టాలీవుడ్‌లో చిన్న చిన్న పాత్రల నుంచి హాస్యనటుడిగా ఎదిగి ఆ తరువాత కథానాయకుడి స్థాయికి చేరిన నటుడు ధన్‌రాజ్. ఈయన తాజాగా దర్శకుడిగా అవతారమెత్తి కథానాయకుడిగా నటించిన చిత్రం 'రామన్ రాఘవన్'. నటుడు సముద్రఖని ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రం ద్వారా మోక్ష అనే నటి కథానాయకిగా పరిచయం అవుతున్నారు. స్టేట్ పెన్సిల్ ప్రొడక్షన్స్ పతాకంపై పృధ్వీ పోలవరపు నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళం భాషల్లో రూపొందింది. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది.
ఈ సందర్భం తాజాగా చిత్రం టీజర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో నిర్వహించారు. ఇందులో దర్శకుడు బాలా, పాండిరాజ్, నటుడు బాబీసింహ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని టీజర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకుడు, కథానాయకుడు ధన్‌రాజ్ మాట్లాడుతూ.. అమ్మానాన్నలకు ధన్యవాదాలన్నారు. శివప్రసాద్ రాసిన కథతో రూపొందించిన చిత్రం రామన్ రాఘవన్ అని తెలిపారు. తాను ఈ చిత్రానికి యాక్సిడెంటల్ దర్శకుడినని చెప్పారు. ఏ దర్శకుడి వద్ద పనిచేయలేదని చెప్పారు.
వేరే దర్శకుడు చేయాల్సిన ఈ చిత్రానికి తాను అనివార్యకారణాలతో దర్శకుడిని అయ్యానన్నారు. ఈ చిత్రం కథ గురించి సముద్రఖని చెప్పినప్పుడు నువ్వే దర్శకత్వం వహించు అని ధైర్యం ఇచ్చారన్నారు. తాను 100 మంది దర్శకుల చిత్రాల్లో నటించానని, వారి ప్రభావంతోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చెప్పారు. సముద్రఖని లేకపోతే ఈ చిత్రం ఉండేది కాదని ధన్‌రాజ్ పేర్కొన్నారు. సముద్రఖని మాట్లాడుతూ తాను ఇప్పటివరకూ 10కి పైగా చిత్రాల్లో నాన్నగా నటించానని చెప్పారు. అవి ఒక్కొక్కటి ఒక్కో విధంగా రూపొందాయన్నారు. ఈ చిత్ర దర్శకుడు ధన్‌రాజ్‌కు అమ్మా నాన్న లేరని, తనే స్వయం కృషితో ఈ స్థాయికి వచ్చారని పేర్కొన్నారు.
నాన్న ఇతి వృత్తంతో కూడిన కథ అని తను చెప్పగానే రండి చేద్దాం అని చెప్పానన్నారు. నమ్మకంతో వచ్చే వాళ్లు చిత్రాన్ని బాగా రూపొందిస్తారని అలా ధన్‌రాజ్‌ను నమ్మి తానీ చిత్రం చేశానని చెప్పారు. ఇది తండ్రీ కొడుకుల మధ్య ప్రేమాభిమానాలను ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందని సముద్రఖని చెప్పారు. దర్శకుడు బాలా మాట్లాడుతూ సముద్రఖనికి అభిమానిగా తాను ఇక్కడికి వచ్చానన్నారు. ఆయన నటుడిగా తానేమిటో నిరూపించుకున్నారని, ఆయన శ్రమకు తాను అభిమానినని అన్నారు. ఇతరులకు సహాయం చేసే ఆయన గుణం తనను ఆశ్చర్యానికి గురి చేస్తుందన్నారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నట్లు బాలా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment