Sai Pallavi Gets Emotional After Meeting Real Life Sarala Family, Deets Inside - Sakshi
Sakshi News home page

Virata Parvam: బొట్టు పెట్టి..చేతిలో చీరపెట్టారు.. సాయి పల్లవి ఎమోషనల్‌

Published Tue, Jun 14 2022 4:46 PM | Last Updated on Tue, Jun 14 2022 5:36 PM

Sai Pallavi Talk About Virata Parvam Movie - Sakshi

‘సరళ వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు.. ఆమె అమ్మ నా చేయి పట్టుకొని తన కూతురితో ఎలా మాట్లాడిందో అలానే మాట్లాడింది. నన్ను హగ్‌ చేసుకొని ఎక్కడున్నావ్‌ బిడ్డ, ఎప్పుడొస్తావ్‌, ఎందుకు వెళ్లిపోయావ్‌ అని అనడంతో నేను ఏడుపుని ఆపుకోలేకపోయాను. ఎలా రియాక్ట్‌ అవ్వాలో తెలియలేదు. సరళ ఫ్యామిలీని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అమ్మ నన్ను ఆశీర్వదించి, బొట్టుపెట్టి, చీరను బహుమతిగా ఇచ్చి పంపించారు. వారిని కలిస్తే.. నా కుటుంబ సభ్యులను కలిసినట్లే అనిపించింది. సరళ ఫ్యామిలీ మా సినిమా చూసి హ్యాపీగా ఫీలైతే చాలు’అని సాయి పల్లవి అన్నారు.


           సరళ తల్లితో సాయి పల్లవి

వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘విరాటపర్వం’. 1992వ ప్రాంతంలో వరంగల్‌ సమీపంలో జరిగిన ఓ యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. సరళ అనే యువతి ప్రేమ కథ ఇది. ఈ పాత్రని సాయి పల్లవి పోషించారు. డి. సురేష్‌బాబు సమర్పణలో సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా సాయి పల్లవి మీడియాతో ముచ్చటించారు ఆ విశేషాలు..

‘విరాటపర్వం’ని కథగానే నేను అప్రోచ్‌ అయ్యాను. నిజ జీవితంలో జరిగిందా లేదా అని నాకు తెలియదు. నేనే వెన్నెల అనుకొని నటించాను. వేణుగారు ఈ స్టోరీ చెప్పగానే నాకు కొత్తగా అనిపించింది. నేను తమిళనాడులో పెరిగాను. అక్కడ జరిగిన సంఘటనలు వేరు.. కానీ  ఇక్కడ(తెలంగాణ)అప్పట్లో ఇలాంటి సంఘటనలు జరిగిందని తెలియదు. దర్శకుడు వేణుగారు నాకు చాలా తెలియని విషయాలను చెబుతూ ఎడ్యుకేట్‌ చేశాడు. సరళ ఫ్యామిలీ ప్రైవసీకి ఎలాంటి భంగం కలగకుండా కేవలం అక్కడ జరిగిన సంఘటనల ఆధారంగా ‘విరాటపర్వం’ చిత్రాన్ని తెరకెక్కించారు. 

► వేణు ఈ  సినిమా కథను ముందుగా నాకు చెప్పారు. ఆ తరువాత నిర్మాతలు సురేష్ బాబు దగ్గరకు తీసుకెళ్లారు. ఆ సమయంలో రానా ఈ కథను చదివి, నచ్చడంతో ఈ సినిమాను చేశారు. అంతకు ముందు వేరే వారికి కూడా వినిపించారు. కానీ వారు అంగీకరించలేదు. రవన్న పాత్రని రానా పోషించడం చాలా హ్యాపీ. ఆయన ప్రాజెక్ట్‌లోకి వచ్చాక చాలా మార్పులు జరిగాయి. గొప్పగా సినిమాను తెరకెక్కించారు

► మనకు తెలియనకుండా ఉన్న ఒక కథలో నటించినప్పుడే  మనకు మజా. తెలిసినది మళ్లీ మళ్లీ చేస్తే ఎప్పుడు నేను ఉండేలానే ఉంటాను. కొత్త కొత్త పాత్రలని చేస్తేనే యాక్టర్‌గా నేను ఎదిగినట్లు అవుతుంది. 

