
హీరోయిన్ సంయుక్తకు కోపం ఎక్కువేనట. ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పింది. 2016లో పాప్‌కార్న్ అనే మలయాళ చిత్రం ద్వారా పరిచయమైన ఈ భామ తమిళంలో జులై కాట్రిల్, ఇరుడా చిత్రాలలో నటించింది. అయితే అవేవీ ప్రేక్షకులను అలరించలేకపోయాయి. ఆ తరువాత తమిళం, తెలుగు భాషల్లో ధనుష్ కథానాయకుడిగా నటించిన వాత్తీ చిత్రంలోనూ హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో వెంటనే తెలుగులో నటుడు సాయిధరమ్ తేజ్ సరసన విరూపాక్ష చిత్రంలో నటించింది. లక్కీగా ఆ చిత్రం హిట్ అయింది. ఈమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను సమంత వీరాభిమానినని చెప్పింది.
ఆమె నటన అంటే చాలా ఇష్టమని పేర్కొంది. తనను ఆమెలా ఉంటానని చాలా మంది అంటున్నారని, అయితే ఆమెలా నటిస్తున్నానని చెప్తుంటే ఇంకా సంతోషంగా ఉందని చెప్పింది. అదేవిధంగా నటుడు ధనుష్ నటన నచ్చుతుందని పేర్కొంది. తాను 10వ తరగతి చదువుతున్నప్పుడు ధనుష్ కథానాయకుడిగా నటించిన ఆడుగళం చిత్రం పాటలను బస్సులో చూసి డాన్స్ చేసేదాన్నని చెప్పింది. అలాంటిది ఆయనకు జంటగా నటిస్తానని ఊహించలేదని పేర్కొంది. తనకు నటనకు అవకాశం వున్న పాత్రలు చేయాలని ఉందని చెప్పుకొచ్చింది.
ముఖ్యంగా కుటుంబ కథా చిత్రాలలో నటించాలని ఆశిస్తున్నానంది. తనకు కోపం ఎక్కువ అని.. ఒకసారి తాను, తన తల్లి కలిసి బయటకు వెళుతుండగా ఒక వ్యక్తి సిగరెట్ కాల్చుతూ పొగను తమపై వదిలాడని దీంతో కోపంగా అతని చెంప పగలగొట్టానని సంయుక్త తెలిపింది. తనకు ప్రయాణం చేయడం అంటే చాలా ఇష్టమని, అదీ ఒంటరిగా ప్రయాణం చేయడం ఇంకా ఇష్టమని చెప్పింది. ఎక్కువగా హిమాలయాలకు వెళుతుంటానని, ఖాళీ సమయాల్లో కవితలు రాస్తుంటానంది. తన చిన్న వయసులోనే తన తల్లిదండ్రులు విడిపోయారని, అందుకే తండ్రి ఇంటి పేరును తన పేరులో నుంచి తీసేసానని సంయుక్త తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment