Bollywood Stars: అక్కడ హీరో.. ఇక్కడ విలన్‌ | Sanjay Dutt, AKshay Kumar, Sunny Deol Other Bollywood Stars Focus On Tollywood | Sakshi
Sakshi News home page

టాలీవుడ్‌పై బాలీవుడ్‌ స్టార్స్‌ ఫోకస్‌.. గెస్ట్‌ రోల్‌ అయినా ఒకే!

Published Sun, Sep 1 2024 12:57 PM | Last Updated on Sun, Sep 1 2024 1:06 PM

Sanjay Dutt, AKshay Kumar, Sunny Deol Other Bollywood Stars Focus On Tollywood

బాలీవుడ్‌ నుంచి ఎక్కువగా హీరోయిన్లు టాలీవుడ్‌కి వస్తుంటారు. ఈసారి పలువురు నటులు తెలుగు తెరకు పరిచయం కానున్నారు. ఈ ఏడాది ఇప్పటికే కొందరు నటులు, నటీమణులు కనిపించగా... త్వరలో రానున్న బాలీవుడ్‌ స్టార్స్‌ గురించి తెలుసుకుందాం. 


కన్నప్పతో ఎంట్రీ
బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ హిందీలో వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా దూసుకెళుతున్నారు. ఆయన తొలిసారి తెలుగులో ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘కన్నప్ప’. హీరో మంచు విష్ణు కలల ప్రాజెక్టుగా ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న చిత్రమిది. ఈ మూవీకి ‘మహాభారత్‌’ సిరీస్‌ ఫేమ్‌ ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై మంచు మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీలో పలు భాషలకు చెందిన స్టార్‌ హీరోలు, ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. 

ప్రభాస్, మోహన్‌బాబు, మోహన్‌ లాల్, శరత్‌కుమార్, బ్రహ్మానందం, కాజల్‌ అగర్వాల్, మధుబాల, ప్రీతీ ముకుందన్‌ వంటి వారు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ‘కన్నప్ప’ చిత్రంలో అక్షయ్‌ కుమార్‌ కీలకమైన అతిథి పాత్రలో నటించారు. ఇప్పటికే తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ కోసం హైదరాబాద్‌కి వచ్చి, తన పాత్ర షూటింగ్‌ని అక్షయ్‌ కుమార్‌ పూర్తి చేసి వెళ్లారు. అక్షయ్‌ వంటి స్టార్‌ హీరో ‘కన్నప్ప’లో భాగస్వామ్యం కావడంతో ఈ సినిమాపై బాలీవుడ్‌లోనూ ఆసక్తి నెలకొంది. అయితే అక్షయ్‌ కుమార్‌ ఏ పాత్రలో నటించారు? అనే విషయాన్ని చిత్రయూనిట్‌ ఇప్పటి వరకూ స్పష్టం చేయలేదు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో రూపొందుతోన్న ‘కన్నప్ప’ డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది.  

ఓమీ భాయ్‌
బాలీవుడ్‌ సీరియల్‌ కిస్సర్‌గా పేరు తెచ్చుకున్నారు ఇమ్రాన్‌ హష్మీ. హీరోయిన్లతో ముద్దు సన్నివేశాలు, రొమాంటిక్‌ సన్నివేశాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్‌ని సొంతం చేసుకున్న ఆయన తొలిసారి తెలుగులో నటిస్తున్న చిత్రం ‘ఓజీ’. పవన్‌ కల్యాణ్, ప్రియాంకా అరుళ్‌ మోహన్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో పవర్‌ఫుల్‌ విలన్‌ పాత్రలో నటిస్తున్నారు ఇమ్రాన్‌ హష్మీ. మార్చిలో ఇమ్రాన్‌ హష్మీ పుట్టినరోజుని పురస్కరించుకుని, ఈ చిత్రంలో ఆయన చేస్తున్న ఓమీ భాయ్‌ పాత్రని పరిచయం చేస్తూ, ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. 

తన లుక్‌పై ఇమ్రాన్‌ హష్మీ ‘ఓజీ’ సినిమాలోని ఓ డైలాగ్‌తో స్పందించారు. ‘గంభీరా... నువ్వు తిరిగి బాంబే వస్తున్నావని విన్నా. ్ర΄ామిస్‌... ఇద్దరిలో ఒకరి తలే మిగులుతుంది’ అంటూ ట్వీట్‌ చేశారాయన. ఇక గూఢచారితోనూ తెరపై కనిపించనున్నారు ఇమ్రాన్‌. అడివి శేష్‌ నటించిన హిట్‌ మూవీ ‘గూఢచారి’ (2018)కి సీక్వెల్‌గా రూపొందుతోన్న చిత్రం ‘జీ 2’ (గూఢచారి 2). వినయ్‌ కుమార్‌ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, అనీల్‌ సుంకర, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోనూ ఇమ్రాన్‌ హష్మీ నటిస్తున్నారు. ఆయన నటిస్తున్న రెండో తెలుగు చిత్రం ‘జీ 2’. ఈ మూవీలో ఆయన ఏ పాత్రలో నటిస్తున్నారు? అనేది తెలియాల్సి ఉంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమా రిలీజ్‌ కానుందని టాక్‌. 



దేవరతో జోడీ
అతిలోక సుందరి శ్రీదేవి తెలుగు ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ గుర్తుండి΄ోయే ΄ాత్రలు చేశారు. ఆమె కుమార్తె జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్నారు. అయితే ఆమె తెలుగు సినిమాల్లో నటిస్తే చూడాలని ఉందని శ్రీదేవి అభిమానులు ఎప్పటి నుంచో వేచి చూస్తున్నారు.  వారి నిరీక్షణ ఫలించనుంది. ‘దేవర’ చిత్రం ద్వారా తెలుగులో హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు జాన్వీ కపూర్‌. ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూ΄÷ందుతోంది. నందమూరి కల్యాణ్‌రామ్‌ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతోంది. ఈ చిత్రం నుంచి విడుదలైన ‘చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు..’పాటలో జాన్వీ కపూర్‌ ఫుల్‌ గ్లామరస్‌గా కనిపించడంతో ఈ సాంగ్‌ ఇప్పటికే ఫుల్‌ ట్రెండింగ్‌లో ఉంది. మరి సినిమా విడుదల తర్వాత జాన్వీకి ఎంతమంది ఫ్యాన్స్‌ అవుతారో వేచి చూడాలి. 

కాగా ‘దేవర’ తొలి భాగం సెప్టెంబరు 27న విడుదల కానుంది. ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే జాన్వీకి మరో తెలుగు సినిమాలో నటించే అవకాశం వచ్చింది. వెండితెరపై చిరంజీవి–శ్రీదేవిలది సూపర్‌ జోడీ. వారి వారసులు రామ్‌ చరణ్‌– జాన్వీ కపూర్‌ తొలిసారి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆర్‌సీ 16’ (వర్కింగ్‌ టైటిల్‌). ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. 

మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తెలుగులో ఆమెకు ఇది రెండవ చిత్రం. ఒకప్పటి హిట్‌ జోడీ అయిన చిరంజీవి–శ్రీదేవిల వారసులు రామ్‌చరణ్‌–జాన్వీ కపూర్‌ నటిస్తున్న ఈ ΄ాన్‌ ఇండియా సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో, సినీ అభిమానుల్లో ఫుల్‌ క్రేజ్‌ నెలకొంది. 

వీరమల్లుతో పోరాటం 
గత కొన్నేళ్లుగా బాబీ డియోల్‌ కెరీర్‌ ఆశాజనకంగా సాగడం లేదు. అయితే సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ‘యానిమల్‌’ (2023) సినిమా తర్వాత ఈ బాలీవుడ్‌ నటుడి క్రేజ్‌ ఒక్కసారిగా ఊపందుకుంది. ఆ సినిమాలో ఆయన నటించిన విలన్‌ పాత్రకి అద్భుతమైన పేరు రావడంతో విపరీతమైన డిమాండ్‌ పెరిగింది. హిందీలోనే కాదు.. తెలుగు, తమిళ భాషల నుంచి కూడా అవకాశాలు వెతుక్కుంటూ వెళుతున్నాయి. 

ఆయన నటిస్తున్న తొలి స్ట్రయిట్‌ తెలుగు చిత్రం ‘హరి హర వీరమల్లు’. పవన్‌ కల్యాణ్, నిధీ అగర్వాల్‌ జంటగా నటిస్తున్నారు. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ మూవీ ప్రారంభమైంది. అయితే ఈ ప్రాజెక్టు ఆలస్యం అవుతుండటంతో ఆయన తప్పుకున్నారట. దీంతో నిర్మాత ఏఎమ్‌ రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారని సమాచారం. ఏఎమ్‌ రత్నం, ఎ. దయాకర్‌ రావు నిర్మిస్తున్న ఈ సినిమా పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతోంది.  17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్‌ షాహీల శకం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్‌ నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబరులో విడుదల కానుందని టాక్‌. ఇదిలా ఉంటే బాలకృష్ణ హీరోగా బాబీ (కేఎస్‌ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న ‘ఎన్‌బీకే 109’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమాలోనూ బాబీ డియోల్‌ నటిస్తున్నారు.

బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ కూడా ప్రస్తుతం తెలుగు సినిమాలపై దృష్టి పెట్టారు. 1998లో విడుదలైన హీరో నాగార్జున ‘చంద్రలేఖ’ సినిమాలో తొలిసారి అతిథి పాత్రలో కనిపించారు సంజయ్‌ దత్‌. దాదాపు ఇరవైఆరేళ్ల తర్వాత ఆయన పూర్తి స్థాయిలో నటించిన తెలుగు సినిమా ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రామ్‌ హీరోగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదలైంది. విలన్‌ బిగ్‌ బుల్‌ పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకున్నారు సంజయ్‌ దత్‌. 

ఆయన నటిస్తున్న మరో తెలుగు చిత్రం ‘రాజా సాబ్‌’. ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలోనూ ఆయన కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ‘ఆదిపురుష్‌’ (తెలుగు–హిందీ) సినిమాతో తెలుగులో పరిచయమైన సైఫ్‌ అలీఖాన్‌ ప్రస్తుతం ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న ‘దేవర’ చిత్రంలో నటిస్తున్నారు. 

అలాగే బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకోన్‌ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తొలి భాగం జూన్‌ 27న విడుదలైంది. ఈ సినిమా రెండో భాగంలోనూ దీపిక నటించనున్నారు. వెర్సటైల్‌ యాక్టర్‌గా పేరొందిన నవాజుద్దీన్‌ సిద్ధిఖీ కూడా ఈ ఏడాది ‘సైంధవ్‌’ చిత్రం ద్వారా తెలుగుకి పరిచయమయ్యారు. వికాస్‌ మాలిక్‌గా విలన్‌ పాత్రలో తనదైన శైలిలో అలరించారాయన. ఇలా ఈ ఏడాది ఇప్పటికే పలువురు బాలీవుడ్‌ స్టార్స్‌ తెలుగుకి పరిచయం కాగా... మరెందరో రానున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement