
గత నెలలో కాలు సర్జరీ చేయించుకున్న బాలీవుడ్ హీరో రణదీప్ హుడా మళ్లీ వ్యాయామం బాట పట్టారు. వర్కవుట్లు చేస్తూ చెమటలు చిందిస్తున్న వీడియోను ఆయన శుక్రవారం సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఇందులో ఆయన ఉన్న చోట నుంచి కదలకుండా నిలబడి చేతులను మాత్రమే ఉపయోగిస్తూ శారీరక వ్యాయామం చేశారు. కానీ కాళ్లు ఇంకా సహకరించడం లేదని, అయినా పై శరీరంతో ఎక్సర్‌సైజ్ చేస్తున్నానని తెలిపారు. ఈ వీడియో చూసిన ఆయన అభిమానులు ఒకింత ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఇంత త్వరగా కోలుకుని మళ్లీ ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టడాన్ని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. (బంధుప్రీతి.. గ్యాంగ్‌వార్.. డ్రగ్స్...)
తన ఆరోగ్యం గురించి రణదీప్ మాట్లాడుతూ సర్జరీ తర్వాత కాలు నొప్పి నయమైందన్నారు. ఇప్పుడు తన కాళ్లపై నిలబడి నడవగలుగుతున్నానని చెప్పారు. పన్నెండేళ్ల క్రితం గుర్రంపై ఆడుకుంటూ కింద పడిపోయానని, ఆ సమయంలో కుడి కాలిపై గుర్రం పడటంతో పాదం కింద భాగం దెబ్బతిందని చెప్పారు. దీంతో అక్కడ మెటల్ ప్లేట్స్ అమర్చారని, పన్నెండేళ్లుగా ఆ బాధను అనుభవిస్తూ వచ్చానని తెలిపారు. ఎట్టకేలకు ఇప్పుడు వాటిని తీసేశారని పేర్కొన్నారు. కాగా రణదీప్ ఈ మధ్యే "రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయి" సినిమాలో తన పాత్రకు డబ్బింగ్ చెప్తున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. (‘ఐటెమ్ సాంగ్ ఛాన్స్ రావాలంటే అలా చేయాలసిందే’)