ఏఆర్ రెహమాన్ దాదాపు 150 చిత్రాలకు పాటలు స్వర పరిచారు. ఆస్కార్ అవార్డు సాధించారు. ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. అయితే ‘‘నేనింకా నేర్చుకునే దశలో ఉన్నాను. నా కెరీర్ ఇప్పుడే మొదలైనట్లుగా అనిపిస్తోంది. ఎందుకంటే ప్రతీ పదేళ్లకు సంగీతంలో మార్పులొస్తున్నాయి’’ అన్నారు రెహమాన్. ఉదయనిధి స్టాలిన్, కీర్తీ సురేష్ ప్రధాన పాత్రల్లో రూపొందించిన తమిళ ‘మామన్నన్’కి రెహమాన్ సంగీతం అందించారు. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో ‘నాయకుడు’గా రేపు రిలీజవుతోంది. ఈ సందర్భంగా ఏఆర్ రెహమాన్ ఇచ్చిన ఇంటర్వ్యూ...
► ఇటీవల పొన్నియిన్ సెల్వన్’లాంటి పీరియాడికల్ ఫిల్మ్‌కి సంగీతం అందించిన మీకు ‘నాయకుడు’లాంటి రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలు చేయడం ఎలా అనిపిస్తుంటుంది?
‘నాయకుడు’ రాజకీయ నేపథ్యంలో రూపొందించిన సినిమా. సమాజంలోని అసమానతలతో పాటు చాలా విషయాల గురించి చర్చించారు. ఈ తరహా సినిమాలకు సంగీతం అందించడం సవాల్ అని చెప్పలేను కానీ ఓ కొత్త అనుభూతి మాత్రం దక్కుతుంది. చాలా రోజుల తర్వాత నేను జానపద తరహా పాటలు ఇచ్చిన చిత్రమిది.
► మీరు ఒక సినిమా ఒప్పుకోడానికి కథ, హీరో, దర్శకుడు.. ఈ మూడింటిలో ఏ అంశానికి ప్రాధాన్యం ఇస్తారు?
మూడూ ముఖ్యమే. మంచి కథ ఉంటే మంచి పాటలు ఇవ్వగలం. ఆ పాటలను దర్శకుడు చక్కగా తెరకెక్కించాలి. హీరో చేసే మంచి పెర్ఫార్మెన్స్‌ని బట్టి ఆ పాట హైలైట్ అవుతుంది. ఇప్పుడు ‘నాయకుడు’ విషయానికి వస్తే.. హీరో ఉదయనిధి స్టాలిన్ ముందు నన్ను సంప్రదించారు. సంగీతం అందించాలని అడిగారు. ఆ తర్వాత నేను కథ విన్నాను.. ఆసక్తిగా అనిపించింది. దర్శకుడు మారీ సెల్వరాజ్ ఇప్పటివరకూ తీసిన సినిమాలకు భిన్నంగా ఈ చిత్రకథ ఉంది. మారి ఈ కథకు చాలా మాస్ అప్పీల్ ఇచ్చారు. అందుకు తగ్గట్టు పాటలు ఇచ్చాను. ఈ సినిమాలో ప్రతి పాట కథను ముందుకు తీసుకుని వెళుతుంది. అందుకే మ్యూజిక్ ఇవ్వడాన్ని ఎంజాయ్ చేశా.
► అందుకేనా ఈ సినిమా ఫంక్షన్‌కి సంబంధించిన వేదికపై ‘జివ్వు జివ్వు...’ పాటకు డ్యాన్స్ కూడా చేశారు..
ఈ సాంగ్ సిట్యువేషన్ చాలా మెచ్యూర్డ్‌గా ఉంటుంది. అది మైండ్‌లో పెట్టుకోవడంతో పాటు ఫన్ టచ్ ఇవ్వాలనుకుని ట్యూన్ చేశా. ఫన్ కోసమే స్టేజి మీద డ్యాన్స్ కూడా చేశాను.
► సంగీతంలో మార్పులు వస్తున్నట్లే మీ ఆలోచనా విధానం కూడా మారుతోందా?
ఎన్ని మార్పులు వచ్చినా మెలోడీ మారదు. లిరిక్ కూడా మారదు.. 30, 40 ఏళ్లుగా అదే. అయితే వైబ్రేషన్ కొంచెం మారుతుంది... బీట్ మారుతుంది. ‘రోజా’ నుంచి నా ఫార్ములా, మైండ్ సెట్ ఒక్కటే. అదేంటంటే నా పాట సింపుల్‌గా, క్యాచీగా ఉండాలి. ప్రేక్షకుల్లో, సమాజంలో వచ్చిన మార్పు తాలూకు ప్రభావం సంగీతంపై ఉంటుంది. ఇప్పుడు సంగీతానికి ఇంకా స్కోప్ పెరిగింది.
► తెలుగులో బుచ్చిబాబు డైరెక్షన్‌లో రామ్‌చరణ్ హీరోగా రూపొందనున్న చిత్రం గురించి?
ఇది చాలా ఎగ్జయిటింగ్ ప్రాజెక్ట్. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పడానికి ఇంకా చాలా టైమ్ ఉంది. ఇప్పుడే రివీల్ చేయలేను.
► మీ అమ్మాయి ఖతీజా తమిళ చిత్రం ‘మిన్‌మిని’తో సంగీత దర్శకురాలిగా పరిచయం కానున్నారు... ఓ ఫాదర్‌గా మీ ఫీలింగ్?
మహిళలు తాము అనుకున్నది సాధించాలనుకునే మైండ్ సెట్ నాది. మా ఇంట్లో మా అమ్మగారు, నా వైఫ్ వెరీ స్ట్రాంగ్. నా కూతురు ఖతీజా కూడా అంతే. ఏ మాత్రం టెన్షన్ పడటంలేదు. ట్యూన్స్ ఎలా ఇవ్వాలనే విషయంలో తనకు మెచ్యూర్టీ ఉంది. ఓ ఫాదర్‌గా ఐయామ్ హ్యాపీ.
► ‘గాంధీ టాక్స్’ అనే సైలెంట్ చిత్రానికి మ్యూజిక్ ఇవ్వడంపై మీ అనుభూతి గురించి?
గతంలో ‘పుష్పక విమానం’లాంటి సైలెంట్ సినిమాలను అద్భుతంగా చేశారు. ఇప్పుడు నాకలాంటి మంచి అవకాశం వచ్చింది. ఇలాంటి సినిమాలు సవాల్ అనాలి. అందుకే ఈ సినిమా డైరెక్టర్ కిశోర్‌తో ‘ఐ హేట్ యు.. లవ్ యు’ అని సరదాగా అన్నాను. డైలాగ్స్ లేకుండా సాగే ఈ సినిమాలోని సందర్భాలకు తగ్గట్టు మ్యూజిక్ ఇవ్వడం అనేది నాకు ఎగ్జయిటింగ్‌గా అనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment