టైటిల్ : సీటీమార్
నటీనటులు : గోపిచంద్, తమన్నా, భూమిక, దిగంగన సూర్యవంశి, పోసాని, రావు రమేష్, రెహమాన్, తరుణ్ అరోరా తదితరులు
నిర్మాణ సంస్థ : శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
నిర్మాతలు : శ్రీనివాస చిట్టూరి
దర్శకుడు: సంపత్ నంది
సంగీతం : మణిశర్మ
సినిమాటోగ్రఫీ : సౌందర్ రాజన్
విడుదల తేది : సెప్టెంబర్ 10,2021
గత కొంతకాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న టాలీవుడ్ హీరోల్లో మ్యాచోస్టార్ గోపిచంద్ ఒకరు. ఒకప్పుడు వైవిధ్యమైన చిత్రాలు చేసి ఆకట్టుకున్న గోపిచంద్.. ఇటీవల కాలంలో రొటీన్ సినిమాలను చేస్తూ బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాడు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో తొలిసారి క్రీడా నేపథ్యం ఉన్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి ‘సీటీమార్’అని టైటిల్ పెట్టడం, మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహించడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ట్రైలర్, చిత్రంలోని పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడం ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. మరి ఆ అంచనాలను గోపిచంద్ అందుకున్నాడా? ‘సీటీమార్’సినిమాకు ప్రేక్షకులు సీటీలు కొట్టారా లేదా? రివ్యూలో చూద్దాం.
‘సీటీమార్’ కథేంటంటే..?
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కార్తీక్ సుబ్రహ్మణ్యం(గోపిచంద్) స్పోర్ట్స్ కోటాలో బ్యాంకు ఉద్యోగం పొందుతాడు. ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూనే తన గ్రామంలోని ఆడపిల్లలకు కబడ్డీ కోచింగ్ ఇస్తుంటాడు. వారిని ఎలాగైనా నేషనల్ పోటీల్లో గెలిపించాలని తపన పడతాడు. కప్పు కొట్టి గ్రామంలోని పాఠశాలను మూతపడకుండా చేయాలనేది అతని లక్ష్యం. అనుకున్నట్లే కార్తీక్ టీమ్ నేషనల్ పోటీలకు ఎంపికవుతుంది. కట్‌చేస్తే..గేమ్ కోసం ఢిల్లీకి వెళ్లిన కార్తీక్ టీమ్‌లోని ఆడపిల్లలు కిడ్నాప్‌నకు గురవుతారు. వారిని ఎవరు కిడ్నాప్ చేశారు? ఈ క్రమంలో తెలంగాణ మహిళా కబడ్డీ కోచ్ జ్వాలారెడ్డి కార్తీక్‌కి ఎలాంటి సాయం చేసింది. నేషనల్ కప్పు కొట్టి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాలన్న కార్తీక్ ఆశయం నెరవేరిందా లేదా? అనేదే మిగతా కథ.
ఎవరెలా చేశారంటే..?
కబడ్డీ కోచ్‌గా గోపిచంద్ అదరగొట్టేశాడు. తనదైన ఫెర్ఫార్మెన్స్‌తో సినిమా మొత్తాన్ని తన భూజాన వేసుకొని నడిపించాడు. ఫైట్ సీన్స్‌లో అద్భుతంగా నటించాడు. ఇక తెలంగాణ మహిళా కబడ్డీ కోచ్ జ్వాలారెడ్డి పాత్రలో తమన్నా మెప్పించింది. హీరోని అభిమానించే లోకల్ న్యూస్ ఛానెల్ యాంకర్గా దిగంగన సూర్యవంశీ చక్కగా నటించింది. విలన్ పాత్రలో తరుణ్ అరోరా జీవించేశాడు. తెరపై చాలా క్రూరంగా కనిపించాడు. హీరో అక్కగా భూమిక, పోలీసు అధికారిగా రెహమాన్ ఫర్వాలేదనిపించారు. గ్రామ ప్రెసిడెంట్‌గా రావురమేశ్ మరోసారి తనదైన పంచులతో ఆకట్టుకున్నాడు. ఆయన చేసే సీరియస్ కామెడీకి, పంచులకు థియేటర్లలో ప్రేక్షకులు పగలబడి నవ్వుతారు. మిగిలిన నటీ,నటులు తమ పాత్రల పరిధిమేర ఆకట్టుకున్నారు.
ఎలా ఉందంటే..
గోపిచంద్ తొలిసారి క్రీడా నేపథ్యంలో నటించిన చిత్రం‘సీటీమార్’. అయితే దీన్ని ఓ స్పోర్ట్స్ డ్రామాగా మలిచి వదిలేకుండా, దానికి పోలీస్ కథను మిళితం చేసి సినిమాపై ఆసక్తిని పెంచేలా చేశాడు దర్శకుడు సంపత్ నంది. ఫస్టాఫ్ అంతా కామెడీ ప్రధానంగా తెరకెక్కించిన దర్శకుడు.. సెకండాఫ్‌లో ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా మలిచాడు. కార్తీక్ కు అతని అక్క, బావలకు ఉండే అనుబంధాన్ని చూపిస్తూనే, కబడ్డి పోటీ కోసం ఢిల్లీ వెళ్ళిన అమ్మాయిలు కిడ్నాప్ కావడం, దానికి పోలీస్ ఆఫీసర్ అయిన అతని బావ గతంతో ముడిపెట్టడం చాలా ఆసక్తిగా ఉంటుంది.
ప్రథమార్థంలో ప్రగతి, అన్నపూర్ణమ్మల గ్యాంగ్.. టీవీ యాంకర్ దిగంగన పెళ్లిని చెడగొట్టే సీన్ అయితే థియేటర్లలో నవ్వులు పూయిస్తాయి. ముఖ్యంగా అన్నపూర్ణమ్మ పంచ్ డైలాగ్స్‌కి నవ్వని ప్రేక్షకుడు ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే సెకండాఫ్‌లో ఇలాంటి కామెడీ లేకపోవడం, కొన్నిచోట్ల పాత్రలు అతిగా ప్రవర్తించడం, యాక్షన్ సీక్వెన్స్ కూడా రోటీన్‌గా ఉండడం సినిమాకు మైనస్. ఇక ఈ సినిమాకు మరో ప్రధాన బలం మణిశర్మ సంగీతం. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా అదరగొట్టేశాడు. తనదైన బీజీఎంతో కొన్ని పాత్రలకు ప్రాణం పోశాడు. సౌందర్ రాజన్ ఫోటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్టుగా ఉన్నాయి.
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment