![Singer Geeta Dutt Birthday 23 November Special Story - Sakshi](/styles/webp/s3/article_images/2020/11/22/geeta.jpg.webp?itok=VWe_5Kv6)
గీతాదత్, వహీదా రెహమాన్, గురుదత్, గీతాదత్
‘వక్త్ నే కియా క్యా హసీ సితమ్
హమ్ రహేన హమ్ తుమ్ రహేన హమ్’...
కళ కూడా జీవితాల పై ప్రభావితం చూపిస్తుందా అనిపిస్తుంది ఒక్కోసారి. గీతాదత్ ‘కాగజ్ కే ఫూల్’ (1959)లో పాడిన ఆ పాట ఆమె భవిష్యత్తును సూచిస్తోంది. కాలం చూపబోతున్న అందమైన ప్రతీకారాన్ని అది సంకేతపరిచిందా? చెప్పలేము. గీతారాయ్. ఎస్. అదే అసలు పేరు ఆమెది. కాని దర్శకుడు గురుదత్‌ను వివాహం చేసుకోవడం వల్ల గీతా దత్ అయ్యింది. మంచినీటి వంటి గొంతు కలిగిన ఈ గాయని లతా మంగేష్కర్ కంటే ముందు సురయ్యా, షంషాద్ బేగంల జమానాలో సూపర్‌స్టార్. అప్రమేయంగా పాట పాడటం ఆమెకు వచ్చు. గొంతు సవరించుకోవడం, ఈ శృతి ఎక్కువో తక్కువో అని నసగడం ఆమె ఎరగదు. కోల్‌కతా నుంచి పాటను తన జడపువ్వుగా ధరించి ముంబై చేరుకుంది. ఎన్నో పాటలను సువాసనలుగా వెదజల్లింది. అయితే ఇంకొన్నాళ్లు నిలిచి ఉండకుండా ఎండి తొందరగా రాలిపోయింది.
‘మేరా సుందర్ సప్‌నా బీత్ గయా’ అనేది ఆమె ‘దో భాయ్’ (1947)లో పాడిన చాలా పెద్ద హిట్ పాట. అందమైన కల గడిచిపోయిందని ఆ పల్లవికి అర్థం. అందమైన కలను కనడం అది తొందరలోనే గడిచిపోవడం గీతాదత్ జీవితంలో కూడా జరిగింది. ఆమె గురుదత్ స్టార్ డైరెక్టర్ కాక మునుపే, చిన్న స్థాయి నటుడిగా ఉండగానే అతణ్ణి ఇష్టపడి వివాహం చేసుకుంది. ఆ సమయానికి ఇండస్ట్రీలో ఆమె అధికురాలు. గురుదత్ ఆమెను నిజంగానే ప్రేమించాడు. వారిది ప్రేమపూర్వక జంటగా ఉంది. అతడు నట–దర్శకుడిగా, ఆమె గాయనిగా ఇండస్ట్రీలో పెద్ద ప్రభావం చూపారు.
గీతా దత్ ఓ.పి.నయ్యర్, ఎస్.డి.బర్మన్‌లతో గొప్ప పాటలు ఇచ్చింది. నయ్యర్ సంగీతంలో గీతా పాడిన ‘బాబూజీ ధీరే చల్‌నా’ (ఆర్ పార్), ‘ఠండి హవా కాలి ఘటా’ (మిస్టర్ అండ్ మిసెస్ 55), ‘మేరా నామ్ చిన్‌చిన్‌చు’ (హౌరా బ్రిడ్జ్) ప్రేక్షకులను అత్యంత ప్రీతిపాత్రమయ్యాయి. గీతా పాడిన ‘చిన్ చిన్ చు’తో హెలెన్ డాన్సింగ్ స్టార్ అయ్యింది. ఇక ఎస్.డి, బర్మన్‌తో గీతాది తిరుగులేని జోడి. ఆయన కోసం ఆమె పాడిన ‘తద్‌బీర్ సే బిగ్‌డీ హుయీ’ (బాజీ), ‘జానే క్యా తూనే కహీ’ (ప్యాసా) యాభై ఏళ్లు గడిచిపోయినా నేటికీ మన్ చాహే గీత్‌లో నిత్యం వినపడుతూనే ఉన్నాయి.
గీతా దత్, గురుదత్‌ల పెళ్లి 1953లో జరిగింది. గురుదత్ 1956లో దేవ్ ఆనంద్‌ను పెట్టి ‘సి.ఐ.డి’ తీశాడు. హైదరాబాద్ వచ్చి ఒక తెలుగు అమ్మాయి నచ్చింది అని ఆ సినిమాలో ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ అమ్మాయే వహీదా రహెమాన్. ఆ తర్వాత వహీదా రహెమాన్ ‘ప్యాసా’, ‘కాగజ్ కే ఫూల్, ‘సాహిబ్ బీవీ ఔర్ గులామ్’ తదితర గురుదత్ సినిమాలలో పని చేసి స్టార్ అయ్యింది. ఆమెను గురుదత్ నటిగా తీర్చిదిద్దాడు. కాని ఆ ప్రయాణంలో ఆమెతో ప్రేమలో పడ్డాడు.
గురుదత్ ముందు నుంచి సున్నిత మనస్కుడు. అతడు గీతా దత్‌తో ప్రేమను నిలబెట్టుకోవడానికి వహిదా రహెమాన్‌తో ప్రేమను కొనసాగించడానికి సతమతమయ్యాడని అంటారు. తన మీద చూపవలసిన ప్రేమ పంపకానికి గురవుతున్నదని భావించిన గీతా దత్ మెల్లగా మద్యం ఇచ్చే మత్తులోకి వెళ్లిపోయింది. గురుదత్ ఆమె పరిస్థితి చూసి కాపురం నిలబెట్టుకోవడానికి ఆమెను హీరోయిన్‌గా పెట్టి తొలి సినిమాస్కోప్ చిత్రంగా ఒక భారీ సినిమా మొదలెట్టాడు కూడా. అయితే ఆ సినిమా షూటింగ్ కొనసాగలేదు.
గురుదత్ గీతాదత్‌కు ముగ్గురు పిల్లలను ఇచ్చి అగమ్యమైన భవిష్యత్తును ఇచ్చి 1964లో మరణించాడు. అతడిది ఆత్మహత్య అని అంటారు. ఆ తర్వాత గీతా దత్ 1972 వరకూ జీవించి మరణించింది. మరణించేనాటికి ఆమె వయసు కేవలం 41. గీతాదత్‌ది వంకలేని గొంతు. ఇంటి వాకిలికి సుందరంగా అల్లుకున్న సన్నజాజి తీవలా ఉంటుంది. పూసిన పూలు ఆగి ఆగి తెమ్మెరతో పాటు తమ గంధాన్ని పంచినట్టు ఆమె పాటలు స్పందనలు పంచుతూ ఉంటాయి.
‘ఏ లో మై హారీ పియా’ (ఆర్ పార్), ‘జానే కహా మేరా జిగర్ గయా జీ’ (మిస్టర్ అండ్ మిసెస్ 55), ‘పియా ఐసో జియా మే సమా గయేరే’ (సాహిబ్ బీవీ ఔర్ గులామ్)... ఎన్ని పాటలని.ఇన్ని పాటలు పాడిన గీతాదత్ కాపురం ఛిద్రమయ్యాక, భర్త చనిపోయాక పాటలు లేక స్టేజ్ ప్రోగ్రామ్‌లు చేయాల్సి వచ్చింది. కొన్ని అన్నీ మన కళ్ల ముందే జరుగుతుంటాయి. శిఖరం ఏర్పడుతుంది. శిఖరం కరిగి పోతుంది. ఆ ఎగిరి విరిగిపడే లోపు విరజిమ్మే వెలుగులు మాత్రం మనలో నిలిచిపోతాయి. గీతా దత్‌ను తలుచుకోవడం అంటే పుస్తకంలో ఏనాడో దాచుకున్న నెమలీకను తెరచి స్పృశించడమే. ఏ కైసా హై నగ్మా ఏ క్యా దాస్తాహై బతా అయ్ మొహబ్బత్ మేరా దిల్ కహా హై.
– సాక్షి ఫ్యామిలీ
Comments
Please login to add a commentAdd a comment