కాజోల్ అండ్ షారుఖ్ ఖాన్.. బాలీవుడ్ మోడర్న్ డేస్‌లో.. బాగా ఫేమస్ అయిన జంట. ఆ ప్రేమను తెర వరకే ప్రదర్శించి జీవితంలో విడిపోని స్నేహాన్ని మిగుల్చుకున్నారు. ప్రియాంక చోప్రా అండ్ షారుఖ్ ఖాన్.. తెర మీద రెండు సినిమాల్లోనే (డాన్ సిరీస్) కనిపించిన జంట.. జీవితంలో ప్రేమను పంచుకుని.. కలకాలం నిలుపుకోవాలనుకున్నారు.. ఆ కల నెరవేరేదేనేమో.. షారుఖ్ ఖాన్ జిందగీలో గౌరీ ఖాన్ భాగస్వామ్యం లేకుండా ఉండుంటే! అదివరకే అయిపోయిన ఈ పెళ్లివల్లే తర్వాత పుట్టిన ఆ ప్రేమ బ్రేక్ అయింది! ఆ స్టోరీ...
షారుఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా కలిసి నటించకముందు నుంచే ఇద్దరూ స్నేహితులు. బాలీవుడ్‌లోని పార్టీల్లో ఆ స్నేహం కుదిరింది. ఆమె నవ్వు, లౌక్యంలేని ప్రవర్తన షారూఖ్‌ను ఆకర్షించింది.. ఇష్టపడేలా చేసింది. ఆమెతో సమయం గడపడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకునే వాడు కాదు. తను హాజరయ్యే ఫంక్షన్లు, ఈవెంట్స్‌కు ప్రియాంకనూ పిలవమనీ హోస్ట్‌లను, నిర్వాహకులను కోరేవాడు. సూపర్ స్టార్ మాటను కాదనలేక ప్రియాంకతో పరిచయం లేకపోయినా ఆమెను పార్టీలకు పిలిచిన సందర్భాలెన్నోనట. అలాగే ఒకసారి కరణ్ జోహార్ బర్త్‌డేకూ ప్రియాంకని ఆహ్వానించమని కరణ్‌ను బలవంతపెట్టాడు షారుఖ్. స్నేహితుడిని చిన్నబుచ్చడం ఇష్టంలేక ప్రియాంకను పార్టీకి పిలిచాడు కరణ్. పార్టీకి వచ్చిన ప్రియాంక బుగ్గ మీద ముద్దుపెట్టుకొని మరీ రిసీవ్ చేసుకున్నాడు షారుఖ్. అతని వ్యవహారం కరణ్‌కు నచ్చలేదు. గౌరీకి మింగుడు పడలే.
డాన్
డాన్ (అమితాబ్ బచ్చన్ ‘డాన్’కి రీమేక్) సినిమాతో ప్రియాంక చోప్రాతో నటించే అవకాశం వచ్చిందని పొంగిపోయాడు షారుఖ్. ఆ సినిమా సెట్స్‌లోనే వాళ్ల మధ్య ప్రేమ మొదలైంది. అవుట్‌డోర్‌లో తెల్లవారు జాము మూడింటిదాకా కబుర్లు చెప్పుకుంటూ ఈ జంట యూనిట్ సభ్యుల కంట పడింది. ప్రశ్నార్థకంగా చూసిన వాళ్లకు ‘రిహార్సల్స్’ అని బదులిచ్చారు. డాన్ సిరీస్ వీళ్ల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీనీ సూపర్ హిట్ చేసింది. ప్రియాంక మీద షారుఖ్ ప్రేమా స్థిరపడింది. తనకే సినిమా ఆఫర్స్ వచ్చినా అందులో హీరోయిన్‌గా ప్రియాంకను తీసుకోమ్మని నిర్మాత, దర్శకులను అడిగేవాడట షారుఖ్. కమర్షియల్ యాడ్స్‌లోనూ తన పక్కన ప్రియాంకను సైన్ చేయమని డిమాండ్ చేసేవాడని చెప్తాయి బాలీవుడ్ వర్గాలు. తన ఐపీఎల్ టీమ్ మ్యాచెస్‌కూ ప్రియాంకను వెంట తీసుకెళ్లేవాడు. షారుఖ్ కనిపించే ప్రతి పబ్లిక్ ఈవెంట్‌లో పక్కన ప్రియాంక ఉండాల్సిందే. ఈ దృశ్యాలను ఫొటో జర్నలిస్ట్‌లు బాగా క్యాచ్ చేశారు.
వార్నింగ్
షారుఖ్ తీరుతో గౌరీ అభద్రతకు లోనైంది. సీరియస్‌గానే వార్నింగ్ ఇచ్చింది.. ‘ప్రియాంక చోప్రాతో తిరగడమే కాదు కలిసి సినిమాలు చేయడమూ బంద్. వినకపోతే విడాకులు ఖాయం’ అని. బాధపడ్డాడు.. కుమిలిపోయాడు. చివరకు కుటుంబమే ముఖ్యమని గౌరీ మాటను గౌరవించాడు. అటు నుంచీ నరుక్కొచ్చింది గౌరీ సినీరంగంలోని తన స్నేహితులు కరణ్ జోహార్, సుసాన్నే ఖాన్ వంటివాళ్ల సహాయంతో. ప్రియాంకను తమ సినిమాల్లోకి తీసుకోవద్దని కరణ్ జోహార్ ద్వారా నిర్మాతలకు, తమ భర్తల పక్కన హీరోయిన్‌గా అవకాశాలు ఇవ్వద్దని సుసాన్నే ద్వారా ఇతర హీరోల భార్యలకూ చెప్పించింది.
సదరు నిర్మాతలు, హీరోల సినిమాల్లో చాన్స్‌లు రాలేదు ప్రియాంకకు. ఇటు లవ్ లైఫ్ బ్రేక్ అయింది. తట్టుకోలేకపోయింది. అది అలాగే కొనసాగితే డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి పర్సనల్ లైఫ్‌నూ కోల్పోతానని అర్థమైంది ప్రియాంకకు. దృష్టి మ్యూజిక్ మీదకు మళ్లించింది. ఆ బ్యాలెన్స్ ఆమెను నిలబెట్టింది. సినిమాలతోపాటు పాశ్చాత్యా సంగీత ప్రపంచానికీ ఆమె సంతకాన్ని చూపించింది. నిశ్శబ్దంగా ఆ ఇద్దరి దారులు వేరయ్యాయి. ఆ ప్రేమ మూగబోయింది. రాకేశ్ శర్మ బయోపిక్ ‘సెల్యూట్’లో ప్రియాంకకు అవకాశం వచ్చింది. దాంట్లో షారుఖ్ హీరో అని తెలిసి ఆ ఆఫర్‌ను తిరస్కరించింది ఆమె.
చానాళ్ల తర్వాత
డర్టీ లాండ్రీ అనే అంతర్జాతీయ టాక్ షోకి ప్రియాంక చోప్రా ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆమె వేసుకున్న జాకెట్‌నుద్దేశించి ‘చాలా బాగుంది’ అని హోస్ట్ ఇచ్చిన కాంప్లిమెంట్ లాంటి ప్రశ్నకు ‘ఇది నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌ది. ఇందులోనే నా లైఫ్ ఉంది’ అని ప్రియాంక ఇచ్చిన సమాధానం సెన్సేషన్ అయింది. అంతకుముందు అదే జాకెట్ వేసుకొని షారుఖ్ చాలా సార్లు కనిపించాడని, ఆ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ అతనే అనే కామెంట్స్‌తో ఆ రెండు ఫొటోలూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
నిజం చెప్పాలంటే మిగతా యాక్టర్స్ కంటే ప్రియాంకతో నటించేప్పుడే చాలా కంఫర్ట్‌గా ఫీలవుతాను. మిగతా వాళ్లంతా నన్ను స్టార్‌గా చూస్తే తను మాత్రం నన్ను కోస్టార్‌లా.. ఫ్రెండ్‌లా చూస్తుంది. కెమెరా ముందు నా జుట్టు చెదిరినా వెంటనే సరి చేస్తుంది. ఎన్విరాన్‌మెంట్‌ను ఈజ్ చేస్తుంది. ఆమెతో ఉంటే కాలం తెలియదు. తను నాకత్యంత ఆప్తురాలు. – షారుఖ్ ఖాన్, ఒక ఇంటర్వ్యూలో
- ఎస్సార్
Comments
Please login to add a commentAdd a comment