Shyam Singha Roy Movie Review And Rating In Telugu - Sakshi
Sakshi News home page

Shyam Singha Roy Review: ‘శ్యామ్‌ సింగరాయ్‌’ ఎలా ఉందంటే

Published Fri, Dec 24 2021 1:12 PM | Last Updated on Sat, Dec 25 2021 7:32 AM

Shyam Singha Roy Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌ : శ్యామ్‌ సింగరాయ్‌
నటీనటులు : నాని, సాయి పల్లవి, కృతిశెట్టి, మడొన్నా సెబాస్టియన్‌, రాహుల్‌ రవీంద్ర,జిస్సు సేన్ గుప్తా, అభినవ్‌ గౌతమ్‌,మురళీశర్మ తదితరులు
నిర్మాణ సంస్థ : నిహారిక ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత : వెంకట్ బోయనపల్లి
రచన : జంగా సత్యదేవ్ 
దర్శకత్వం : రాహుల్‌ సాంకృత్యన్‌
సంగీతం : మిక్కీ జే మేయర్‌
సినిమాటోగ్రఫీ : సను జాన్ వర్గేసే
ఎడిటర్‌ : నవీన్‌ నూలి
విడుదల తేది : డిసెంబర్‌ 24,2021

సినిమా ఫలితాలను పట్టించుకోకుండా.. కొత్త జానర్స్‌ని ట్రై చేస్తూన్నాడు నేచురల్‌ స్టార్‌ నాని. అయితే గత రెండేళ్లేగా నానికి సరైన హిట్‌ మాత్రం దక్కలేదు. ఇటీవల విడుదలైన ‘టక్‌ జగదీష్‌’కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో ఈ సారి ఎలాగైన హిట్‌ కొట్టాలనే కసితో ‘శ్యామ్‌ సింగరాయ్‌’గా దాదాపు రెండేళ్ల తర్వాత థియేటర్స్‌ ద్వారా  ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావడం.. దానికి తోడు మూవీ ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘శ్యామ్‌ సింగరాయ్‌’పై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య శుక్రవారం(డిసెంబర్‌ 24)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. 

‘శ్యామ్‌ సింగరాయ్‌’కథేంటంటే
వాసు అలియాస్‌ వాసుదేవ్‌(నాని)కి సినిమాలు అంటే పిచ్చి. ఎప్పటికైనా పెద్ద డైరెక్టర్‌ కావాలని కలలు కంటుంటాడు. తన లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు ముందుగా ఓ షార్ట్‌ ఫిలీం తీయాలని డిసైడ్‌ అవుతాడు. దాంట్లో నటించేందుకు కీర్తి(కృతిశెట్టి)ని ఒప్పిస్తాడు. అనుకున్నట్లే తాను తీసిన షార్ట్‌ ఫిలీం ఓ ప్రొడ్యూసర్‌కి నచ్చడం...వెంటనే సినిమా ఆఫర్‌ ఇవ్వడం.. అది కూడా సూపర్‌ హిట్‌ కొట్టడంతో వాసు దశ మారిపోతుంది. తాను తీసిన తొలి సినిమానే హిందీలో రీమేక్‌ చేసే చాన్స్‌ వస్తుంది. ఓ నిర్మాణ సంస్థ అతనితో కొత్త సినిమా ఒప్పందం కుదుర్చుకొని, మీడియా సమావేశం పెడుతుంది. ఇదే సమయంలో కాపీ రైట్స్‌ కేసు కింద వాసు అరెస్ట్‌ అవుతాడు. ఈ కేసును ఎదుర్కొనే క్రమంలో వాసుకి శ్యామ్‌ సింగరాయ్‌, దేవదాసి మైత్రి(సాయి పల్లవి) గురించి తెలుస్తోంది. అసలు శ్యామ్‌ సింగరాయ్‌ ఎవరు? వాసుకి, శ్యామ్‌ సింగరాయ్‌కి సంబంధం ఏంటి? వాసుపై కాపీరైట్స్‌ కేసు ఎవరు, ఎందుకు వేశారు? మైత్రి, శ్యామ్‌ సింగరాయ్‌ల ప్రేమ వ్యవహారం ఎక్కడికి దారి తీసింది? ఈ లీగల్‌ సమస్యల్లోనుంచి వాసు ఎలా బయటపడ్డాడు?అనేదే మిగతా కథ.

ఎవరెలా చేశారంటే?
ఎప్పటి మాదిరే నాని తన పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. వాసు అనే అప్‌కమింగ్‌ డైరక్టర్‌ పాత్రతో పాటు విప్లవ రచయిన శ్యామ్‌ సింగరాయ్‌ అనే పాత్రలోనూ ఒదగిపోయాడు. ఒకే సినిమాలో రెండు విభిన్నమైన పాత్రలను అవలీలగా పోషించాడు. ముఖ్యంగా శ్యామ్‌ సింగరాయ్‌ అనే బరువైన పాత్రలో అద్భుతంగా నటించి.. మరోసారి నేచురల్‌ స్టార్‌ అనిపించుకున్నాడు. ఇక ఈ సినిమాలో నాని తర్వాత బాగా పండిన పాత్ర సాయిపల్లవిది. దేవదాసి మైత్రి అలియాస్‌ రోజీ పాత్రలో సాయి పల్లవి జీవించేసింది. తెరపై సరికొత్తలో లుక్‌లో కనిపించింది. సినిమా ప్రమోషన్స్‌లో చెప్పినట్లుగా.. తెరపై సాయి పల్లవి కనిపించదు.. కేవలం దేవదాసి మైత్రి మాత్రమే ప్రేక్షకులకు కనిపిస్తుంది. ఈ సినిమా కోసం సాయి పల్లవి పడ్డ కష్టమంతా తెరపై కనిపిస్తుంది. వాసు ప్రేయసి కీర్తి పాత్రలో కృతిశెట్టి మెప్పించింది. నాని, కృతిశెట్టిల మధ్య వచ్చే రొమాంటిక్‌ సీన్‌ బాగా పండింది.  లాయర్‌ పద్మావతిగా  మడొన్నా సెబాస్టియన్‌ పర్యాలేదనిపించింది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

ఎలా ఉందంటే..?
పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. 1969 బ్యాక్‌ డ్రాప్‌ కథని నేటికి ముడిపెట్టి  చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు రాహుల్‌ సాంకృత్యన్‌. ఫస్టాఫ్‌ అంతా నానీ శైలీలో సరదాగా సాగేలా పాత్రలను తీర్చిదిద్దిన దర్శకుడు.. అసలు కథని సెకండాఫ్‌లో చూపించాడు. టైటిల్‌ జస్టిఫికేషన్‌ ప్రకారం చెప్పాలంటే.. సెకండాఫ్‌ నుంచే ‘శ్యామ్‌ సింగరాయ్‌’సినిమా మొదలవుతుంది. సినిమా కథంతా ‘శ్యామ్‌ సింగరాయ్‌’చుట్టే తిరుగుతుంది. విప్లవ రచయితగా శ్యామ్‌ సింగరాయ్‌ పోరాటం.. దేవదాసి మైత్రితో ప్రేమాయణం, దేవదాసిల వ్యవస్థలోని లోపాలను అద్బుతంగా తెరకెక్కించాడు. జంగా సత్యదేవ్‌ రాసిన కథని ఎక్కడా డీవియేట్‌ కాకుండా తెరపై చక్కగా చూపించాడు. ‘ఒక తూటా ఒక్కరికే ...ఒక అక్షరం లక్షల మందిని కదిలిస్తుంది’అనే ఒకే ఒక డైలాగ్‌తో శ్యామ్‌ సింగరాయ్‌ వ్యక్తిత్వం ఏంటి? అతని లక్ష్యం ఏంటో ప్రేక్షకులకు తెలియజేశాడు.

అయితే కథలో పెద్దగా ట్విస్ట్‌లు లేకపోవడం, ప్రేక్షకుడి ఊహకి అందేలా కథనం సాగడం సినిమాకి మైనస్‌. ద్విపాత్రాభినయం సినిమాలలో ఫస్టాఫ్‌ అంతా సింపుల్‌గా నడిపించడం.. అసలు కథని సెకండాఫ్‌లో చూపించడం కామన్‌. ఈ మూవీ కూడా అలాగే సాగుతుంది. ఇంటర్వెల్‌ వరకు శ్యామ్‌ సింగరాయ్‌ పాత్రని చూపించొద్దు కాబట్టి.. కథంతా వాసు, కీర్తిల చుట్టూ తిప్పారు. దర్శకుడిగా అతను పడే కష్టాలు.. కీర్తితో ప్రేమ.. ఇలా సాదా సీదాగా ఫస్టాఫ్‌ని ముగించాడు. ఇక సెకండాఫ్‌లో పూర్తిగా శ్యామ్‌ సింగరాయ్‌ గురించే ఉంటుంది. స్క్రీన్‌ప్లే కూడా అంతంత మాత్రంగా ఉంది. అయితే శ్యామ్‌ సింగరాయ్‌ గురించే తెలుసుకోవాలని సినిమా స్టార్టింగ్‌ నుంచి మనకి అనిపిస్తుంది కాబటి... స్క్రీన్‌ప్లే పెద్దగా ఇబ్బంది అనిపించదు.  క్లైమాక్స్‌ కూడా సింపుల్‌గా ఉంటుంది.  



ఇక సాంకేతిక విషయానికొస్తే.. మిక్కీ జే మేయర్‌ సంగీతం బాగుంది. సిరివెన్నెల రాసిన ‘నెలరాజుని… ఇల రాణిని కలిపింది కదా… సిరివెన్నెల’అంటూ సాగే పాట మరోసారి సిరివెన్నెలను స్మరించుకునేలా చేస్తుంది. మిగతా పాటలు అంతంత మాత్రమే అయినప్పటికీ.. నేపథ్య సంగీతం మాత్రం అదిరిపోయింది. సను జాన్ వర్గేసే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఆర్ట్ డిపార్టమెంట్ వర్క్ కూడా హైలెట్. నవీన్‌ నూలి  ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్టుగా ఉన్నాయి. 

- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement