సినిమాల్లో కొన్ని భయంకరమైన హత్యలను చూపిస్తుంటారు. అవి చూస్తుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. మరీ ఇంత దారుణంగా ఉన్నారేంట్రా.. బాబూ అనిపించకమానదు. కానీ కొన్ని రియల్ సంఘటనలు అంతకన్నా దారుణంగా ఉంటాయి. నవ్వుతూనే ఒంట్లో కత్తి దింపుతారు. నమ్మిస్తూనే గొంతు కోస్తారు. ప్రేమిస్తూనే సైనైడ్ పెట్టి చంపేస్తారు. అలాంటి ఓ నిజ జీవిత కథ ఆధారంగా తీసిన డాక్యుమెంటరీ చిత్రం 'కర్రీ అండ్ సైనైడ్'. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో నేటి (డిసెంబర్ 22) నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌కు ఆధారమైన నిజ సంఘటనలపై ఈ ప్రత్యేక కథనం..
ఇంటి పెద్దతో హత్యలు మొదలు
జూలీ జోసెఫ్‌ది కేరళ కోజికోడ్‌లోని కూడతాయి గ్రామం. ఈమె పద్నాలుగేళ్లలో ఆరు హత్యలు చేసింది. వాళ్లంతా తన సొంత ఇంటిసభ్యులే కావడం గమనార్హం! 2002లో జూలీ అత్తయ్య అన్నమ్మ థామస్ గ్లాసు నీళ్లు తాగి చనిపోయింది. దీన్ని వైద్యులు గుండెపోటు అని తేల్చారు. ఆరేళ్ల తర్వాత 2008లో జూలీ మామయ్య టామ్ థామస్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. మూడేళ్ల తర్వాత.. 2011లో జూలీ భర్త రాయ్ థామస్ కడుపు నిండా భోజనం చేశాక బాత్రూమ్‌లో విగతజీవిగా కనిపించాడు. అయితే ఆర్థిక సమస్యల కారణంగా అతడు ఆత్మహత్య చేసుకున్నాడని అందరినీ నమ్మించింది.
అనుమానించినందుకు అతడ్నీ చంపేసింది
కానీ అన్నమ్మ సోదరుడు మాథ్యూ మాత్రం ఏదో జరుగుతోందని అనుమానించాడు. అది కనిపెట్టేలోపే అతడిని కూడా మట్టుపెట్టింది జూలీ. 2014లో విస్కీలో విషం కలిపి చంపింది. రెండేళ్ల తర్వాత.. 2016లో తన భర్త దగ్గరి బంధువైన షాజు జచారయ్య భార్య, ఏడాదిన్నర బిడ్డను సైతం చంపేసింది. ఆ తర్వాత షాజు జచారయ్యను రెండో పెళ్లి చేసుకుంది జూలీ. అయితే అన్నయ్య ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఏదో జరుగుతోందని అమెరికాలో ఉన్న రాయ్ థామస్ సోదరుడు రోజో అనుమానించాడు. అటు ఆస్తి బదలాయింపు విషయంలో జూలీ అక్రమాలకు పాల్పడటం.. తర్వాత మరిన్ని మరణాలు సంభవించడంతో రోజో అనుమానం బలపడింది.
నమ్మలేని నిజాలు వెలుగులోకి..
అతడి ఫిర్యాదు మేరకు కేరళ క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేపట్టగా నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. జూలీ తన భర్త తినే అన్నంలో సైనైడ్ పెట్టి చంపిందని తేలింది. అంతేకాదు మిగతా ఐదుగురినీ సైనైడ్ సాయంతోనే హత్య చేసిందని తేలింది. ఆస్తి తనకు దక్కాలన్న అత్యాశతోనే అందరి ప్రాణాలు పొట్టనపెట్టుకుంది. ఎట్టకేలకు ఆమెను దోషిగా తేల్చిన పోలీసులు 2019 అక్టోబర్‌లో అరెస్ట్ చేశారు. ఆమెకు సైనైడ్ సరఫరా చేసిన ఎమ్‌ఎస్. మాథ్యూ, ప్రాజీ కుమార్‌లపైనా చర్యలు తీసుకున్నారు.
ఈ కేసు ఆధారంగా సీరియల్..
అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ కేసు ఆధారంగా 'కూడతయి' అనే మలయాళ సీరియల్ వచ్చింది. అలాగే 'డెత్, లైస్ అండ్ సైనైడ్' పేరిట ఓ పాడ్‌క్యాస్ట్ కూడా రిలీజైంది. 'క్రైమ్ పెట్రోల్ సతర్క్' రెండో సీజన్‌లో 100-102 ఎపిసోడ్ల మధ్యలో ఈ కేసును కళ్లకు కట్టినట్లు చూపించారు. 'దహాద్' వెబ్ సిరీస్ కూడా ఈ సంఘటనను ఆధారంగా చేసుకుని తీసినట్లు కనిపిస్తుంది.
జూలీని అమ్మ అని పిలవడానికి ఇష్టపడని కుమారుడు
ఇకపోతే 'కర్రీ అండ్ సైనైడ్: ద జూలీ జోసెఫ్ కేసు' డాక్యుమెంటరీకి జాతీయ అవార్డు విజేత క్రిస్టో టామీ దర్శకత్వం వహించాడు. షాలిని ఉషాదేవి రచయితగా పని చేసింది. ఈ సిరీస్‌లో హత్యలు జరిగిన ప్రదేశాన్ని సరిగా చూపించకపోవడంతో సహజత్వాన్ని కోల్పోయినట్లు కనిపిస్తుంది. రాయ్ థామస్ సోదరుడు రోజో, సోదరి రెంజీ థామస్ డాక్యుమెంటరీలో భాగమై తమ అనుభవాలు చెప్పారు. అలాగే జూలీ పెద్ద కుమారుడు సైతం ఈ సినిమాలో ఉన్నాడు. అతడు జూలీని తన తల్లిగా సంభోదించడానికి ఇష్టపడలేదు. ఆమెను ఆ మహిళ లేదా జూలీ అనే ప్రస్తావిస్తూ మాట్లాడాడు.
చదవండి: త్రిష, చిరంజీవిపై కేసు.. పబ్లిసిటీ స్టంట్ అంటూ కోర్టు ఫైర్!
Comments
Please login to add a commentAdd a comment