దాసరి కిరణ్‌కుమార్,రామ్‌గోపాల్ వర్మ
‘‘నేను తీసినటువంటి విభిన్న రకాలైన సినిమాలు ఎవరూ తీయలేదు. రాజకీయ నాయకులు, పోలీసులు.. ఇలా ఎవరైనా కావొచ్చు. నాకు పవర్‌ఫుల్ వ్యక్తుల బయోపిక్‌లు తీయడం అంటే ఇష్టం’’ అన్నారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. అజ్మల్, మానస ముఖ్య తారలుగా రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రామధూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్‌కుమార్ నిర్మించిన చిత్రం ‘వ్యూహం’.
రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా తొలి భాగం ‘వ్యూహం: 1’ ఈ నెల 29న విడుదల కానుంది. మలి భాగం ‘శపథం’ పేరుతో జనవరి 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ‘వ్యూహం: 1’ రెండో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేరు. ‘వ్యూహం’ సినిమా రిలీజ్‌ను ఎవరూ ఆపలేరు అని నేను గతంలోనే చెప్పాను. ఇప్పుడు నేను, కిరణ్‌గారు కలిసి నిరూపించాం. క్లీన్ యూతో మాకు సెన్సార్ సర్టిఫికెట్ ఎలా వచ్చింది? అనేది సీక్రెట్. వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు మరణించిన సమయం నుంచి 2023 వరకు ‘వ్యూహం’ సినిమా మొత్తం కథనం ఉంటుంది.
వైఎస్ జగన్‌గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు తొలి భాగం ఉంటుంది. ఈ క్రమంలో ఎవరెవరు ఏయే వ్యూహాలు రచించారు వంటి ప్రధాన ఘటనలు ఈ సినిమాలో ఉంటాయి. ‘వ్యూహం’ తొలి భాగంలో ఏవైనా సందేహాలు కలిగితే అవి రెండో భాగంలో నివృత్తి అవుతాయి. నిజ జీవితంలోని వ్యక్తులు, వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. కానీ నేను నమ్మిన రియాలిటీతోనే ‘వ్యూహం’ ఉంటుంది. సినిమా అంటేనే నాటకీయత. కాబట్టి ఈ సినిమాలో ఆ నాటకీయత కూడా ఉంటుంది. ప్రేక్షకులకు తెలియని విషయాలు కూడా ఈ సినిమాలో ఉంటాయి.
‘వ్యూహం’ సినిమాలో కామెడీ పాత్ర కూడా ఉంది. ఆ పాత్ర సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. భవిష్యత్తులో ‘వ్యూహం’ తరహా సినిమాలను నేను తీస్తానా? అంటే చెప్పలేను. ఎందుకంటే నా మాటపై నేను నిలబడను’’ అని అన్నారు. ‘‘రామ్‌గోపాల్ వర్మగారితో నేను గతంలో ‘వంగవీటి’ సినిమా చేశాను. ఆ తర్వాత మళ్లీ సినిమా చేయాలనుకున్నప్పుడు ‘వ్యూహం’, ‘శపథం’ ్రపాజెక్ట్స్ మొదలయ్యాయి. ప్రతి వారం థియేటర్స్‌లోకి మూడు నాలుగు సినిమాలు రావడం సహజమే. అన్నింటికీ థియేటర్లు దొరుకుతాయి. మా ‘వ్యూహం’ సినిమాను ఎక్కువ థియేటర్స్‌లోనే రిలీజ్ చేస్తాం’’ అన్నారు నిర్మాత దాసరి కిరణ్.
ఆంధ్రప్రదేశ్ సీయం వైఎస్ జగన్‌గారితో నాకు పరిచయం లేదు. అయితే జగన్‌గారంటే నాకు పాజిటివ్ అభిప్రాయాలు ఉన్నాయి. సీబీఎన్‌గారంటే కూడా నాకు ఇష్టమే. విలన్స్ అన్నా నాకిష్టమే. ‘నా వెనక ఉండే నీకు అర్థం కాదు తమ్ముడు (ఓ పాత్రధారి).. తన ఊపు చూస్తుంటే ఏదో కొత్త పార్టీ పెట్టేసేలా ఉన్నాడు (మరో పాత్రధారి). క్షవరం అయితే కానీ వివరం తెలియదు అని ఊరికే అనలేదు పెద్దలు (ఓ పాత్రధారి)’ అనే డైలాగ్స్ సినిమాలో ఉన్నాయంటే... చిరంజీవి, పవన్ కల్యాణ్ ఇంట్లో పని చేసినవారిని సంప్రదించి, నేను నమ్మిన అంశాలతో ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ పెట్టాం.
అసలు.. జనసేనలో పవన్‌కల్యాణ్ టీడీపీ కోవర్ట్‌గా పని చేస్తున్నాడని నా అభిప్రాయం. పవన్ పార్టీ పెట్టినప్పుడు అతన్ని అభిమానిస్తున్నట్లుగా మాట్లాడాను. కానీ అతనిలో స్థిరత్వం లేదు. ఇక తెలంగాణలో ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్‌లో బలమైన ప్రతిపక్ష పార్టీ లేదని నా అభిప్రాయం. ఎన్నికల్లో ఎవరెవరు నిలబడుతున్నారు? వారు ఏమేం హామీలు ఇస్తున్నారనే రాజకీయ పరిజ్ఞానం నాకు లేనప్పుడు ఎన్నికల్లో ఓటు వేయడం కరెక్ట్ కాదని, ఓ బాధ్యత గల పౌరుడిగా నేనిప్పటి వరకూ ఓటు వేయలేదు. – రామ్‌గోపాల్ వర్మ
Comments
Please login to add a commentAdd a comment