సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్లలో తానూ క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు ప్రముఖ నటుడు, ఎంపీ రవి కిషన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'క్యాస్టింగ్ కౌచ్ అనేది సినిమా ఇండస్ట్రీలో ఉంది. కానీ నేను దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాను. అవకాశాల కోసం అడ్డదారులు తొక్కొద్దని, నీ పనితనాన్ని నిజాయితీగా నిరూపించుకోవాలని మా నాన్న నాకు నేర్పించాడు. నా దగ్గర టాలెంట్ ఉంది, అందుకే షార్ట్‌కర్ట్ నేను ఎంచుకోలేదు.
ఇక్కడ ఓ విషయం చెప్పాలి. సినీపరిశ్రమలో ఉన్న ఓ మహిళ కాఫీ తాగడానికి రాత్రి రావాలని పరోక్షంగా తన కోరికను బయటపెట్టింది. ఎవరైనా పొద్దున్నో, సాయంత్రమో కాఫీ తాగుదామంటారు. కానీ తను ప్రత్యేకంగా రాత్రి రావాలని నొక్కి చెప్పడంతో నాకు విషయం అర్థమైంది. వెంటనే నేను నో చెప్పాను. తనిప్పుడు పెద్ద స్థాయిలో ఉంది. ఆమె పేరు వెల్లడించలేను' అని పేర్కొన్నాడు.
కాగా రవికిషన్‌కు నటుడు కావాలని చిన్నప్పటినుంచి కోరికగా ఉండేది. తండ్రికి అతడి కోరిక నచ్చలేదు కానీ తల్లి మాత్రం రవికిషన్‌కు మద్దతిచ్చేది. ఓ రోజు ఆమె రవికిషన్‌కు రూ.500 ఇచ్చి ముంబై పంపించేసింది. అలా తల్లి సపోర్ట్‌తో, తన కష్టంతో గొప్ప నటుడిగా ఎదిగాడు. భోజ్‌పురిలో బాగా ఫేమస్ అయిన రవి కిషన్.. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లోనూ పలు చిత్రాలు చేశాడు. రేసుగుర్రం సినిమాలో విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయాడు. గతేడాది రిలీజైన ఖాఖీ: ద బీహార్ చాప్టర్ వెబ్ సిరీస్‌లోనూ నటించాడు.
Comments
Please login to add a commentAdd a comment