశారు.
అసలేం జరిగిందంటే?
సెంట్రల్ జోన్ డీసీ అక్షాంశ్ యాదవ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షోను ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్‌లో బుధవారం రాత్రి 9.40 గంటలకు ఏర్పాటు చేశారు. దీనికి భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో హీరో అల్లు అర్జున్.. భార్య స్నేహతో కలిసి థియేటర్‌కు వెళ్లాడు. సినిమా టీమ్ థియేటర్‌కు వస్తుందని పోలీసులకు ఎవరూ సమాచారం ఇవ్వలేదు. థియేటర్ యాజమాన్యం కూడా ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు.
ఎంట్రీ, ఎగ్జిట్ లలో కూడా ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదు. అల్లు అర్జున్ భద్రతా సిబ్బంది ప్రేక్షకులను అదుపు చేసే క్రమంలో వారిని నెట్టేయడం ప్రారభించారు. అప్పటికే థియేటర్ లోపల, వెలుపల జనం కిక్కిరిసిపోయి ఉండటంతో తోపులాట జరిగింది. ఈ తొక్కిసలాటలో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి కుటుంబం చెల్లాచెదురయ్యారు. పెద్ద ఎత్తున జనాలు ఉండటంతో ఊపిరాడక స్పృహ తప్పి పడిపోయారు.
వారిని గమనించిన పోలీసు సిబ్బంది రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే రేవతి మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. శ్రీతేజ్‌కు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 105, 118(1) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment