‘భారత మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ బయోపిక్‌లో నేను నటించబోతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు’ అన్నారు బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్. డైరెక్టర్ లవ్ రంజన్ తెరకెక్కించిన తాజా హిందీ చిత్రం ‘తూ ఝూటీ మై మక్కార్’. రణ్‌బీర్ కపూర్, శ్రద్ధాకపూర్ జంటగా నటించిన ఈ చిత్రం మార్చి 3న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు రణ్‌బీర్ కపూర్.
‘‘గంగూలీగారికి ప్రపంచమంతా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన బయోపిక్ అంటే అది అందరికీ స్పెషలే. కానీ ఆయన బయోపిక్‌లో నటించాలనే అవకాశం నాకు రాలేదు. నాకు తెలిసి ఈ బయోపిక్‌కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇంకా జరుగుతుందనుకుంటున్నాను’’ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘ప్రముఖ గాయకులు, నటులు కిషోర్ కుమార్‌గారి బయోపిక్ కోసం 11ఏళ్లుగా వర్క్ జరుగుతోంది. దర్శక–నిర్మాత, నటుడు అనురాగ్ బసు ఈ స్క్రిప్ట్ వర్క్‌లో భాగస్వామిగా ఉన్నారు. నేను చేయబోయే నెక్ట్స్ బయోపిక్ కిషోర్ కుమార్‌గారిదే అవుతుందనుకుంటున్నాను’’ అన్నారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘యాని మల్’ చేస్తున్నారు రణ్‌బీర్ కపూర్. ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 11న రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment