
‘ప్రేమించటానికి సమయం లేదు’ అంటూ పాట రూపంలో చెబుతున్నారు హీరోయిన్ శ్రుతీహాసన్. ఈ బ్యూటీ నటి మాత్రమే కాదు.. మంచి గాయని అనే సంగతి కూడా తెలిసిందే. తండ్రి కమల్‌హాసన్ నటించిన ‘క్షత్రియ పుత్రుడు’ సినిమాలో ‘పోట్రి పాడడి పెన్నే..’ అనే పాట పాడే తొలి అవకాశం శ్రుతికి ఇచ్చారు సంగీత దర్శకుడు ఇళయరాజా.
ఆ తర్వాత ఆమె పలు మ్యూజిక్ ఆల్బమ్స్ చేశారు. కమల్‌హాసన్ నటించిన ‘ఉన్నైపోల ఒరువన్’ సినిమాకి సంగీతం అందించారు శ్రుతీహాసన్. అలాగే ‘ఈనాడు’ సినిమాలో ‘నింగికి హద్దు..’, ‘ఓ మై ఫ్రెండ్’లో ‘శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్‌లో..’, ‘ఆగడు’లో ‘అరె జంక్షన్‌లో..’, ‘రేసు గుర్రం’ మూవీలో ‘డౌన్ డౌన్...’ ఇలా పలు సినిమాల్లో చాలా పాటలు పాడారామె. తాజాగా మరోసారి గాయనిగా మారారు శ్రుతీహాసన్. ‘జయం’ రవి, నిత్యా మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఓ తమిళ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ‘కాదలిక్క నేరమిల్లై..’ (ప్రేమించటానికి సమయం లేదు) పాటని శ్రుతి పాడనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment