Comedian Tirthanand Rao: కరోనా వల్ల అన్ని రంగాలతో పాటు సినీ ఇండస్ట్రీ కూడా అతలాకుతలమైంది. సినిమానే నమ్ముకున్న ఎంతోమంది లాక్‌డౌన్ సమయంలో రోడ్డున పడ్డారు, టెక్నీషియన్లు, జూనియర్ ఆర్టిస్టులు, నటీనటులు ఇలా ఎందరో ఉపాధి లేక అల్లాడిపోయారు. ఈ క్రమంలో పలువురు బలవన్మరణానికి పాల్పడ్డారు. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత షూటింగ్‌లు మొదలైనా కొందరు ఆర్టిస్టులకు మాత్రం అవకాశాలు రావడం లేదు. వచ్చినా సరిగా డబ్బులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఈ క్రమంలో ఆర్థిక సమస్యలతో సతమతమైన కమెడియన్ తీర్థానంద్ రావు గత నెలలో ఆత్మహత్యకు యత్నించాడు. అటు అప్పులు తీర్చలేక, ఇటు అయినవాళ్ల అండ లేదన్న బాధతో డిసెంబర్ 21న విషం తాగి అర్ధాంతరంగా తనువు చాలించడానికి సిద్ధపడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని గుర్తించిన ఇరుగుపొరుగువారు ఆస్పత్రికి తీసుకెళ్లడంతో చావు నుంచి తప్పించుకుని బతికి బట్టగట్టాడు.
తాజాగా ఈ ఘటనపై తీర్థానంద్ స్పందిస్తూ తాను విషం తాగింది నిజమేనని అంగీకరించాడు. 'ఆర్థిక ఇబ్బందులతో నేను కొట్టుమిట్టాడుతున్నాను. పైగా నా కుటుంబం నన్ను ఒంటరిగా వదిలేసింది. అందుకే విషం తాగాను. ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే నా తల్లి, సోదరుడు కనీసం నన్ను చూడటానికి కూడా రాలేదు. మేమంతా అదే ప్రాంతంలో నివసిస్తున్నా వారు నాతో మాట్లాడటానికి కూడా ఇష్టపడరు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికొచ్చాక కూడా ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నాను. ఇంతకంటే ఘోరమైనది ఇంకేదైనా ఉందా?' అని ఎమోషనల్ అయ్యాడు. కాగా తీర్థానంద్ 2016లో కపిల్ శర్మ కామెడీ సర్కస్ షోలో కనిపించాడు. ఓ గుజరాతీ సినిమాలో అవకాశం రావడంతో కపిల్ శర్మ షోలో దీర్ఘకాలం కొనసాగలేకపోయాడు. ఇతడు నానా పటేకర్‌లా ఉండటంతో అతడి వాయిస్‌ను మిమిక్రీ చేస్తూ డబ్బులు సంపాదించేవాడు.
Comments
Please login to add a commentAdd a comment