పండగ సీజన్ అంటే సినీ ప్రేమికులకు సినిమా సందడి ఉండాల్సిందే. అందుకే పండగ టార్గెట్‌గా సినిమాలను రిలీజ్ చేస్తుంటారు. పండగకి ఐదారు నెలల ముందే రిలీజ్ డేట్ ప్రకటించి, పండగ బెర్త్‌ని కన్ఫార్మ్ చేసేస్తుంటారు. అలా ఈ దసరా పండక్కి బాక్సాఫీస్ పోటీ ఆల్రెడీ మొదలైపోయింది. ఇప్పటికి అధికారికంగా విడుదల తేదీ ప్రకటించి, బాక్సాఫీస్ బరిలో నిలవనున్న సినిమాల గురించి తెలుసుకుందాం.
తెలంగాణ నేపథ్యంలో...
రాయలసీమ నేపథ్యంలో బాలకృష్ణ హీరోగా నటించిన సినిమాలు చాలానే వచ్చాయి. అయితే తాజాగా పూర్తి స్థాయి తెలంగాణ యాసతో బాలకృష్ణ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్. శ్రీలీల ముఖ్య పాత్ర చేస్తున్నారు. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకుడు. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని దసరాకి రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఓ గజదొంగ కథ
రవితేజ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’. స్టువర్టుపురం దొంగగా చెప్పుకునే టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహించారు. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 20న రిలీజ్ కానుంది.
మాస్ ఎనర్జీ
రామ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ హై ఓల్టేజ్ మాస్ ఫిల్మ్ రూపొందుతోంది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబరు 20న విడుదల కానుంది. కాగా రామ్ కెరీర్‌లో తొలి పాన్ ఇండియా ఫిల్మ్ ఇదే అన్న సంగతి తెలిసిందే.
మాఫియా డ్రామా
‘మాస్టర్’ (2021) చిత్రం తర్వాత హీరో విజయ్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘లియో’. త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమా అక్టోబరు 18న విడుదల కానుంది. ప్రస్తుతానికైతే దసరా పండక్కి ఈ సినిమాలు కర్చీఫ్ వేశాయి. మరి.. పండగ రేస్‌లో ఫైనల్‌గా ఏ సినిమాలు ఉంటాయనే విషయం రానున్న రోజుల్లో తెలుస్తుంది.
అప్పుడు సంక్రాంతి..ఇప్పుడు దసరా
హీరోలు రవితేజ, రామ్, విజయ్‌లు నటించిన చిత్రాలు ఒకేసారి బాక్సాఫీస్ వద్ద పోటీ పడటం ఇది తొలిసారి కాదు. 2021 సంక్రాంతికి రవితేజ ‘క్రాక్’, రామ్ ‘రెడ్’, విజయ్ ‘మాస్టర్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. ఇప్పుడు ఈ ముగ్గురి చిత్రాలు దసరా పోటీలో నిలి చాయి. ఈ మూడు సినిమాలతో పాటు ఇంకెన్ని సినిమాలు దసరా బరిలో నిలుస్తాయో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment