
సైఫ్ అలీ ఖాన్ ముద్దుల కూతురు సారా అలీ ఖాన్ గురించి బాలీవుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. సైఫ్ వారసురాలిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. కొత్త ఏడాదిలో స్కై ఫోర్స్‌తో అభిమానులను మెప్పించింది. ప్రస్తుతం మెట్రో ఇన్ డినో అనే చిత్రంలో కనిపించనుంది. ఈ సినిమాకు అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలై 4న థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సారా అలీ ఖాన్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ముఖ్యంగా సోషల్ మీడియా ట్రోలింగ్‌ను ఉద్దేశించి మాట్లాడింది. తన నటనపై సోషల్ మీడియాలో తరచుగా విమర్శలు ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. అయినప్పటికీ అవీ నన్ను పెద్దగా ఇబ్బంది పెట్టలేదని వివరించింది. సోషల్ మీడియాలో వచ్చే నెగెటివిటీ నుంచి బయటపడేందుకు ధ్యానం చేస్తానని తెలిపింది.
సారా అలీ ఖాన్ మాట్లాడుతూ.. "నేను సాధ్యమైనంత వరకు వాటిని ఫిల్టర్ చేయడం ప్రారంభించా. ఈ విషయంలో నాకు సహాయపడేది ధ్యానం. ఇలా చేయడం వల్ల నాకు నిజమేంటో తెలుస్తుంది. నేను నా స్వంత ఆలోచనలతో చూడటం ప్రారంభించా. ప్రతి ఆలోచనకు కూడా నన్ను సమర్థించుకోను. ఒక నటిగా నేను ఉన్నతమైన స్థానంలో లేను. కొంతమందికి కొందరు నటీనటులు అంటే ఇష్టం. మరికొందరికి ఇష్టం ఉండదు. నటిగా ఇంకా నేను చాలా దూరం ప్రయాణించాలి. ఆ భగవంతుడు కోరుకుంటే సుదీర్ఘ జీవితం సినిమాల్లో ముందుకు సాగుతా. ఆ తర్వాత ప్రొడక్షన్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌పై దృష్టి సారిస్తా.' అని తెలిపింది.