అమ్మ కోసం ‘సరే’ అన్నాను: సంయుక్త | Sakshi Special Interview With Heroine Samyuktha | Sakshi
Sakshi News home page

Samyuktha: ఒక్కసారి ఫిక్స్‌ అయితే ఎంత కష్టపడటానికైనా రెడీ!

Published Sun, Sep 15 2024 8:50 AM | Last Updated on Sun, Sep 15 2024 3:13 PM

Sakshi Special Interview With Heroine Samyuktha

‘మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు...’ అంటూ ‘సార్‌’ సినిమాలో మాస్టారు (ధనుష్‌)తో ప్రేమలో పడ్డారు హీరోయిన్‌ సంయుక్త. ఆ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ప్రేమను పొందారు ఈ మలయాళ బ్యూటీ. ప్రస్తుతం తెలుగులో ‘స్వయంభూ’, హిందీలో ‘మహారాజ్ఞి’ తదితర చిత్రాల్లో నటిస్తున్నారామె. ఇక ‘సాక్షి’తోసంయుక్త పంచుకున్న విశేషాల్లో కొన్ని ఈ విధంగా...

కేరళ టు హైదరాబాద్‌ షిఫ్ట్‌ అయినట్లున్నారు? 
ఈ మధ్య వరుసగా తెలుగులో నాలుగైదు సినిమాలు సైన్‌ చేశాను. ఇక్కడే ఉంటే బాగుంటుందని ముందు సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌లో ఉండటం మొదలుపెట్టాను. మా అమ్మగారు కూడా నాతో పాటే ఉండాలనుకున్నారు. మా ఇంట్లో కుక్క పిల్లలు ఉన్నాయి. అమ్మా, నేను, కుక్కపిల్లలు... ఇదే నా ప్రపంచం. వాళ్లను విడిచి ఉండలేను. అందుకే ఇప్పుడు ఒక ఫ్లాట్‌ తీసుకుని, వాళ్లని కూడా హైదరాబాద్‌ తీసుకొచ్చేశాను.

మలయాళంలో చేసిన ఫస్ట్‌ మూవీ ‘పాప్‌కార్న్‌’ (2016) చూసి, మీకు నటించడం రాదని కొందరు అన్నారు... మీకూ అలా అనిపించిందా? 
ఇప్పుడైతే ఇంకా బాగా నటించి ఉండేదాన్ని అనిపిస్తుంటుంది. యాక్టింగ్‌ని నా కెరీర్‌గా అనుకోలేదు. సినిమాకి అవకాశం వచ్చింది. ‘ఇలాంటి అవకాశాలు అరుదుగా వస్తాయి.. ఒప్పుకో’ అని మా అమ్మగారు అన్నారు. ‘సరే’ అన్నాను. అప్పుడు నా వయసు 19, 20 ఏళ్లు ఉండి ఉంటాయి. ప్రపంచం గురించి పెద్దగా అవగాహన లేదు. షూటింగ్‌ లొకేషన్‌కి వెళ్లాక, అక్కడ రెండు కెమెరాలు ఉండటం చూసి రెండు ఎందుకు? ఉన్నాయా అనిపించింది. రెండు సైడ్స్‌ నుంచి షూట్‌ చేస్తారనే కనీస అవగాహన కూడా లేదు నాకు. పైగా బాగా బిడియస్తురాల్ని. 

(చదవండి: జూనియర్ ఎన్టీఆర్ దేవర.. ఓవర్‌సీస్‌లో మరో క్రేజీ రికార్డ్‌!)

మా కుటుంబానికి చెందినవాళ్లెవరూ సినిమాల్లో లేరు. షూటింగ్‌ వాతావరణం మొత్తం చాలా అసౌకర్యంగా అనిపించింది. ఏదో నటించామంటే నటించాం అన్నట్లు చేశాను. ‘సినిమాలు మన వల్ల కాదు’ అని, చదువుకోవాలని డిసైడ్‌ అయిపోయాను. కానీ ఆ తర్వాత ‘తీవండి, లిల్లీ’ అనే సినిమాలకు అవకాశం వస్తే, ఒప్పుకున్నాను. ‘లీల్లీ’ లేడీ ఓరియంటెడ్‌ మూవీ కావడంతో సవాల్‌ అనిపించింది. సినిమా విధానాన్ని నేను ఎంజాయ్‌ చేయడం మొదలుపెట్టింది ‘లిల్లీ’తోనే. ‘మనం నటించగలం’ అనే నమ్మకం కలిగింది కూడా ఆ సినిమాతోనే.

‘సినిమాలు మన వల్ల కాదు’ అనుకున్నానని ఇంతకుముందు అన్నారు. లైఫ్‌లో ఏదైనా విషయంలో ‘వల్ల కాదు’ అంటే అలా సింపుల్‌గా వదిలేస్తారా? 
సింపుల్‌గా వదిలేయడం కూడా నా వల్ల కాదు. మనం ఎందుకు చేయలేం అనే ఆలోచన కూడా కలుగుతుంది. అయితే ఫస్ట్‌ మూవీకి నాకు సినిమా అంటే అర్థం కాలేదు. అర్థం కాని విషయం గురించి ఆలోచించడం ఎందుకని సినిమాలు వదిలేద్దామనుకున్నాను. ‘లీల్లీ’ చేసేటప్పుడు కాస్త అర్థమైంది. దాంతో కంటిన్యూ అవ్వాలని నిర్ణయించుకున్నాను. ఏదైనా విషయాన్ని సాధించాలని నేను ఒక్కసారి ఫిక్స్‌ అయితే ఎంత కష్టపడటానికైనా రెడీ అయిపోతా. పైగా ఫస్ట్‌ మూవీ తర్వాత నేను సినిమాలకు దూరంగా ఉండాలనుకున్నప్పుడు ఇంకోటి ఎందుకు చేయడంలేదు? అని చుట్టూ ఉన్నవాళ్లు అనుకున్నారు. అప్పుడు సినిమా అనేది వర్ల్‌ పూల్‌ లాంటిదని అర్థమైంది. ఒక్కసారి వస్తే వెనక్కి వెళ్లలేం. ఫెయిల్యూర్‌గా మిగిలిపోవడం ఇష్టం లేక రెండో సినిమా ‘తీవండి’ ఒప్పుకున్నాను. ఆ తర్వాత ‘లిల్లీ’ చేశాను. ఈ సినిమాతో ఇండస్ట్రీలో ఉండాలని ఫిక్స్‌ అయిపోయాను. 

మొదట్లో అసౌకర్యంగా అనిపించిందని అన్నారు... ఇండస్ట్రీలో కొందరికి ఎదురయ్యే ‘క్యాస్టింగ్‌ కౌచ్‌’లాంటిది ఏమైనా... 
అలా ఏం లేదు. ఆ విషయంలో నేను లక్కీ. సినిమా మేకింగ్‌ ప్రాసెస్‌ అర్థం కాకపోవడంవల్లే వెళ్లిపోదామనుకున్నాను. ఒకవేళ క్యాస్టింగ్‌ కౌచ్‌లాంటి చేదు అనుభవం ఎదురై ఉంటే... అప్పటికప్పుడే అడిగేదాన్ని. ఇంట్లో ఏడ్చేసి, ఆ తర్వాత ఎప్పటికో ఆ విషయాన్ని బయటపెట్టేదాన్ని కాదు. మలయాళంలో నా ఫస్ట్‌ మూవీ నుంచి తెలుగు, తమిళంలో నాకన్నీ మంచి ప్రొడక్షన్‌ హౌస్‌లే దొరికాయి.

‘మహారాజ్ఞి’తో హిందీకి కూడా వెళుతున్నారు... భాష తెలియకపోతే నటనకు న్యాయం చేయలేనని తెలుగు నేర్చుకున్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మరి... హిందీ వచ్చా? 
స్కూల్‌లో హిందీ ల్వాంగేజ్‌ ఉండటంతో రాయడం, చదవడం వచ్చు. అయితే అనర్గళంగా మాట్లాడలేను. అందుకే తెలుగుకి ట్యూటర్‌ని పెట్టుకున్నట్లు హిందీకి కూడా పెట్టుకున్నాను. భాష నేర్చుకోవడం అంటే డైలాగ్స్‌ బట్టీ పట్టి ఆ సినిమా వరకు చెప్పడం వరకే అనుకోను. విడిగా కూడా  తెలుగు మాట్లాడాలనుకున్నాను. అందుకే గ్రామర్‌ కూడా తెలుసుకోవాలని ట్యూటర్‌ పెట్టుకున్నాను. స్కూల్‌కి వెళ్లేటప్పుడు నోట్‌ బుక్‌ ఉంటుంది కదా.. అలాంటి నోట్‌బుక్‌ పెట్టుకుని, భాషలు నేర్చుకుంటున్నాను. మనం ఒక జాబ్‌ చేస్తున్నామంటే పూర్తి న్యాయం చేయాలన్నది నా అభిప్రాయం.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement