‘‘సందీప్‌లో ప్రతిభ, కష్టం కనిపించాయి కానీ అదృష్టం కనిపించలేదు’ అని హీరో నాని అన్నారు. నిజంగానే నాకు అదృష్టం కలసిరాలేదని, రావాల్సినంత పేరు రాలేదని చాలామంది అంటుంటారు. నాని చెప్పినట్లు ‘మైఖేల్’తో నాకు అదృష్టం కూడా కలిసొస్తుందని నమ్ముతున్నా’’ అని హీరో సందీప్ కిషన్ అన్నారు. రంజిత్ జయకొడి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మైఖేల్’. నారాయణ్ దాస్ కె. నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా సందీప్ చెప్పిన విశేషాలు.
► ఇప్పుటివరకూ నేను చేయాలనుకుని చేయలేకపోయినది ఏంటి? అని ఆలోచించినప్పుడు ‘మైఖేల్’ ఐడియా వచ్చింది. నా ఆలోచన రంజిత్‌కి చెప్పాను. ఆ ఆలోచన తీసుకుని తను చెప్పిన ‘మైఖేల్’ కథ బాగా నచ్చింది. భరత్ చౌదరి, రామ్మోహన్ రావు, సునీల్ నారంగ్ వంటి నిర్మాతలు తోడవ్వడంతో ఈ సినిమా స్థాయి భారీగా పెరిగింది. ఈ చిత్రకథకి, విజువల్ నెరేటివ్‌కి, సినిమాకి పాన్ ఇండియా స్థాయి ఉంది.. అందుకే పాన్ ఇండియా మూవీగా తీశాం.
► ‘మైఖేల్’ యూనిక్ స్టోరీ. చెడ్డవాళ్ల మధ్య జరిగే ప్రేమకథ ఇది. యాక్షన్, ఎమోషన్స్, డార్క్ కామెడీ ఉంటుంది. మైఖేల్ చాలా వైల్డ్. గ్యాంగ్‌స్టర్ కాకపోయినా నా పాత్ర ఎగ్రెసివ్‌గా ఉంటుంది.
► ఈ సినిమాలోని ఓ సన్నివేశం కోసం దాదాపు 18 రోజులు పాటు ఫుడ్ తీసుకోకుండా నీళ్లు మాత్రమే తాగేవాణ్ణి. ఒక దశలో కుడి కాలు పని చేయడం మానేసింది. అయినా ఒక ఫైట్ షూట్ చేసి, ప్యాకప్ చెప్పాం. తమిళ సంస్కృతి, భాష నాకు తెలుసు. అందుకే తమిళ ప్రేక్షకుల నుంచి నాకు మంచి ప్రేమ లభించింది.. అలాగే విజయ్ సేతుపతిగారు ‘మైఖేల్’లో భాగమయ్యారు. ధనుష్‌గారు ‘కెప్టెన్ మిల్లర్’లో నన్ను తీసుకున్నారు. ‘మైఖేల్’కి తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నేనే డబ్బింగ్ చెప్పాను.
► ‘మైఖేల్’ నాకు చాలా స్పెషల్ జర్నీ. ఈ ప్రయాణంలో బరువు తగ్గాను, స్కూబా డైవింగ్ నేర్చుకున్నాను. అండర్ వాటర్‌లోనూ షూటింగ్ చేశాం. ప్రస్తుతం ‘భైరవ కోన, కెప్టన్ మిల్లర్, బడ్డీ’ సినిమాలు చేస్తున్నాను. అలాగే ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ వెబ్ సిరీస్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment