Comedian Sidharth Sagar: మాదక ద్రవ్యాల నుంచి విముక్తి పొందిన నుంచి స్టాండప్ కమెడియన్ సిద్దార్థ్ సాగర్ అంతు చిక్కని పరిస్థితిలో పోలీసుల కంటపడ్డాడు. తనెక్కడున్నాడు? ఏం చేస్తున్నాడో కూడా తెలియని దుస్థితిలో ఉన్న అతడిని పోలీసులు పునరావాస కేంద్రానికి తరలించారు. గతంలో మాదకద్రవ్యాలకు బానిసైన అతడు సుదీర్ఘ పోరాటం తర్వాత దాన్ని జయించి తిరిగి కెరీర్ మీద ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలో ఫరాఖాన్ జడ్జిగా వ్యవహరిస్తున్న కామెడీ షోలో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి అందరినీ కడుపుబ్బా నవ్విస్తున్నాడు. కానీ ఈ మధ్యే షో నుంచి సిద్దార్థ్ సడన్‌గా మాయమయ్యాడు. మరో కమెడియన్ జామీ లివర్ అతడి స్థానాన్ని భర్తీ చేశాడు.
మరి సిద్దార్థ్ ఏమయ్యాడు? అని ఆరా తీయగా షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఆగస్టు 26న రాత్రి పూర్తి మైకంలో పడిపోయి ఉన్న సిద్దార్థ్‌ను ముంబై పోలీసులు గుర్తించి అతడి తల్లి అల్కా సాగర్‌కు సమాచారమందించారు. అయితే ఆ సమయానికి ఆమె ఢిల్లీలో ఉండటంతో తన అంగీకారంతో సిద్దార్థ్‌ను పునరావాస కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడు ఆ స్థితిలో ఉండటానికి గల కారణమేంటి? సిద్దార్థ్ మరోసారి డ్రగ్స్‌కు బానిసయ్యాడా? అన్న ప్రశ్నలకు అల్కా సాగర్ కింది విధంగా స్పందించింది.
'నేను చాలాకాలంగా సిద్దార్థ్‌ను అంటిపెట్టుకునే ఉంటున్నాను. కానీ నా పెంపుడు జంతువు అనారోగ్యం బారిన పడటంతో దాని వైద్యం కోసం ఢిల్లీ వచ్చాను. ఇంతలోనే సిద్దార్థ్ కండీషన్ బాగోలేదని తెలిసింది. అతడికి నా పేరు, నా ఫోన్ నంబర్ తప్ప మరేవీ గుర్తులేవని పోలీసులు చెప్పారు. దారుణమేంటంటే.. ఇలాంటి దుస్థితిలో ఉన్న సిద్దార్థ్‌కు సహాయం చేసేందుకు అతడి ఫ్రెండ్స్, తెలిసినవాళ్లు ఎవరూ ముందుకు రావట్లేదు. మేము మాత్రమే అతడి బాగోగులు చూసుకుంటాం కానీ కుటుంబానికి విలువివ్వడు. ఒక తల్లిగా అతడు వీలైనంత త్వరగా ఈ స్థితి నుంచి బయటపడాలని కోరుకుంటున్నాను. నేనెప్పుడూ తనని అంటిపెట్టుకునే ఉన్నాను. కానీ అనుకోకుండా ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. అక్కడ నా పెంపుడు జంతువు కూడా చనిపోయింది.
చాలామందికి తెలియని విషయమేంటంటే సిద్దార్థ్‌కు బైపోలార్ డిజార్డర్ ఉంది. దీనివల్ల ఎప్పుడూ ఊహల్లో తేలుతుండే అతడికి ట్రీట్‌మెంట్ కూడా చేయిస్తున్నాం. కానీ అతడు మెడిసిన్ తీసుకోవడం మానేశాడు. దీని వెనకాల ఏదో బలమైన కారణమే ఉంటుందనుకుంటున్నాను. తను మళ్లీ ఇలాంటి స్థితికి చేరుకున్నాడంటే కచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది. అతడికి నేనెప్పుడూ ఒక విషయం చెబుతూ ఉండేదాన్ని. నువ్వెంత పాపులర్ అవుతావో ఇండస్ట్రీలో నీకంతమంది శత్రువులు తయారవుతారు అని! జీవితాన్ని బ్యాలెన్సెడ్‌గా ఉంచుకోవాలని, డబ్బు వెనకాల పరిగెట్టకూడదని సూచించేదాన్ని. నిన్ను నేను పోషిస్తాను కానీ దయనీయ స్థితిలో మాత్రం చూడలేను అని చెప్పాను. నా కొడుకు కోసం తుదిశ్వాస వరకు పోరాడతాను. నేను ముంబైలో లేను కనుక అతడికి నిజంగా ఏం జరిగింది? అన్న దానిపై స్పష్టత రాలేదు. అతడు మళ్లీ డ్రగ్స్ తీసుకున్నాడా? లేదా బైపోలార్ డిజార్డర్‌కు అందిస్తున్న చికిత్సను నిలిపివేయడం వల్ల ఇలా జరిగిందా? అన్నది అర్థం కాకుండా ఉంది. ఈరోజు నేను ముంబై వెళ్లి అతడిని కలుసుకుంటాను. అప్పుడే ఈ విషయంలో నాకో క్లారిటీ వస్తుంది' అని అల్కా సాగర్ చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment