సినిమా నిర్మాణం అంటే వందల రోజుల పని. వందల మంది కష్టం. ప్రస్తుతం సినిమా నిర్మాణానికి కరోనా అడ్డుపడుతోంది. ఇక ముందు షూటింగులు ఎలా చేయాలా? అని ఆలోచనలో పడ్డారు దర్శక–నిర్మాతలు. పాత పద్ధతి పనికిరాదన్నప్పుడు కొత్త ఆలోచన పుడుతుంది. కొత్త దారి తయారవుతుంది. మలయాళం ఇండస్ట్రీ కరోనా ఛాలెంజ్‌ను స్వీకరించింది. స్టూడియోల గేట్లు అన్ లాక్ చేసింది. మేకప్ కిట్స్ అన్ లాక్ చేసింది. కార్ వ్యాన్లు అన్ లాక్ అయ్యాయి. ఇలా ఇప్పటివరకూ లాక్ చేసినవాటిని ‘అన్ లాక్’ చేసి, కొన్ని సినిమాల షూటింగ్‌ను మొదలుపెట్టింది. కొన్నింటిని పూర్తి చేసింది కూడా. ఆ వివరాలు...
సౌత్ ఇండస్ట్రీలలో మలయాళం ఇండస్ట్రీ కాస్త చిన్నది. ‘లోకల్ ఈజ్ ఇంటర్నేషనల్’ అనేది వాళ్ల నినాదం. ఎక్కువ శాతం సినిమాలు కేరళ పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరించేస్తారు. దాదాపు సినిమాలన్నీ తక్కువ బడ్జెట్ లో పూర్తి చేస్తారు. మరీ ముఖ్యంగా కథలో బలం ఉండటమే ప్రధానంగా చూస్తారు. గత నాలుగైదేళ్లలో పలు ఉత్తమ సినిమాలు అందించిన ఇండస్ట్రీ ఇది. ప్రముఖ హీరోలందరూ ఏడాదికి కనీసం మూడు సినిమాలు విడుదలయ్యేలా చూసుకుంటారు. ఇంత విరివిగా సినిమాలు చేసే ఇండస్ట్రీకి (అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీల లాగానే) కరోనా షాక్ తగిలింది.
మూడు నెలలు సినిమాల నిర్మాణం ఆగిపోయింది. అయితే త్వరగా తేరుకొని, పని ప్రారంభించిన తొలి ఇండస్ట్రీ ఇదే కావడం విశేషం. తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీలతో పోల్చితే మలయాళ పరిశ్రమలో ఎక్కువగా షూటింగులు జరుగుతున్నాయి. కరోనా తర్వాత సగంలో ఆగిపోయిన సినిమాలను మళ్లీ మొదలుపెట్టడంతోపాటు కొత్త సినిమాలను కూడా ప్రకటించింది మాలీవుడ్. ప్రకటించడమే కాదు చిత్రీకరణ ప్రారంభించిది కూడా. లాక్ డౌన్ తర్వాత మొదలైన చిత్రాలు, వాటి విశేషాలు.
లవ్
‘అనురాగ కరిక్కిన్ వెళ్ళం, ఉండా’ వంటి హిట్ చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు ఖాలీద్ రెహ్మాన్. ప్రస్తుతం షైన్ టామ్ చాకో, రాజిష విజయన్ ముఖ్య తారలుగా ఆయన ‘లవ్’ అనే చిత్రం తెరకెక్కించారు. లాక్ డౌన్ తర్వాత ప్రభుత్వం విధించిన గైడ్ లైన్స్ అనుసరిస్తూ ఈ షూటింగ్ ను ప్రారంభించారు. విశేషం ఏంటంటే.. ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేయడానికి నెల రోజులు కూడా తీసుకోలేదు. జూన్ 22న ప్రారంభించి, జులై 15 కల్లా షూటింగ్ పూర్తి చేసేశారు.
