మామూలుగా ఉత్తరాది తారలు దక్షిణాదికి ఎక్కువగా వస్తుంటారు. ఈసారి కూడా నార్త్ నుంచి చాలామంది వచ్చారు. అలాగే సౌత్ నుంచి కూడా నార్త్‌కి వెళ్లారు. మన స్టార్స్‌ని బాలీవుడ్ రమ్మంది. ఈ ఏడాది హిందీ తెరపై కనిపించిన కొందరు సౌత్ స్టార్స్ గురించి తెలుసుకుందాం.
కెరీర్‌లో ఇరవైకి పైగా సినిమాలు చేసిన నాగచైతన్య నటించిన తొలి హిందీ చిత్రం ‘లాల్‌సింగ్ చడ్డా’. ఆమిర్ ఖాన్ టైటిల్ రోల్ చేసిన ఈ చిత్రంలో నాగచైతన్యది కీ రోల్. ఈ హిందీ చిత్రంలో గుంటూరుకు చెందిన తెలుగు కుర్రాడు బాలరాజు పాత్రను చేశారు నాగచైతన్య. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 11న విడుదలైంది.
ఇక విజయ్ దేవరకొండ హిందీ ప్రేక్షకులకు పరిచయం అయిన చిత్రం ‘లైగర్’. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 25న విడుదలైంది.
మరో హీరో అడివి శేష్ ‘మేజర్’తో హిందీ తెరకు పరిచయం అయ్యారు. ‘గూఢచారి’ చిత్రం తర్వాత హీరో అడివి శేష్, దర్శకుడు శశికిరణ్ తిక్క కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘మేజర్’. ముంబై 26/11 దాడుల్లో వీరమరణం పొందిన అమరవీరుడు ఎన్‌ఎస్‌జీ (నేషనల్ సెక్యూర్టీ గార్డు) కమాండో సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో తెరకెక్కించారు. ఈ చిత్రం జూన్ 3న విడుదలైంది.
అలాగే ఏపీ (ఆంజనేయ పుష్పక్ కుమార్)గా హిందీ ప్రేక్షకులకు హాయ్ చెప్పారు సత్యదేవ్. అక్టోబరు 25న రిలీజైన ‘రామసేతు’లోనే ఏపీగా సత్యదేవ్ కీ రోల్ చేశారు. అక్షయ్‌కుమార్ హీరోగా నటించిన ఈ సినిమాకు అభిషేక్ శర్మ దర్శకుడు. అయితే బాలీవుడ్‌కు కీలక పాత్ర ద్వారా కాకుండా సత్యదేవ్ హీరోగా పరిచయం కావాల్సింది. ఆఫ్ఘనిస్తాన్ బ్యాక్‌డ్రాప్‌లో జెన్నిఫర్ డైరెక్షన్‌లో ఆరంభమైన ఓ హిందీ చిత్రంలో సత్యదేవ్ హీరోగా కమిట్ అయ్యారు. కొంత షూటింగ్ జరిగాక ఈ సినిమా ఆగిపోయింది. దీంతో ‘రామసేతు’ సత్యదేవ్‌కి తొలి హిందీ చిత్రంగా నమోదైంది.
ఇక హీరోయిన్ల విషయానికి వస్తే... రష్మికామందన్నా బాలీవుడ్ ఎంట్రీ ‘గుడ్ బై’ చిత్రంతో కుదిరింది. అమితాబ్ బచ్చన్, రష్మికా మందన్నా, నీనా గుప్తా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం అక్టోబరు 7న విడుదలైంది. ఆసక్తికర విషయం ఏంటంటే... రష్మిక కెరీర్‌లో రిలీజైన తొలి హిందీ చిత్రం ‘గుడ్ బై’ అయినప్పటికీ ఆమె సైన్ చేసిన తొలి హిందీ చిత్రం మాత్రం ‘మిషన్ మజ్ను’. సిద్ధార్థ్ మల్హోత్రా, రష్మిక హీరో హీరోయిన్లుగా శాంతను భాగ్చీ తెరకెక్కించిన ‘మిషన్ మజ్ను’ డైరెక్టర్‌గా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో జనవరి 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఇక ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ షాలినీ పాండే ఓ లీడ్ యాక్ట్రస్‌గా హిందీ తెరకు పరిచయమైంది కూడా ఈ ఏడాదే. రణ్‌వీర్ సింగ్ హీరోగా దివ్యాంగ్ ఠక్కర్ దర్శకత్వంలో ఈ ఏడాది మేలో రిలీజైన ‘జాయేష్ భాయ్ జోర్ధార్’లో నటించారు షాలిని.
2023లో...
ఇక కొందరు తారల బాలీవుడ్ జర్నీ కూడా ఈ ఏడాది ఆరంభమైంది. కానీ వచ్చే ఏడాదే వారు హిందీ తెరపై కనిపించనున్నారు. కెరీర్‌లో డెబ్బై చిత్రాలు చేశాక బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు నయనతార. షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘జవాన్’ హిందీలో నయనతారకు తొలి చిత్రం. ఇటు అట్లీ చేస్తున్న తొలి హిందీ ఫిల్మ్ కూడా ‘జవాన్’ కావడం విశేషం. ఈ సినిమా వచ్చే జూన్ 2న రిలీజ్ కానుంది. ఇక 2005లో వచ్చిన తెలుగు ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లో హీరోగా నటిస్తున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. వీవీ వినాయక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.
మరోవైపు హీరో వరుణ్ తేజ్ బాలీవుడ్ ప్రయాణం ఈ ఏడాది నవంబరులో మొదలైంది. హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న సినిమాకు వరుణ్‌తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకి శక్తి ప్రతాప్‌సింగ్ దర్శకుడు. మరికొందరు స్టార్స్ కూడా వచ్చే ఏడాది హిందీ తెరపై కనిపించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment