
ముంబై: తమ మనసులు ఎల్లప్పుడూ ఒకటిగానే ఉంటాయని, సమాజం కోసం హడావుడిగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం తమకు లేదన్నాడు రాకీ జైస్వాల్. నటి, బిగ్‌బాస్-11 రన్నరప్ హీనాఖాన్‌తో తనది చెక్కు చెదరని బంధమని, తామిద్దరం ఎంతో సంతోషంగా ఉన్నామని పేర్కొన్నాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన రాకీ జైస్వాల్ సినీ రంగం మీద ఆసక్తితో ముంబైకి వచ్చి.. బుల్లితెర సీరియళ్లకు సూపర్‌వైజింగ్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ‘‘యే రిష్తా క్యా కహెలాతా హై’’ (తెలుగు డబ్బింగ్- పెళ్లంటే నూరేళ్ల పంట) షూటింగ్ సమయంలో ఆ సీరియల్ హీరోయిన్ హీనా ఖాన్‌తో ప్రేమలో పడ్డాడు. బిగ్‌బాస్-11 సమయంలో రాకీ ప్రేమ ప్రతిపాదనకు ఆమె ఓకే చెప్పడంతో అప్పటి నుంచి ఇద్దరూ రిలేషన్‌షిప్‌లో కొనసాగుతున్నారు.
ఇరువురి కుటుంబాలు సైతం సఖ్యతగా మెలగడంతో త్వరలోనే వీరి పెళ్లి బాజాలు మోగడం ఖాయమని బీ-టౌన్‌లో టాక్ నడుస్తోంది. ఈ విషయంపై స్పందించిన రాకీ జైస్వాల్ ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. ‘‘చాలా ఏళ్లుగా మేం ప్రేమలో ఉన్నాం. పెళ్లి తర్వాత చాలా జంటలకు ఎదురయ్యే ఇబ్బందులు ఇప్పటికే మేం చవిచూశాం. మానసికంగా మేం ఒక్కటే. సమాజం దృష్టిలో అధికారికంగా భార్యాభర్తలమనే ట్యాగ్ కోసం హడావుడిగా పెళ్లి చేసుకోవడంలో అర్థం లేదు.
పెళ్లి తర్వాత కూడా చాలా మందిలో అన్యోన్యత ఉండదు. పైకి మాత్రం అంతా బాగున్నట్లు చూపిస్తారు. మేం అలా కాదు. మా బంధానికి వచ్చిన ప్రమాదమేమీ లేదు. కెరీర్‌లో ముందుకు వెళ్లేలా పరస్పరం సహకరించుకుంటాం. వివాహానికి ఇంకా సమయం ఉంది. ప్రస్తుతానికి కెరీర్‌పై దృష్టి సారించాం’’ అని చెప్పుకొచ్చాడు. పలు హిందీ హిట్ సీరియళ్లలో నటించిన హీనా ఖాన్, వెబ్‌సిరీస్‌లతో బిజీగా ఉంది. లైన్స్ మూవీతో హీరోయిన్‌గా అదృష్టం పరీక్షించుకుంది. కాగా హీనా తండ్రి ఇటీవల మరణించారు. ఆయనను గుర్తు చేసుకుంటూ వీడియో షేర్ చేసిన హీనా భావోద్వేగానికి గురయ్యారు.
చదవండి: Neeraj Chopra: తను ఒలింపియన్ అయితే కావొచ్చు.. కానీ
Comments
Please login to add a commentAdd a comment