
మెగా హీరో రామ్ చరణ్, భార్య ఉపాసన ఎక్కడికెళ్లినా ప్రత్యేకంగా కనిపిస్తారు. తాజాగా అమెరికాలో జరిగిన ఆస్కార్ వేడుకలో ఈ జంట సందడి చేసింది. మరికొన్ని నెలల్లోనే ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా అమెరికాలో జరిగిన ఆస్కార్ కార్యక్రమానికి వెళ్లేముందు ఈ జంట పూజలు చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి. రామ్ చరణ్, భార్య ఉపాసన ఎక్కడికి వెళ్లినా ఒక చిన్న ఆలయాన్ని ఏర్పాటు చేసుకుని ప్రార్థనలు చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతే కాకుండా భారతీయ సంప్రదాయ దుస్తులో ఈ జంట వేదికపై సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది.
రామ్ చరణ్ మాట్లాడుతూ.. 'నేను, నా భార్య ఎక్కడికి వెళ్లినా చిన్న ఆలయాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఇది మా ఆచారంతో పాటు భారతదేశానికి సంప్రదాయం ఉట్టిపడేలా చేస్తుంది. ఈ రోజును కృతజ్ఞతలు తెలుపుతూ ప్రారంభించడం మనందరికీ చాలా ముఖ్యం. మాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.' అని అన్నారు. కాగా.. రామ్ చరణ్ ధరించిన దుస్తులపై ఉన్న బటన్లు నిజానికి నాణేలు, వీటిని భారత్ చిహ్నంతో డిజైన్ చేశారు. ప్రస్తుతం ఆరు నెలల గర్భవతి అయిన ఉపాసన తెలంగాణ కళాకారులు తయారు చేసిన పట్టు చీరలో కనిపించారు.
కాగా.. 95వ ఆస్కార్ వేడుకల్లో RRRలోని నాటు నాటు సాంగ్‌కు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ దక్కింది. ఈ అవార్డును ఎంఎం కీరవాణి, రచయిత చంద్రబోస్ అందుకున్నారు. కాగా.. రామ్ చరణ్ తన తదుపరి చిత్రం శంకర్ దర్శకత్వంలో ఆర్‌సి 15లో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో కియారా అద్వానీ జోడిగా నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment