డైరెక్టర్ క్వెంటిన్ టరంటినో సినిమా అనగానే స్టయిలిష్ వయొలెన్స్, లెంగ్తీ డైలాగ్స్ కామన్ అని హాలీవుడ్ ప్రేక్షకులు అంటుంటారు. దర్శకుడిగా చాలా పాపులార్టీ సంపాదించుకున్న ఆయన తన రెండో చిత్రం ‘పల్ప్ ఫిక్షన్’ (1994)కే బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లేకి ఆస్కార్ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత క్వెంటిన్ దర్శకత్వం వహించిన వాటిలో ‘ఇన్ గ్లోరియస్ బాస్టర్డ్స్, జాంగో అన్‌చైన్డ్, ది హేట్‌ఫుల్ ఎయిట్, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్’ చిత్రాలకు వివిధ విభాగాల్లో ఆస్కార్ అవార్డులు దక్కాయి.
నటుడిగానూ పలు చిత్రాల్లో నటించారు. ఇప్పటివరకూ తొమ్మిది చిత్రాలకు దర్శకత్వం వహించిన క్వెంటిన్ తన పదో చిత్రంగా ‘ది మూవీ క్రిటిక్’ని ప్రకటించారు. ఇదే తనకు చివరి చిత్రం అన్నట్లుగా కూడా పేర్కొన్నారు. 1977లో దక్షిణ కాలిఫోర్నియాకి చెందిన ఓ పత్రికకు సినిమా రివ్యూలు అందించిన ఓ క్రిటిక్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించాలనుకున్నారు. తాను యుక్త వయసులో ఉన్నప్పుడు ఆ జర్నలిస్ట్ రాసిన రివ్యూలు చదివి చాలా ఘాటుగా ఉన్నట్లు భావించానని, అదే విధంగా కామెడీగా కూడా అనిపించిందని ఓ సందర్భంలో క్వెంటిన్ పేర్కొన్నారు కూడా.
అందుకే అతని జీవితంతో సినిమా తీయాలనుకుని, 2023 జూన్‌లో ప్రీ ప్రొడక్షన్ పనులు ఆరంభించారు. తన గత చిత్రం ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్’లో నటించిన బ్రాడ్ పిట్‌ని ‘ది మూవీ క్రిటిక్’లో హీరోగా ఎంపిక చేసుకున్నారని కూడా వార్త ప్రచారమైంది. అయితే హఠాత్తుగా ఏమైందో ఏమో కానీ ‘ది మూవీ క్రిటిక్’ని తెరకెక్కించాలనే ఆలోచనను క్వెంటిన్ విరమించుకున్నారట. ఇప్పుడు హాలీవుడ్‌లో ఇది హాట్ టాపిక్ అయింది. మరి... 61 ఏళ్ల క్వెంటిన్ చివరి చిత్రం ‘ది మూవీ క్రిటిక్’ కాక΄ోతే వేరే ఏ చిత్రం అవుతుందనే చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment