రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం జైలర్. బాలీవుడ్ స్టార్ జాకీష్రాఫ్, మలయాళం సూపర్‌స్టార్ మోహన్‌లాల్, కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్, తెలుగు నటుడు సునీల్, నటి రమ్యకృష్ణ, తమన్నా, యోగిబాబు, కింగ్స్‌లీ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి నెల్సన్ కథ ,దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. అనిరుధ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మించింది.
కాగా ఈనెల 10న విడుదలైన ఈ చిత్రం విజయఢంకా మోగిస్తూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తాజాగ చిత్ర సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. దర్శకుడు నెల్సన్ మాట్లాడుతూ జైలర్ చిత్రం ఇంత సంచలన విజయాన్ని సాధిస్తుందని ఊహించలేదన్నారు. ఒక మంచి చిత్రాన్ని చేయాలన్న భావనతోనే చిత్ర షూటింగ్ ప్రారంభించినట్లు చెప్పారు. అయితే ఈ చిత్ర ఘన విజయానికి కారణం కథ, రజనీకాంత్ ఫీవర్, స్లాంగ్, అభిమానుల ఆదరణే ముఖ్యకారణమన్నారు.
(ఇదీ చదవండి: ఆ రూమర్స్‌పై 'భోళా శంకర్' నిర్మాత ఆగ్రహం.. చిరు ఎప్పుడూ!)
చిత్ర విడుదలకు మూడు రోజుల ముందు రజనీకాంత్ చూశారన్నారు. అప్పుడు మీరు ఊహించిన విధంగా చిత్రం వచ్చిందా అని ఆయన్ని అడిగానని, అందుకు ఆయన ఊహించిన దానికంటే పదిరెట్లు బాగా వచ్చిందని చెప్పారన్నారు. చిత్రం బాగా వస్తుందని తెలుసు కానీ, ఇంత బాగా వస్తుందని ఊహించలేదన్నారు. ఆ ప్రశంసే ఆనందాన్నిచ్చిందన్నారు. ఇప్పటి సంతృప్తే అప్పుడే కలిగిందనే అభిప్రాయాన్ని నెల్సన్ వ్యక్తం చేశారు.
చిత్రం బడ్జెట్ ముందుగా అనుకున్న దానికంటే పెరిగిందని అయినా సన్ పిక్చర్స్ నిర్వాహకులు కాదనకుండా ఖర్చు చేశారని చెప్పారు. నిర్మాత కళానిధి చిత్రం ప్రారంభించినప్పటి నుంచి చాలా సపోర్టుగా ఉన్నారన్నారు. జైలర్ చిత్రం ఏడు రోజుల్లో రూ.375.40 కోట్లు వసూలు చేసిందని నిర్మాతల వర్గం గురువారం అధికారికంగా ఒక ప్రకటనను విడుదల చేశారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment