విక్టరీ వెంకటేశ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ రానా నాయుడు. కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ ఎస్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో వెంకీ, రానా తొలిసారి కలిసి నటించారు. కరణ్ అన్షుమాన్ నిర్మించిన ఈ సిరీస్ మార్చి 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. ఈ క్రమంలో రానా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
'ప్రస్తుతం చాలా తెలుగు సినిమాలు హిందీలో బాగా వర్కవుట్ అవుతున్నాయి. అంతెందుకు? నా రెండో సినిమా(ఘాజీ) హిందీలోనే చేశా, తర్వాత మాత్రం తెలుగులోనే వరుస సినిమాలు చేశాను. కానీ మనం అనవసరంగా ఇలా సినిమాను భాష పేరుతో వేరు చేసుకుంటున్నాం. త్వరలోనే ఆ సరిహద్దులు కూడా చెరిపోయే రోజు వస్తుంది. కొన్నేళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన నాకిప్పటికీ గుర్తుంది. చాలాకాలం పాటు నేను బాహుబలి షూటింగ్‌లోనే నిమగ్నమయ్యాను. ఆ సమయంలో బాలీవుడ్‌లోని నా మిత్రుడొకరిని కలిసినప్పుడు బాహుబలి సినిమా గురించి చెప్పాను.
అప్పుడతను అందులో హీరో ఎవరని అడగ్గా ప్రభాస్ అని చెప్పాను. దీనికతడు ప్రభాస్ ఎవరు? అని తిరిగి ప్రశ్నించాడు. ఓ క్షణం పాటు అవాక్కైన నేను ప్రభాస్ నటించిన కొన్ని సినిమా పేర్లు చెప్పి అతడి గురించి వివరించే ప్రయత్నం చేశాను. కానీ ప్రభాస్ సినిమాలు ఏ ఒక్కటీ తను చూడలేదట. అంతేకాకుండా తనకు టాలీవుడ్‌లో చిన్ను భర్త ఒక్కరే తెలుసన్నాడు. చిన్ను ఎవరో అర్థం కాక నేను ఆలోచనలో పడ్డాను. కాసేపటి తర్వాత చిన్ను అంటే నమ్రత శిరోద్కర్ అని అర్థమైంది. నమ్రత భర్తగా మహేశ్‌బాబు తెలియడమేంటి? అని నేను షాక్ అవ్వాల్సి వచ్చింది. నాలుగైదేళ్లు ఆగు, మా ఆర్మీ అంతా బాలీవుడ్‌లో ల్యాండ్ అవుతుందని చెప్పాను. ఇటీవల ఆయన్ను కలిసినప్పుడు నేను చెప్పింది జరగడంతో సంతోషం వ్యక్తం చేశాడు' అని చెప్పుకొచ్చాడు రానా.
Comments
Please login to add a commentAdd a comment