సాక్షి, హైదరాబాద్: సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులను బ్యాడ్ న్యూస్. రజనీకాంత్ రాబోయే తమిళ చిత్రం 'అన్నాట్టే' మరోసారి కరోనావైరస్ మహమ్మారి సెగ తగిలింది. కరోనా, లాక్‌డౌన్ ఆంక్షలతో దీర్ఘకాలంగా వాయిదా పడి, ఇటీవలే తిరిగి ప్రారంభమైన షూటింగ్‌కు మళ్లీ బ్రేకులు పడ్డాయి. ఈ మూవీ సెట్లో కోవిడ్-19 కేసులు నమోదు కావడంతో అన్నాట్టే షూటింగ్ నిలిపివేశారు. యూనిట్‌లో ఏకంగా ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. రజనీకాంత్‌కు సమీపంగా మెలిగిన సాంకేతిక సిబ్బందికి కరోనా సోకిందని, దీంతో ముందు జాగ్రత్తగా, షూటింగ్ కార్యక్రమాలను తాత్కాలికంగా నిలిపివేసినట్టు సమాచారం. ఈ కారణంగా రజనీ గురువారం చెన్నైకి తిరిగి వెళ్లనున్నారని భావిస్తున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షల నిమిత్తం శాంపిల్స్ ఇచ్చిన అనంతరం రజనీకాంత్, నయనతార తదితరులు సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లనున్నారు. (రజనీ రాజకీయ పార్టీ పొంగల్‌కు పక్కా!)
గత వారం రజనీకాంత్ తన కుమార్తె ఐశ్వర్యా ధనుష్‌తో కలిసి షూటింగ్ నిమిత్తం చార్టర్డ్ ఫ్లైట్‌లో హైదరాబాద్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో డిసెంబర్ 14 న షూటింగ్ ప్రారంభమైంది. షెడ్యూల్ 45 రోజులు ఉండాల్సి ఉంది. ఇటీవలి కాలంలో రజనీకాంత్ కొత్త పార్టీ ప్రకటించిన నేపథ్యం, రాబోయే తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న తరుణంలో వీలైనంత త్వరగా ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేయాలని యోచిస్తున్నారు. అన్నాట్టే షూటింగ్‌లో 40శాతం మిగిలి ఉందని, తాను రాజకీయాల్లోకి రాకముందే దీన్ని పూర్తి చేస్తానని రజనీకాంత్ ఇటీవల మీడియా ఇంటరాక్షన్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే.
కాగా అన్నాట్టే తమిళనాడులోని లోతట్టు ప్రాంతాలలో గ్రామీణ నేపథ్యం ఉన్న కథగా తెరకెక్కుతోంది. సిరుతై శివ దర్శకత్వంలో, సన్ పిక్చర్స్ నిర్మిస్తున్నఈ చిత్రంలో నయనతార, కీర్తి సురేష్, మీనా, ఖుష్భు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా, ఈ సంవత్సరం ప్రారంభంలో అన్నాట్టే షూటింగ్ నిరవధికంగా నిలిచిపోగా, సుమారు తొమ్మిది నెలల తరువాత, వారం క్రితం షూట్ తిరిగి ప్రారంభమైంది. ఇంతలోనే మరోసారి కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోవడం ఆయన అభిమానుల్లో ఆందోళన రేపింది.
Comments
Please login to add a commentAdd a comment