సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘సీతారామం’తో పాన్ ఇండియా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న హను రాఘవపూడి మన బిడ్డే. కొత్తగూడెం గణేష్ టెంపుల్ గల్లీలో పుట్టి పెరిగి సినిమా ఇండస్ట్రీలో అందాల రాక్షసితో ప్రయాణం మొదలెట్టి ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ దర్శకుల లిస్టులో చోటు సాధించారు. తాను చదివిన కాలేజీలో ఏర్పాటు చేసిన ఫంక్షన్‌లో పాల్గొనేందుకు చాన్నాళ్ల తర్వాత ఆయన కొత్తగూడెం వచ్చారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఆయన ముచ్చటించారు. కొత్తగూడెంతో తనకున్న అనుబంధం నెమరు వేసుకున్నారు, ఆ జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే..
అసలు సినిమా ఆలోచనే లేదు..
నాన్న సన్యాసిరావు సింగరేణిలో ఉద్యోగం చేసేవారు. అమ్మ సూర్యకుమారి కోర్టులో ఎంప్లాయిగా ఉండేవారు. మా ఫ్యామిలీ గణేష్ టెంపుల్ వెనుక గల్లీలో ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏరియాలో ఉండేది. టెన్త్ వరకు రామవరం సింగరేణి స్కూల్‌లో, ఇంటర్మీడియట్ కృష్ణవేణి కాలేజీలో, డిగ్రీ వివేకవర్థిని కళాశాలలో చదివాను. చిన్నప్పుడు అసలు సినిమాల్లోకి వెళ్లాలనే ఆలోచనే లేదు. అమ్మ చెప్పినట్టు బుద్ధిగా చదువుకోవడం మంచి మార్కులు తెచ్చుకోవడం మీదనే ధ్యాస ఉండేది. సినిమాలు చూడటం కూడా తక్కువే.
స్వాతికిరణం చూశాక..
చిన్నతనంలో ఓసారి మా అమ్మ దుర్గా టాకీస్‌లో స్వాతికిరణం సినిమాకు తీసుకెళ్లింది. ఆ వయసులో ఆ సినిమా నాకు విపరీతంగా నచ్చేసింది. అప్పటి వరకు సినిమాల మీద ఇంట్రెస్ట్ లేని నాకు ఆ సినిమాతో ఒక్కసారిగా సినిమాకి దర్శకుడు అనే వ్యక్తి ఎవరు ? అతను ఎలా ఆలోచిస్తాడు అనే అంశాలపై ఆసక్తి పెరిగింది. వెంటనే స్వాతికిరణం దర్శకుడు కే.విశ్వనాథ్ గురించి తెలుసుకోవడం ప్రారంభించాను. ఎంజీ రోడ్‌లో సంతోష్ వీడియో లైబ్రరీ నుంచి విశ్వనాథ్ గారి సినిమా క్యాసెట్లు అద్దెకు తీసుకెళ్లి సినిమాలో ఇంకో కోణంలో చూడటం మొదలెట్టాను. శంకరాభరణం సినిమా లెక్కలేనన్ని సార్లు చూశాను. అలా సినిమాలపై ఇష్టం పెరుగుతూ పోయింది. అయినప్పటికీ బుద్ధిగా చదువుతూనే ఎంసీఏలో ఉండగా సినిమాల్లోకి షిఫ్ట్ అయ్యాను.
ఆల్జీబ్రాకు బదులు స్క్రిప్ట్ రైటింగ్..
శంకరాభరణం తర్వాత కథకుడు, దర్శకుడు కావాలనే ఆలోచనకు బీజం పడింది. ఓ వైపు క్లాసులో టీచర్లు పాఠాలు చెబుతుంటే మరోవైపు నా మనసులో కథలు అందులోని పాత్రలు మెదిలేవి. ఇంటర్మీడియట్‌లో ఉన్నప్పుడు ఓ పత్రికలో కథల కాంపిటీషన్ అంటూ ప్రకటన వచ్చింది. దీంతో ఓ స్టోరీ రాసేసి ప్రైజ్ కొట్టేద్దామనుకున్నా. కాలేజీలో కోటేశ్వరరావు సార్ మ్యాథ్స్ క్లాస్ చెబుతున్నారు. నేను పైకి ఊ కొడుతూనే ‘హంతకుడు’ పేరుతో మంచి క్రైం స్టోరీ రాసేస్తున్నా. కాసేపటికి సార్‌కి డౌట్ వచ్చి నా నోట్స్ చెక్ చేశారు. అక్కడ ఆల్జీబ్రా బదులు ‘హంతకుడు’ కనిపించింది. అంతే అక్కడే సార్ వాయించేశారు. ఆ తర్వాత క్లాస్ బయట నిల్చోబెట్టారు. ఇప్పుడదొక స్వీట్ మెమరీగా మిగిలిపోయింది.
ఆ తర్వాత వీపు వాయించేశారు..
ఇంటర్‌లోకి వచ్చాక సినిమాలపై ఇష్టం బాగా పెరిగిపోయింది. పైగా కొత్తగూడెంలో సినిమా థియేటర్లు అన్నీ కృష్ణవేణి కాలేజీకి దగ్గర్లోనే ఉండేవి. ఉదయం కాలేజీకి వెళ్లినట్టే వెళ్లి మధ్యలో క్లాసులు ఎగ్గొట్టి మా గ్యాంగ్ అంతా సినిమాలకు వెళ్లే వాళ్లం. క్లాసులో స్టూడెంట్స్ సంఖ్య తగ్గినట్టు కనిపిస్తే, కోటేశ్వరరావు సార్ సీడీ 100 బైక్ వేసుకుని థియేటర్లకు వచ్చేవారు. ప్రొజెక్టర్ రూమ్‌లో నిల్చుని స్టూడెంట్స్ ఎవరెవరు ఉన్నారు ? ఎక్కడ ఉన్నారో గమనించేవారు. అలా ఓసారి మేం గులాబీ సినిమా చూసేందుకు పరమేశ్వరి థియేటర్‌లో ఉండగా సార్ మమ్మల్ని పట్టేసుకున్నారు. ఆ తర్వాత అందరి వీపులు వాయించేశారు. దీంతో ఎప్పుడైనా కాలేజ్ టైంలో సినిమాలకు వెళితే ‘సీడీ హండ్రెడ్ బైక్ ’ వచ్చిందా అంటూ మధ్యమధ్యలో చెక్ చేసుకునే వాళ్లం.
నెక్ట్స్ సినిమాలో కొత్తగూడెం..
నేను ప్రేమకథలు బాగా తీస్తానని, నాకో బ్యూటీఫుల్ లవ్‌స్టోరీ ఉందనే భావన చాలా మందిలో ఉంది. వాస్తవం కంటే ఊహలు ఎప్పుడూ అందంగా ఉంటాయి. టీనేజ్‌లో కానీ కాలేజ్ డేస్‌లో కానీ నాకు లవ్‌స్టోరీస్ ఏమీ లేవు. స్టడీస్, కథలు రాయడం మీదనే ఫోకస్ ఉండేది. కాకపోతే లవ్ చేస్తే ఎలా ఉండాలనే భావనలతోనే కథలు రాసుకున్న. వాటితోనే అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ, పడి పడి లేచే మనసు, సీతారామం వంటి సినిమాలు తీశాను. ఇప్పటి వరకు చేసినవన్నీ ఊహల్లోంచి పుట్టుకొచ్చిన కథలే. అందాల రాక్షసిలో పాత కారు, పగిలిన అద్దంలోని హీరోయిన్ కనిపించే దృశ్యం మాత్రం కొత్తగూడెం నుంచి తీసుకున్నా.
నా చిన్నతనంలో గణేష్ టెంపుల్ గల్లీలో ఓ పాత కారు పార్క్ చేసి ఉండేది. కాలేజీకి, స్కూల్‌కు వెళ్లేప్పుడు ప్రతీ రోజు దాన్ని దాటుకుంటూ వెళ్లేవాణ్ని. ఆ ఒక్క సీన్‌ని సినిమాలో చూపించాను. త్వరలో మైత్రీ మూవీస్‌కి చేయబోయే సినిమాలో రియల్ లైఫ్‌లో కొత్తగూడెంలో చూసిన సంఘటనలు, ఎదురైన అనుభవాల్లో కొన్నింటిని సెల్యూలాయిడ్ తెర మీద చూపించబోతున్నాను.
బ్యాడ్ బాయ్‌ని కాదండోయ్...
సినిమాలపై ఇంట్రెస్ట్ ఉన్నా చదువును ఏ రోజూ నిర్లక్ష్యం చేయలేదు. టెన్త్, ఇంటర్, డిగ్రీలో మంచి మార్కులే వచ్చాయి. డిగ్రీ ఫైనలియర్‌లో కొత్తగూడెం నుంచి ఖమ్మం షిఫ్ట్ అయ్యాను. అక్కడ బ్యాంక్ కాలనీలో ఉంటూ కవిత డిగ్రీ కాలేజీలో చదివాను. ఆ సమయంలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్‌కి లెక్కల ట్యూషన్ చెప్పేవాన్ని. ఇంటర్‌లో పడిన పునాది గట్టిగా ఉండటంతో అది సాధ్యమైంది. స్టూడెంట్‌గా ఇంగ్లిష్‌తో నాకు ఎప్పుడు తిప్పలే ఉండేవి. చాతకొండ మూర్తి సార్ అయితే ‘ఇంగి్లష్‌లో తక్కువ మార్కులు వచ్చాయంటూ , సమాధానం సరిగా చెప్పలేదంటూ’ ఎన్నిసార్లు కొట్టారో. అప్పుడు చెప్పిన పాఠాలు, తిన్న దెబ్బలు, సినిమాలపై నాకున్న ఇంట్రెస్ట్ అన్ని కలిపి నన్ను ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment