హీరోయిన్లు ఒకే భాషకు పరిమితం కారనే విషయం తెలిసిందే. హీరోలు, దర్శకులు మాత్రం దాదాపు ఒకే భాషలోనే సినిమాలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. హీరోలకు, దర్శకులకు హద్దులు, సరిహద్దులు లేవని పాన్ ఇండియన్ సినిమాలు చెబుతున్నాయి. దర్శకులు, హీరోలు ఇప్పుడు ఏ భాషలో అయినా సినిమాలు చేస్తున్నారు. కానీ ఈ ట్రెండ్ టాలీవుడ్‌లో మాత్రం ఎక్కువగా కనిపిస్తోంది. మరి... మన తెలుగింటి హీరోలు... ఏ పక్కింటి దర్శకులతో సినిమాలు చేస్తున్నారో తెలుసుకుందాం.
కాంబో రిపీట్
చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమాతో బిజీగా ఉన్నారు. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా వేసవిలో రిలీజ్ కావొచ్చని టాక్. ఈ చిత్రం తర్వాత చిరంజీవి ఏ దర్శకుడితో సినిమా చేస్తారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. హరీష్ శంకర్, మారుతి... ఇలా చాలామంది పేర్లు వినిపించాయి. అయితే ఇటీవల ఓ సందర్భంలో తన తర్వాతి చిత్రాల్లో ఒకటి చిరంజీవితో ఉంటుందని, సామాజిక నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందని, రచయిత–దర్శకుడు బీవీఎస్ రవి పేర్కొన్నారు. ఈ సినిమాకు బీవీఎస్ రవి కేవలం కథ మాత్రమే ఇస్తున్నారని, దర్శకత్వ బాధ్యతలు మోహన్‌రాజా తీసుకుంటున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం.
మోహన్ రాజా తెలుగు అయినప్పటికీ చెన్నైలో సెటిల్ అయి, తమిళ సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు. ఇక చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల ఈ చిత్రానికి ఓ నిర్మాతగా వ్యవహరించనున్నారని తెలిసింది. త్వరలోనే ఈ సినిమా గురించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. ఇక హీరో చిరంజీవి–దర్శకుడు మోహన్‌రాజా కాంబినేషన్‌లో ఆల్రెడీ ‘గాడ్ ఫాదర్’ (2022) అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. మోహన్ లాల్ మలయాళ హిట్ ఫిల్మ్ ‘లూసిఫర్’కు తెలుగు రీమేక్‌గా ‘గాడ్ ఫాదర్’ చిత్రం రూపొందిన విషయం గుర్తుండే ఉంటుంది.
నవీన్‌తో నెక్ట్స్
సోలో హీరోగా నాగార్జున నెక్ట్స్ ఫిల్మ్ ఎవరితో ఉంటుందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. కానీ తమిళంలో ‘మూడర్ కూడం, అగ్ని సిరగుగళ్’ సినిమాలు తీసిన దర్శకుడు నవీన్ గత ఏడాది నాగార్జునకు ఓ కథ వినిపించారట. ఈ మూవీకి నాగార్జున కూడా ఓకే చెప్పారని ఫిల్మ్‌నగర్ సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్‌ను మరింత మెరుగుపరచే పనిలో నవీన్ బిజీగా ఉన్నారని, ఈ సినిమా విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని భోగట్టా. మరోవైపు ప్రస్తుతం నాగార్జున తమిళ చిత్రం ‘కూలీ’లో ఓ లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాకు దర్శకుడు. రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న ‘కూలీ’ చిత్రం ఈ వేసవిలో విడుదల కానుంది. అలాగే తమిళ హీరో ధనుష్‌తో కలిసి నాగార్జున ‘కుబేర’ చేస్తున్నారు. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకుడు.
బిజీ బిజీ
ప్రభాస్ చాలా చాలా బిజీగా ఉన్నారు. ప్రభాస్ హీరోగా ‘రాజా సాబ్, ఫౌజి’ (ప్రచారంలో ఉన్న టైటిల్)’ సినిమాలు ప్రస్తుతం సెట్స్‌పై ఉన్నాయి. ఈ సినిమాల తర్వాత ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా సెట్స్‌లోకి వెళ్తారు. కాగా ఇటీవల కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్‌లో ప్రభాస్ మూడు సినిమాలు కమిట్ అయ్యారు. ఈ చిత్రాల్లో ఒకటి తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌తో ఉంటుందని తెలిసింది. మరోటి కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ‘సలార్ 2’ అని ఊహించవచ్చు.
ఇంకో సినిమాకు తెలుగు దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఇలా... ఓ తమిళ దర్శకుడు, ఓ కన్నడ దర్శకుడితో ప్రభాస్ సినిమాలు చేయనున్నారు. అంతేకాదు... ఇటీవల ప్రభాస్‌కు ఓ హిందీ దర్శకుడు కథ వినిపించారని, ఇప్పటికే ప్రభాస్ కమిటైన సినిమాల చిత్రీకరణలు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ఈ సినిమాను ప్రకటిస్తారని బాలీవుడ్ భోగట్టా.
‘జైలర్’ దర్శకుడితో...
ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘వార్ 2’. హిందీ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ మరో హీరోగా చేస్తున్నారు. ‘వార్ 2’ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. అయితే ఈ మూవీ తర్వాత హీరో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) సినిమా షూట్‌లో జాయిన్ అవుతారు. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు.
ఈ ఏడాదే షూటింగ్ ప్రారంభమయ్యేలా ప్రశాంత్ నీల్ సన్నాహాలు చేశారు. ముందుగా ఎన్టీఆర్ లేని సన్నివేశాలను చిత్రీకరించి, కొత్త సంవత్సరంలో ఎన్టీఆర్ పాల్గొనే సన్నివేశాల షూట్‌ను ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశారని తెలిసింది. 2026 జనవరి 9న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ఆల్రెడీ మేకర్స్ ప్రకటించారు. అలాగే తమిళంలో ‘కోలమావు కోకిల, డాక్టర్, జైలర్’ సినిమాలను తీసిన దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ ఇటీవల ఎన్టీఆర్‌కు ఓ కథ వినిపించారు. ఎన్టీఆర్ కూడా ఈ సినిమా చేసేందుకు అంగీకరించారని తెలిసింది. అయితే రజనీకాంత్‌తో ‘జైలర్ 2’ చేసిన తర్వాత ఎన్టీఆర్‌తో నెల్సన్ దిలీప్ కుమార్ సినిమా చేస్తారు. కాబట్టి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లేది 2026లోనే అని ఊహింవచ్చు.
కథ విన్నారా?
రామ్‌చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ సినిమాను తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నారన్న సంగతి తెలిసిందే. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్. ఈ చిత్రం జనవరి 10న సంక్రాంతికి రిలీజ్ కానుంది. అలాగే రామ్‌చరణ్ తర్వాతి చిత్రాలకు ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన, సుకుమార్ డైరెక్ట్ చేస్తారు. అయితే ఓ హిందీ దర్శకుడు రామ్‌చరణ్‌కు కథ వినిపించారనే టాక్ కొన్ని రోజులు క్రితం ప్రచారంలోకి వచ్చింది. మరి... ఈ వార్త నిజమేనా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
మహాభారతం దర్శకుడితో...
హిందీ సీరియల్ ‘మహాభారతం’ చాలా ఫేమస్. ఈ సీరియల్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్‌ను ‘కన్నప్ప’ కోసం టాలీవుడ్‌కు తెచ్చారు విష్ణు మంచు. ఆయన హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మోహన్‌బాబు, శరత్‌కుమార్, బ్రహ్మానందం ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కన్నప్ప’ సినిమా విడుదల తేదీపై త్వరలోనే స్పష్టత రానుంది.
జీబ్రా
తమిళంలో కీర్తీ సురేష్‌తో ‘పెంగ్విన్’ సినిమా తీసిన తమిళ దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘జీబ్రా’. సత్యదేవ్ ఈ చిత్రంలో హీరోగా నటించగా, కన్నడ నటుడు డాలీ ధనుంజయ మరో లీడ్ రోల్‌లో నటించారు. ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈశ్వర్ కార్తీక్‌కు తెలుగులో ఇదే స్ట్రయిట్ సినిమా. ఇతర భాషల దర్శకులతో సినిమాలు చేసే తెలుగు హీరోల జాబితాలో మరికొంతమంది ఉన్నారు.
– ముసిమి శివాంజనేయులు
Comments
Please login to add a commentAdd a comment