ఎవర్‌గ్రీన్ సూపర్‌స్టార్‌గా రాణిస్తున్న నటుడు రజనీకాంత్. ఈయనకు దళపతి విజయ్ పోటీ అంటూ ఇటీవల ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రచారంతో నటుడు రజనీకాంత్ లాల్ సలామ్ చిత్ర ఆడియో ఆవిష్కరణ వేదికపై గట్టిగానే కౌంటర్ ఇచ్చిన విషయం విధితమే. కాగా ఇప్పుడు విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి పార్టీ పేరును కూడా ఖరారు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఒకటి రెండు చిత్రాలు చేసి నటనకు స్వస్తి పలకబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో రజనీకాంత్ సూపర్‌స్టార్ పట్టానికి మరి కొంతకాలం ఎలాంటి ఢోకా ఉండబోదనేది కోలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న చర్చ.
ఈ విషయాన్ని పక్కన పెడితే రజనీకాంత్ వరుసగా చిత్రాలను చేసుకుంటూ పోతున్నారు. ఈయన ప్రస్తుతం జై భీమ్ చిత్ర ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో వేట్టైయాన్ చిత్రంలో నటిస్తున్నారు. దీని తరువాత లోకేష్ కనకరాజ్‌తో తన 171వ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. కాగా ఇటీవల తన పెద్ద కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించిన లాల్ సలామ్ చిత్రంలో రజనీకాంత్ అతిథిగా పవర్‌ఫుల్ పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి..తొలి రోజే నెగెటివ్ టాక్ వచ్చింది.
ఇదిలా ఉంటే పెద్ద కూతురు చిత్రంలో నటించిన రజనీకాంత్ తాజాగా ఆయన చిన్న కూతురు సౌందర్య దర్శకత్వం వహించనున్న చిత్రంలోనూ అతిథి పాత్రలో నటించడానికి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. సౌందర్య ఇంతకు ముందే తన తండ్రి కథానాయకుడిగా కోచ్చడయాన్ అనే యానిమేషన్ చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు. కాగా తాజాగా సౌందర్య రజనీకాంత్ మరో చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధమయ్యారు. రాఘవ లారెన్స్ కథానాయకుడిగా నటించిన వి.క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్నారు. ఇందులో రజనీకాంత్ అతిథి పాత్రలో నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు, ఈ చిత్రానికి పది రోజులు కాల్‌షీట్స్ కూడా కేటాయించినట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది. అయితే దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా వెలువడ లేదు.
Comments
Please login to add a commentAdd a comment