► స్క్రిప్ట్‌లో మన పాత్ర ఎలా ఉంటే అంతవరకే నటించగలమని అనుకుంటాం. మేము అలానే నటిస్తాం. కానీ రానా మాత్రం పేపర్‌పై ఉన్నదానికి కంటే ఎక్కువగా నటిస్తాడు. ఔట్‌పుట్‌ మంచిగా రావడం కోసం చాలా కష్టపడతాడు. ఓ పాత్రను పరిమితికి మించి చేయడం.. బౌండరిని ఇంకొంచెం ముందుకు పుష్ చేసి నటించడం అనేది రానా వద్ద నుంచి నేను నేర్చుకున్నాను.


► మమ్మల్ని నమ్ముకొని ఒక సినిమా చేస్తారు. మనం ఆ సినిమాను ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లాలి.. మనం ఎందుకు సినిమా చేశామో జనాలకు చెప్పి.. వారిని చూడమని చెబుతాం. మన సినిమాలను మనం ప్రమోట్ చేసుకోకపోతే ఇంకెవరు చేసుకుంటారు.


► ఊర్లో అమ్మాయిలు ఎలా ఉంటారో.. ఈ చిత్రంలో నేను అలా ఉంటాను. పల్లెటూరి అమ్మాయిలాగే నేను మాట్లాడుతా. ఈ చిత్రంలో నేను ఎలాంటి మేకప్‌ లేకుండా నటించాను. 


► ‘విరాట పర్వం’ చిత్రాన్ని సుకుమార్‌, త్రివిక్రమ్‌లతో కలిసి రానా చూశాడు. నన్ను మాత్రం రానివ్వలేదు(నవ్వుతూ..). వాళ్లే మాట్లాడుకున్నారు. నా గురించి ఏం మాట్లాడుకున్నారో తెలుసుకోవాలని ఉంది.


► లేడి పవర్‌స్టార్‌, లేడి సూపర్‌ స్టార్‌ అనే బిరుదలను అభిమానులు ఏదో ప్రేమతో ఇస్తున్నారు. కానీ నేను దానిని మనసుకు తీసుకోను. కథలను విన్నప్పుడు అవేవి నేను పట్టించుకోను. జనాలకు నచ్చలే మంచి మంచి సినిమాల్లో నటించాలనే నా లక్ష్యం. 

► ఒక ఆర్టిస్ట్ ఎప్పుడూ కొత్తదనం వైపు అడుగులు వేస్తుండాలి. ఒకే క్వశ్చన్ పేపర్ కు అవే ఆన్సర్లు రాస్తూ వుంటే కిక్ వుండదు కదా.  కొత్తగా చేశాం, నేర్చుకున్నాం అనే తృప్తి  ఉండాలి.  ప్రతి పాత్రకి  కొంత భాద, ఒత్తిడి ఉండటమే కరెక్ట్. లేదంటే బోర్ కొడుతుంది.

► నా సినిమాలన్నీ తెలంగాణ నేపథ్యంలోనే వస్తున్నాయి. తెలంగాణ అమ్మాయి పాత్రలనే ఎక్కువగా పోషిస్తున్నాను. గత జన్మలో నేను తెలంగాణలో పుట్టానేమో (నవ్వుతూ). 

► తక్కువ సినిమాలు చేస్తున్నానా? ఎక్కువ సినిమాలు చేస్తున్నానా? అనేది నేను చూసుకోను. మంచి సినిమాలు చేయాలనేది నా లక్ష్యం. నేను లేకపోయినా.. అందరికి నా సినిమాలు గుర్తుండాలి. ఆ సినిమా చూసి నన్ను గుర్తు తెచ్చుకోవాలి.

► పాండమిక్ కి ముందు లవ్ స్టొరీ, విరాటపర్వం చేశాను. తర్వాత శ్యామ్ సింగ రాయ్ వచ్చింది. అయితే నేను  గ్యాప్ గురించి ఎక్కువ అలోచించను. నేను కళని ఎక్కవగా నమ్ముతాను. నా కోసం ఒక కథ  ఉంటే అది తప్పకుండా నన్ను వెదుక్కుంటూ వచ్చేస్తుంది. 

► మంచి కథలు వస్తే.. వెబ్‌ సిరీస్‌లో కూడా నటిస్తా. తెలుగులో సినిమా కోసం స్క్రిప్ట్స్‌ వింటున్నాను. శివకార్తికేయన్ గారితో తమిళ్ లో ఒక సినిమా సైన్ చేశాను. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement