‘‘మేజర్’కి తెలుగులో అద్భుతమైన ఆదరణ వస్తోంది. బాలీవుడ్‌లోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. కమల్‌గారి ‘విక్రమ్, అక్షయ్ కుమార్ ‘సామ్రాట్ పృథ్విరాజ్’ చిత్రాలతో పోలిస్తే మాది చిన్న చిత్రం.. అయినా వాటితో పాటే ఆదరణ పొందడం హ్యాపీ. ‘మేజర్’కి వస్తున్న స్పందన ఎంతో సంతృప్తి ఇచ్చింది’అని అన్నారు దర్శకుడు శశికిరణ్ తిక్క. ఆయన దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్. అనురాగ్, శరత్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 3న విడుదలై హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా శశికిరణ్ మీడియాతో ముచ్చటించాడు. ఆ విశేషాలు..
►మేజర్ సినిమా వాస్తవానికి 2020 లోనే విడుదల అవ్వాలి. 40 పర్సెంట్ షూటింగ్ కేవలం 3 నెలల్లో పూర్తి చేశాం. అదే వేగంతో చేసుకుంటూ వెళ్తే సినిమా వేగంగా ఫినిష్ అయ్యేది. ఇంతలో లాక్ డౌన్ వచ్చి పడటం వల్ల సినిమా ఆపేయాల్సి వచ్చింది. తిరిగి షూటింగ్ మొదలుపెట్టే టైమ్ కు ప్రకాష్ రాజ్, రేవతి వంటి పెద్ద ఆర్టిస్టుల డేట్స్ దొరకలేదు. డబ్బింగ్ సహా మొత్తం పనులన్నీ అలా స్ట్రగుల్ పడి కంప్లీట్ చేశాం.
►ఈ చిత్రాన్ని మేము నిజాయితీగా తెరకెక్కించాం. కమర్షియాలిటీ కోసం కావాలంటే పాటలు, ఫైట్స్ పెట్టొచ్చు. కానీ మేము ఎక్కడా ఆ లైన్ క్రాస్ కాలేదు. కథను ఎంత హుందాగా, సహజంగా తెరకెక్కించాలో అదే పద్ధతిలో రూపొందిస్తూ వెళ్లాం.
►నాకు పేరు కంటే సంతృప్తి, గొప్ప సినిమా చేశామనే సంతోషం ముఖ్యం. ‘మేజర్’తో ఆ రెండూ నాకు దక్కాయి. నాకే పేరు రావాలనుకోను. నా సినిమాకు మంచి పేరొస్తే నాకు వచ్చినట్లే. ‘మేజర్’ చిత్రాన్ని నిజాయితీగా తెరకెక్కించాం.
►మంచి సినిమా చేస్తామని మేజర్ సందీప్ తల్లిదండ్రులకు మేమిచ్చిన మాటను నిలబెట్టుకున్నామనే సంతోషం మిగిలింది. బాలీవుడ్ నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా అప్రిసియేషన్స్ వస్తున్నాయి. అల్లు అర్జున్, రానా వంటి హీరోలు ఫోన్స్ చేసి సినిమా చాలా బాగా చేశారు అని మెచ్చుకుంటున్నారు. ఇవన్నీ నేను మర్చిపోలేని జ్ఞాపకాలు. మేజర్ సినిమా ప్రివ్యూ చూశాక సందీప్ వాళ్ల మదర్ నన్ను హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. మేము ఎంత నిజాయితీగా పనిచేశామో ఆమె స్పందన ద్వారా తెలిసింది.
►ఇవాళ కొత్త దర్శకులకు ఇండస్ట్రీలో సానుకూల పరిస్థితులు ఉన్నాయి. సినిమా మీద ప్యాషన్ ఉండి, ఏదైనా మంచి కథ ఉంటే ఓటీటీల నుంచి, ప్రొడక్షన్ హౌస్ ల నుంచి ఆఫర్స్ వస్తున్నాయి. మీ దగ్గరకు అవకాశాలు రావు మీరే సృష్టించుకోవాలి. యంగ్ ఫిలింమేకర్స్ కు నేను ఇదే చెప్పాలనకుంటున్నా. మా టైమ్ లో ఇంత టెక్నాలజీ లేదు, ఓటీటీ వేదికలు లేవు, స్క్రిప్టు పట్టుకుని తిరగాల్సి వచ్చేది. ఇప్పటి వారికి ఎన్నో వేదికలు వస్తున్నాయి.
► ‘మేజర్’కు వచ్చిన పేరు, నాకు వచ్చిన గుర్తింపుతో ఇక నేను చేయబోయే సినిమాలు కూడా ఇంతే జాగ్రత్తగా చేయా లనుకుంటున్నాను. బ్రిటీష్ కాలపు నేపథ్యంతో ఓ సినిమా తీయాలని ఉంది. నా తర్వాతి సినిమా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ఉంటుంది. నా వద్ద అసిస్టెంట్‌గా చేసిన ఒకర్ని ‘గూఢచారి 2’ ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నాం. అయితే ‘గూఢచారి’ ఫ్రాంచైజీలో ఓ సినిమాకు నేను దర్శకత్వం వహిస్తాను.
(చదవండి: బిగ్‌బాస్ విన్నర్ సన్నీపై దాడి, పోలీసులకు ఫిర్యాదు)
Comments
Please login to add a commentAdd a comment