![Rhea Chakraborty To Take Action Against Sushant Singh Rajput Family - Sakshi](/styles/webp/s3/article_images/2020/09/1/1_0.jpg.webp?itok=DPaCpsd0)
ముంబై: అర్ధాంతరంగా తనువు చాలించి, అభిమానుల గుండెల్లో విషాదాన్ని నింపిన బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు అనూహ్య మలుపు తీసుకోనుంది. తనపై ఆరోపణలు చేసిన సుశాంత్ కుటుంబంపై నటి రియా చక్రవర్తి న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు. దర్యాప్తు సంస్థల ఎదుటే కాకుండా అత్యున్నత న్యాయస్థానం ముందు కూడా వారు తనపై అసత్య ఆరోపణలు చేసి అందరి ముందు దోషిగా నిలబెట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి రియా లాయర్ సతీష్ మాన్‌షిండే మాట్లాడుతూ.. సుశాంత్ సోదరీమణుల చాటింగ్‌లతోపాటు, అందులో షేర్ చేసిన ప్రిస్కిప్షన్ ప్రకారం అతని ఆరోగ్యం గురించి వారి కుటుంబానికి ముందే తెలుసన్నది నిరూపణ అవుతోంది. ప్రిస్కిప్షన్ వివరాలు కూడా ఒకరికి ఒకరు తెలియజేసుకున్నారు. కానీ కోర్టులో, ఈడీ ముందు ఏమీ తెలియదన్నట్టుగా నాటకమాడారు. ఇది చట్ట విరుద్ధమే అవుతుంది. (చదవండి: సుశాంత్ డిప్రెషన్: అతని కుటుంబానికి ముందే తెలుసా?)
అలాగే ముందు నుంచి వైద్యం అందిస్తున్న పేషెంట్‌కు మాత్రమే డాక్టర్ ఆన్‌లైన్ కన్సల్టేషన్ ఇస్తాడు. కానీ ఇక్కడ అలా జరగలేదని రుజువవుతోంది. కాబట్టి వీటన్నింటిపై రియా చక్రవర్తి.. సుశాంత్ కుటుంబంపై న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించనున్నారు. కాగా సుశాంత్ సోదరి నీతూ, అతడి మేనేజర్ శ్రుతి మోదీ చాటింగ్ వివరాలు లీకైన విషయం తెలిసిందే. ఇందులో నీతూ ప్రిస్కిప్షన్ పంపిచాల్సిందిగా శ్రుతిని కోరారు. మరోవైపు సుశాంత్ మరో సోదరి ప్రియాంక.. డాక్టర్ పంపించారంటూ ఓ ప్రిస్కిప్షన్‌ను అతనికి సెండ్ చేసిన చాట్ కూడా వైరల్‌గా మారింది. ఇందులో అతను మానసిక రుగ్మత పోగొట్టుకునేందుకు వాడాల్సిన మందుల పేర్లను కూడా ప్రస్తావించారు. అవి ఎప్పుడెప్పుడు వేసుకోవాలో కూడా తెలియజేశారు. దీన్ని బట్టి సుశాంత్ ఆరోగ్య పరిస్థితి గురించి వారికి ముందే తెలుసని స్పష్టమవుతోంది (చదవండి: డబ్బు, జబ్బు గురించి సుశాంత్ టెన్షన్)
Comments
Please login to add a commentAdd a comment