సీ యూ సూన్
ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీలో ఉన్న ఉత్తమ నటుల్లో ఫాహద్ ఫాజిల్ ఒకరు. ఇటీవల ఆయన సినిమాలను దేశ వ్యాప్తంగా చూస్తున్నారు. తాజాగా లాక్ డౌన్ తర్వాత ఓ ప్రయోగం చేపట్టారు ఫాహద్. దర్శకుడు మహేష్ నారాయణ్ తో కలసి ఓ సినిమా చేశారు. సుమారు 75 నిమిషాలు నిడివి ఉండే ఓ సినిమాను ప్లాన్ చేశారు ఈ ఇద్దరూ. ‘సీ యూ సూన్’ టైటిల్‌తో ఈ సినిమాను పూర్తిగా ఐ ఫోన్‌లో చిత్రీకరించారు. ఇందులో ఫాహద్ తో పాటు పలువురు మలయాళ యంగ్ యాక్టర్స్ కూడా నటించారు. ఒక్కో యాక్టర్ షూటింగ్ పార్ట్ ఒక్కోసారి చేశారు. దీంతో ఎక్కువ మంది యాక్టర్స్ ఒకేసారి లొకేషన్లో కలుసుకునే అవకాశం కూడా తక్కువ. ఈ సినిమాను ఓటీటీ కోసమా థియేట్రికల్ రిలీజ్ కోసమా? ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. షూటింగ్ పూర్తయింది.
ఏ
సినిమా షూటింగ్ ప్రారంభించాలా? వద్దా? అనే చర్చ ఆ మధ్య కేరళ ఇండస్ట్రీ లోనూ జరిగింది. షూటింగ్ వద్దు అని కొంత మంది వాదిస్తే, షూటింగ్ వాయిదా వేస్తున్నంత కాలం ఇండస్ట్రీలో పని చేసేవాళ్లకు ఇబ్బందే అనేది ఇంకొందరి వాదన. అలాంటి వారిలో దర్శకుడు లిజో జోస్ పెల్లిసేరి ఒకరు. ‘అంగమలై డైరీస్, జల్లి కట్టు’ వంటి పాపులర్ చిత్రాలు తెరకెక్కించారు లిజో. లాక్ డౌన్ లో ‘ఏ’ అనే చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఇదో రొమాంటిక్ సినిమా అని టాక్. ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని సమాచారం.
హగల్
నటి, దర్శకురాలు రీమా కళింగల్, షరాఫుద్దీన్ ముఖ్య పాత్రల్లో నూతన దర్శకుడు హర్ష ‘హగల్’ అనే చిత్రాన్ని కూడా లాక్ డౌన్ తర్వాతే ప్రకటించారు. ఈ సినిమాను దర్శకుడు ఆషిక్ అబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ జులైలో ప్రారంభం అయింది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. షూటింగులు జరుగుతున్నప్పటికీ కేరళలో తయారయే సినిమాల సంఖ్యతో పోలిస్తే ఇప్పుడు నిర్మాణంలో ఉన్నవి తక్కువే. అన్ని కథలూ తక్కువ మందితో, తక్కువ టీమ్ తో చెప్పేవి కావు. పరిస్థితులు చక్కబడి ఎప్పటిలాగానే సినిమాల షూటింగ్స్‌తో అన్ని ఇండస్ట్రీలు కళకళలాడాలని కోరుకుందాం.
షూటింగ్‌కి రెడీ
మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా షూటింగ్ కి రెడీ అయ్యారని సమాచారం. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో దుల్కర్ ఓ సినిమా చేయనున్నారు. రోషన్ ఆండ్రూ దర్శకత్వం వహించనున్నారు. పూర్తి స్థాయి పోలీస్ పాత్రలో తొలిసారి నటించనున్నారు దుల్కర్. ఈ సినిమా చిత్రీకరణ ఆగస్ట్ రెండో వారంలో ప్రారంభం కానుందని సమాచారం.
థియేటర్ లోనే రిలీజ్
మలయాళ సూపర్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్ లాల్ నటించిన కొన్ని చిత్రాల షూటింగ్ ఆల్రెడీ పూర్తయింది. అయితే ఓటీటీలో ఇవి విడుదలవుతాయి అని కొందరు అనుకున్నారు. కానీ అవి థియేటర్ లోనే రిలీజ్ అని చిత్రబందాలు పేర్కొన్నాయి. మోహన్ లాల్ నటించిన పీరియాడిక్ చిత్రం ’అరబికడలింటే సింహం : మరాక్కర’ మార్చిలో విడుదల కావాలి. కరోనా వల్ల వాయిదా పడింది. మమ్ముట్టి నటించిన ’వన్’ కూడా వేసవిలో విడుదల కావాలి. ఇందులో మమ్ముట్టి ముఖ్య మంత్రి పాత్రలో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment